11 నెలలుగా వేతనాల్లేవు..
మా కుటుంబాలు ఎలా గడవాలి ?
టిఫిన్ బాక్సులతో డీఈఓ ఎదుట స్వచ్ఛ కార్మికుల ఆవేదన
పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలి : స్వచ్ఛ కార్మికుల యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసు మాధవి
సిద్దిపేట కలెక్టరేట్ ఎదుట స్వచ్ఛ కార్మికుల
నవతెలంగాణ-సిద్దిపేట కలెక్టరేట్
‘
అసలే చాలీచాలని వేతనాలు.. దానికితోడు ఏడాదిగా వేతనాలు చెల్లించడం లేదు. ఇలాంటి దుర్భర పరిస్థితుల్లో మా కుటుంబాలు ఎలా గడవా లి. కారం మెతుకులు తింటూ కడుపు నింపుకుంటు న్నాం. మా పిల్లలకు కూడా అవే పెట్టాలంటే.. కన్న పేగు తట్టుకోలేకపోతున్నది. పండుగ పూట.. నాకు కొత్త బట్టలు కావాలమ్మా అని పిల్లలు అడిగితే.. కన్నీరు పెట్టుకోవడమే తప్పా.. కనీసం ఓ జత కొనివ్వలేని దుస్థితిలో ఉన్నాం’ అంటూ స్వచ్ఛ కార్మికులు తమ గోడును వెల్లబోసుకున్నారు. కారం మెతుకుల టిఫిన్ బాక్సులతో డీఈఓ ఎదుట తమ బాధను వెలిబుచ్చారు. ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న స్వచ్ఛ కార్మికులు(సీఐటీయూ అనుబంధం) రెండ్రోజుల రిలే నిరాహార దీక్షలో భాగంగా మంగళవారం కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టారు. ప్రభుత్వ మొండి వైఖరిని నిరసిస్తూ.. గేట్లను నెట్టుకుని కలెక్టరేట్లోనికి దూసుకెళ్లారు. దీంతో ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. ఈ సందర్భంగా స్వచ్ఛ కార్మికుల యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసు మాధవి మాట్లాడుతూ.. స్వచ్ఛ కార్మికులకు11 నెలలుగా వేతనాలు చెల్లించకపోవడంతో వారు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఏడాదిగా పెండింగ్లో ఉన్న వేతనాలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో స్వచ్ఛ కార్మికులకు 11 నెలల వేతనాలు బకాయిలు పడ్డాయన్నారు. వీటికి కారణమైన జిల్లా కలెక్టర్ పై రాష్ట్ర ముఖ్యమంత్రి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మిగతా జిల్లాలో లేని సమస్య సిద్దిపేట జిల్లాలోనే రావడం శోచనీయమన్నారు. ప్రభుత్వ పాఠశాలలో పరిసరాల పరిశుభ్రత, టాయిలెట్స్ క్లీనింగ్, పచ్చని చెట్లకు నీరు అందించడం తదితర పనులను స్వచ్ఛ కార్మికులు నిర్వహిస్తున్నారన్నారు. వారికి గుర్తింపు కార్డులు ఇవ్వాలని, వేతనాలను అమ్మ ఆదర్శ కమిటీ ద్వారా కాకుండా స్వచ్ఛ కార్మికుల బ్యాంకు ఖాతా ద్వారానే చెల్లించాలని డిమాండ్ చేశారు. వీరి ఆందోళనతో దిగివచ్చిన డీఈవో.. వారం రోజుల్లో పెండింగ్ వేతనాలు చెల్లిస్తామని హామీ ఇచ్చారు. దాంతో కార్మికులు దీక్షను విరమించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షులు నందబోయిన ఎల్లయ్య, జిల్లా కోశాధికారి జి.భాస్కర్, జిల్లా సహాయ కార్యదర్శి సిహెచ్.రవికుమార్, స్వచ్చ కార్మికుల యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు జోగు రాములు, జిల్లా అధ్యక్షురాలు ఎం.రజిత, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్.మల్లేశం, స్వాతి, వెంకటేశం, జితేందర్, రాజు, కవిత, సునీత, అనిత, లక్ష్మీ, ఎల్లవ్వ, గంగా, లలిత, రేణుక, సమీనబేగం, కళావతి, మహేశ్వరి వివిధ మండలాల స్వచ్ఛ కార్మికులు తదితరులు పాల్గొన్నారు






కామెంట్లు (0)