ప్రభుత్వ బీమా పథకాలన్నీ ఒకే గొడుగు కిందకు
19న సిద్దిపేటలో జరిగే సభలో దరఖాస్తు విడుదల
అర్హులైన మహిళలందరికీ ఇందిరమ్మ చీరలు : ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలోని కోటి కుటుంబాలకు ఇందిరమ్మ బీమా పథకం అమలు కావాలనీ, అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం రాష్ట్రంలో వివిధ శాఖల్లో అమలవుతున్న బీమా పథకాలను ఒకే గొడుగు కిందకు తీసుకురావాలని సూచించారు. ఈ బీమా వల్ల ఉపాధి హామీ కూలీలతో పాటు లక్షలాది మంది పేదలు లబ్ధి పొందుతారని సీఎం ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఇప్పటికే అమలవుతున్న వివిధ రకాల బీమా పథకాల్లో జీవిత బీమా కింద రూ.2 లక్షలు, ప్రమాద బీమా కింద రూ.10 లక్షల వరకు అందిస్తున్నట్లు అధికారులు సీఎంకు వివరించారు.ఈ నెల 19న సిద్ధిపేటలో జరిగే బహిరంగ సభలో ప్రారంభించనున్న ఇందిరమ్మ బీమా, చీరల పంపిణీపై మంగళవారం హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ నివాసంలో అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి బీమా భద్రత అందుకుంటున్న వారిలో ఏ ఒక్కరినీ కూడా తప్పించడానికి వీల్లేదని అధికారులకు సూచించారు.
బీమా పథకంపై జిల్లా కలెక్టర్లు విస్తృతంగా ప్రచారం చేయాలని ఆదేశించారు. దరఖాస్తులను గ్రామస్థాయిలో అందుబాటులో ఉంచాలని సూచించారు. అర్హులైన ప్రతి మహిళకు ఇందిరమ్మ చీర అందాలని సీఎం ఆదేశించారు. చీరలను తక్షణమే అన్ని జిల్లాలకు తరలించాలన్నారు. ఇందిరమ్మ బీమా, చీరల పంపిణీపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు. చీరల పంపిణీలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి హెచ్చరించారు. సమీక్షలో సీఎంవో ముఖ్య కార్యదర్శి శేషాద్రి, ప్రత్యేక కార్యదర్శి శ్రీధర్, కార్యదర్శి మానిక్ రాజ్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, ప్లానింగ్ శాఖ కార్యదర్శి గౌరవ్ ఉప్పల్, ఓఎస్డీ వేముల శ్రీనివాసులు పాల్గొన్నారు.






కామెంట్‌లు (0)