మంత్రి జూపల్లి కృష్ణారావు
రవీంద్రభారతిలో అందెశ్రీ వర్ధంతి సభ
నవతెలంగాణ-కల్చరల్
తెలంగాణ భాష, సంస్కృతిని ప్రగాఢంగా ప్రేమించిన గొప్ప మానవతావాది అందెశ్రీ అని, ఆయన తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచారని సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్ రవీంద్ర భారతిలోని సమావేశ మందిరంలో మంగళ వారం జానపద వాగ్గేయకారుడు అందెశ్రీ వర్ధంతి సభ నిర్వహించారు. ఆయన చిత్రపటా నికి పూలమాలలు వేసి మంత్రి నివాళులర్పిం చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అందెశ్రీ రచించిన తెలంగాణ రాష్ట్ర గీతం చిర స్థాయిగా నిలిచిపోతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆయనకు చరిత్రలో సముచిత స్థానం కల్పిం చిందని చెప్పారు. సభకు అధ్యక్షత వహించిన సాంస్కృతిక సారథి అధ్యక్షులు డాక్టర్ వెన్నెల మాట్లాడుతూ.. అందెశ్రీ తన మాటల్లో, పాటల్లో అన్యాయం, వివక్షతల పట్ల ఆవేదన వ్యక్తం చేసేవారని గుర్తుచేశారు. అరుణోదయ సాంస్కృతిక మండలి అధ్యక్షురాలు విమలక్క, ప్రముఖ పత్రికా రచయిత పాశం యాదగిరి అందెశ్రీతో వారికున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఆయన మానవీయ హృదయం, నిరాడంబర జీవితం అందరినీ ఆకట్టుకున్నా యని, ఆయన ఆకస్మిక మరణం సాహితీ లోకానికి తీరని విషాదమని చెప్పారు.
సభకు స్వాగతం పలికిన భాషా సాంస్కృ తిక శాఖ సంచాలకుడు డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి మాట్లాడుతూ అందెశ్రీ రచించిన ‘జయ జయహే తెలంగాణ’ రాష్ట్ర గీతం నేడు ప్రతి తెలంగాణ బిడ్డ నోట మార్మోగుతోందని, అదే ఆయనకు ప్రభుత్వం అందిస్తున్న నిజమైన నివాళి అన్నారు. సాంస్కృతిక సారథి కళాకారు లు అందెశ్రీ రచించిన గీతాలను భావోద్వేగంగా ఆలపించారు. కార్యక్రమంలో సమాచార పౌర సంబంధాల శాఖ డైరెక్టర్ సింగం చరణ్ కౌశిక్, జర్నలిస్ట్ పిట్టల శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.






కామెంట్‌లు (0)