పూర్తి వివరాలతో సిద్ధంగా ఉండండి
సాగునీటి పారుదల అధికారులకు సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
తుమ్మిడిహెట్టి బ్యారేజ్‌కు సంబంధించిన పలు అంశాలపై మహారాష్ట్రతో నిరంతరం సంప్రదింపులు జరపాలని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి సాగునీటి పారుదల శాఖ అధికారులను ఆదేశించారు. ముంపునకు సంబంధించిన పూర్తి వివరాలతో సిద్ధంగా ఉండాలని సూచించారు. ఇప్పటికే చేసుకున్న ఒప్పందా లు, ఇతర అంశాలకు సంబంధించిన పత్రాలను అక్కడి ప్రభుత్వానికి అందజేయాలని సీఎం సూచించారు. మంగళవారం హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ నివాసంలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి తుమ్మిడిహెట్టి పై సీఎం సమీక్ష నిర్వహించారు. మహారాష్ట్రతో ఇటీవల జరిపిన చర్చలు, ఇతర అంశాలకు సంబంధించి అధికారులకు ముఖ్యమంత్రి పలు సూచనలు చేశారు. మహారాష్ట్రలో ముంపునకు గురయ్యే భూములకు తగిన పరిహారం చెల్లించడానికి సిద్ధంగా ఉన్నామని ఆయన స్పష్టం చేశారు. ఇందుకోసం అవసరమైన నిధులను జాయింట్ అకౌంట్లో ఉంచుతామన్నారు. భూముల ముంపుపై మహారాష్ట్ర ఎలాంటి సర్వే చేయించుకున్నా తమకు అభ్యంతరం లేదని తేల్చి చెప్పారు. బ్యారేజ్ విషయంలో అంతర్రాష్ట్ర సమన్వయానికి ప్రాధాన్యత ఇస్తూ, మహారాష్ట్రతో చర్చలను నిరంతరం కొనసాగించాలని సూచించారు. ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలపై స్పష్టతతో ముందుకెళ్లాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. మహారాష్ట్ర అధికారులకు కావాల్సిన సమాచారం ఎప్పటికప్పుడు అందించాలని సూచించారు. సమీక్షలో తెలంగాణ నీటిపారుదల సలహాదారు ఆదిత్యనాథ్ దాస్, ఇరిగేషన్ సెక్రెటరీ శ్రీధర్, ఈఎన్సీ రమేష్ బాబు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.







కామెంట్లు (0)