Magazines

హైద‌రాబాద్‌లో ఇండియా బ్లాక్‌ భారీ సభ!

54 నిమిషాల క్రితం

rally
avatar
balaji

ప్రచురించబడింది నవం 03, 2026 | 2 నిమిషాల చదవడం

రాంలీలా మైదాన్‌ ఆందోళనలే స్ఫూర్తి

త్వరలో తేదీ, వేదిక ఖరారు

స‌ర్ ర‌ద్దు, జ్ఞానేశ్ కుమార్ తొలగింపే ప్ర‌ధాన డిమాండ్లు

భాగ‌స్వామ్య ప‌క్షాల హాజ‌రు


న‌వ‌తెలంగాణ బ్యూరో - హైద‌రాబాద్
స‌ర్ ప్ర‌క్రియ‌ను ర‌ద్దు చేయాలి, సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించాలనే ప్ర‌ధాన డిమాండ్ల‌తో దేశ రాజ‌ధాని ఢిల్లీలో చేప‌ట్టిన నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న‌, బ‌హిరంగ స‌భ జ‌యప్ర‌దమైన నేప‌థ్యంతో అదే స్ఫూర్తితో హైద‌రాబాద్‌లో భారీ బ‌హిరంగ స‌భ‌ను నిర్వ‌హించాల‌ని ఇండియా బ్లాక్ నిర్ణ‌యించింది. ఇటీవ‌ల ఢిల్లీ వెళ్లిన సంద‌ర్భంలో పీసీసీ చీఫ్ మ‌హేశ్ కుమార్ గౌడ్‌, సీఎం రేవంత్ రెడ్డితో ఇదే విష‌యమై ఏఐసీసీ పెద్ద‌లు చ‌ర్చించిన‌ట్లు తెలిసింది. తొలుత కల‌క‌త్తా, చెన్నై, ల‌క్నో త‌దిత‌ర న‌గ‌రాల్లో బ‌హిరంగ స‌భ నిర్వ‌హిస్తే ఎలా ఉంటుం ద‌ని వారు స‌మాలో చ‌న‌లు చేశారు. అయితే క‌ల‌క‌త్తాలో కాంగ్రెస్ బ‌లం చాలా ప‌రిమితంగా ఉండ‌టంతో ఆ పార్టీ ఆధ్వ‌ర్యంలో మాజీ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ ఆధ్వ‌ర్యంలో ఆ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించాల‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌య్యాయి. కానీ ప్ర‌స్తుతం అక్క‌డ రాజ‌కీయ ప‌రిస్థితి ఆమెకూ ఆశాజ‌నకంగా లేద‌నే వాద‌న‌లు వినిపించాయి. దీంతో క‌ల‌క‌త్తాలో కాకుండా త్వ‌ర‌లో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌బోయే ఉత్త‌ర ప్ర‌దేశ్‌లో స‌భ నిర్వ‌హించాల‌నే అంశంపై త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లు న‌డిచాయి. ఇదే విష‌య‌మై అక్క‌డి స‌మాజ్ వాదీ పార్టీ నేత‌ల‌ను ఏఐసీసీ ప్ర‌తినిధులు సంప్ర‌దించారు. అఖిలేశ్ యాద‌వ్ బృందం ఇందుకు కొంత స‌మ‌యం కావాల‌ని అడ‌గ‌టంతో ల‌క్నోలో ఇప్పుడు కాకుండా కొద్ది రోజుల త‌ర్వాత భారీ నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న‌, బ‌హిరంగ స‌భ నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించారు.

ఇదే స‌మ‌యంలో ఉత్తరాదిన కాకుండా ద‌క్షిణాదిన ఇండియా బ్లాక్ నిర‌స‌న కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హిస్తే ఎలా ఉంటుంద‌నే అభిప్రాయాలు కూడా ఏఐసీసీ స‌మావేశంలో వ‌చ్చాయి. ఇందులో భాగంగా లౌకిక భావాలు బ‌లంగా వినిపించ‌గ‌లిగిన తెలంగాణ‌, త‌మిళ‌నాడు రాష్ట్రాల్లో స‌భ‌లు నిర్వ‌హించాల‌నే అంశాల‌ను ప‌రిశీలించారు. అయితే త‌మిళ‌నాడులో కాంగ్రెస్ కాకుండా టీవీకే అధికారంలో ఉండ‌టం, మొన్న‌టిదాకా మిత్ర‌ప‌క్షంగా ఉన్న డీఎంకేతో రాజ‌కీయంగా కొన్ని స‌మ‌స్య‌లు ఉండ‌టం త‌దిత‌ర కార‌ణాల రీత్యా... చెన్నైలో స‌భ నిర్వ‌హించేందుకు త‌గిన స‌మ‌యం తీసుకోవాల‌ని కాంగ్రెస్ పెద్ద‌లు నిర్ణ‌యించారు. ఈ క్ర‌మంలోనే హైద‌రాబాద్ పేరు తెర‌పైకి వ‌చ్చింది. దాంతో సీఎం రేవంత్ రెడ్డిని, పీసీసీ చీఫ్ మ‌హేశ్ కుమార్ గౌడ్‌తో ఏఐసీసీ అధ్య‌క్షుడు మ‌ల్లికార్జున ఖ‌ర్గే, కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్ గాంధీ ప్ర‌త్యేకంగా చ‌ర్చించారు. రాంలీలా మైదానంలో నిర్వ‌హించిన సమావేశానికి తెలంగాణ నుంచి పెద్ద ఎత్తున జ‌నాన్ని, కాంగ్రెస్ శ్రేణుల‌ను త‌ర‌లించిన దృష్ట్యా .. అదే ఉత్సాహంతో హైద‌రాబాద్‌లో బ‌హిరంగ స‌భ నిర్వహించాల‌ని వారు సీఎంకు, పీసీసీ చీఫ్‌న‌కు సూచించారు. ఇందుకు వారిద్ద‌రూ అంగీక‌రించ‌టంతో హైద‌రాబాద్ స‌భపై స్పష్ట‌త వ‌చ్చింది. అయితే న‌గ‌రంలో నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న, స‌భ, వాటిని నిర్వహించే తేదీ, వేదిక త‌దిత‌రాంశాలు ఖ‌రారు కావాల్సి ఉంద‌ని అధికార పార్టీ వ‌ర్గాలు తెలిపాయి.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్