మోడీ సర్కారు కుతంత్ర రాజకీయమిదే
‘వీబీ గ్రామ్‌జీ’తో ఉపాధి గ్యారెంటీకి మంగళం
ఆహారభద్రతా చట్టానికి తూట్లు..కార్పొరేట్లకు గోదాములు
ఐక్యపోరాటాలు ఉధృతమవ్వాలి :ఏఐకేఎస్ మహాసభలో అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షులు ఎ.విజయ రాఘవన్
సారంపల్లి మల్లారెడ్డి నగర్ నుంచి అచ్చిన ప్రశాంత్
మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొట్టేందుకు వీలుగా దేశంలో రైతు, వ్యవసాయ కూలీల ఐక్యపోరాటాలు ఉధృతమవ్వాలని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షులు ఎ.విజయరాఘవన్ ఆకాంక్షించారు. సారంపల్లి మల్లారెడ్డి నగర్(నల్లగొండ)లో కొనసాగుతున్న ఏఐకేఎస్ 36వ మహాసభలో మంగళవారం ఆయన సౌహార్ద సందేశమిచ్చారు. ఆహారభద్రత చట్టానికి మోడీ సర్కారు తూట్లు పొడుస్తున్నదనీ, గోదాములను కార్పొరేట్లకు కట్టబెడుతున్నదని వివరించారు. ధాన్యం సేకరణ నుంచి కేంద్రం తప్పుకోజూస్తోందని విమర్శించారు. గ్రామీణ పేదలకు ఎంతో ఉపయుక్తంగా ఉన్న నరేగా చట్టాన్ని మోడీ సర్కార్ రద్దుచేసి వీబీ గ్రామ్‌జీ చట్టాన్ని తీసుకొచ్చి, ఉపాధి గ్యారెంటీ లేకుండా చేసిందని విమర్శించారు. మరోవైపు నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయనీ, దీనివల్ల సామాన్య ప్రజానీకం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నదని తెలిపారు. పాలసీలను ఆరెస్సెస్ రూపొందిస్తోంటే.. మోడీ సర్కారు వాటిని అమలు చేస్తున్నదని అన్నారు. వ్యవసాయ బావుల మోటార్లకు
స్మార్ట్‌మీటర్లు పెట్టడం దారుణమనీ, అలాచేస్తే రైతులకు కరెంటు సబ్సిడీ పోతుందని హెచ్చరించారు.
ఇప్పటికే యూపీ, మహారాష్ట్ర, ఏపీ పలు రాష్ర్టాల్లో వాటితో రైతులకు మోయలేనంత కరెంటు బిల్లులు వస్తున్నాయని ఉదహరించారు. వ్యవసాయ రంగం దెబ్బతింటే రైతుకే కాదు యావత్ ప్రజానీకానికీ నష్టదాయకమేననీ, దాని ప్రభావం వ్యవసాయ కూలీల మీద తీవ్రంగా ఉంటుందని హెచ్చరించారు. మోడీ సర్కార్ రాజ్యాంగ వ్యవస్థలను నిర్వీర్యం చేయడాన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా బలమైన ఉద్యమాలు వస్తున్నాయని తెలిపారు. ఢిల్లీ రైతాంగ పోరాటం మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కి నెట్టిందన్నారు. నీట్ పరీక్షా పేపర్ల లీకేజీకి వ్యతిరేకంగా యువత పెద్దఎత్తున రోడ్లెక్కి పోరాటం చేయడంతో కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేశారనీ, పోరాటానికి తలొగ్గి ఒక మంత్రి రాజీనామా చేయడం ఇదే మొదటి సారి అని చెప్పారు. ఇలాంటి ఐక్యపోరాటాలు మరింత బలోపేతం కావాలనీ, ఆ పోరాటంలో రైతులు, వ్యవసాయ కూలీలు భాగస్వామ్యం కావాలని విజయ రాఘవన్ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.






కామెంట్లు (0)