Magazines

ప్రభుత్వాస్ప్రతుల్లో పీపీపీ మోడ్‌లో ఎంఆర్‌‌ఐ సేవలు

1 గంట క్రితం

Damodar Raja Narasimha
avatar
Rajabapu Odela

ప్రచురించబడింది అక్టో 31, 2026 | 2 నిమిషాల చదవడం

రోగులకు ఉచితంగానే 
ఆ సేవలు

మహబూబ్‌నగర్‌‌ జీజీహెచ్‌లో పైలట్ ప్రాజెక్ట్‌

రెండేండ్లలో అన్ని జీజీహెచ్‌లలో అమలు :
సమీక్షలో ఆరోగ్య మంత్రి దామోదర్ రాజనర్సింహ

నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్‌

రాష్ట్రంలోని ప్రభుత్వాస్పత్రుల్లో ఎంఆర్‌ఐ సేవలను విస్తరించేందుకు పబ్లిక్ ప్రయివేటు పార్ట్‌నర్‌షిప్ (పీపీపీ) విధానాన్ని అమలు చేయాలని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. తొలుత మహబూబ్‌నగర్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో పైలట్ ప్రాజెక్టుగా ఈ విధానాన్ని ప్రారంభించి, రెండేండ్లలో అన్ని జీజీహెచ్‌‌లకు విస్తరించేలా కార్యాచరణ రూపొందించాలని సూచించారు. పీపీపీ విధానంలో ఎంఆర్‌ఐ సేవలు అందుబాటులోకి వచ్చినప్పటికీ రోగులకు ఈ పరీక్షలు పూర్తిగా ఉచితంగా అందుతాయని స్పష్టం చేశారు. శుక్రవారం హైదరాబాద్‌‌లోని కోటిలో గల టీజీఎంఎస్‌ఐడీసీ కార్యాలయంలో ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఇతర రాష్ట్రాల్లో ఎంఆర్‌ఐ సేవల నిర్వహణపై చేపట్టిన స్టడీ టూర్‌ వివరాలు, పీపీపీ విధానంతో ‌రోగులకు కలిగే ప్రయోజనం, రాష్ట్రవ్యాప్తంగా ఈ సేవలను విస్తరించే అవకాశాలపై చర్చించారు. ప్రస్తుతం అమలవుతున్న విధానంతో పోలిస్తే పీపీపీ విధానంలో ప్రభుత్వానికి సుమారు 20 శాతం మేర ఖర్చు తగ్గుతుందని అధికారులు మంత్రికి వివరించారు.

ఎంఆర్‌ఐ యంత్రాల కొనుగోలు, నిర్వహణకు అధిక వ్యయం కావడం, సాంకేతిక సమస్యలు తలెత్తడం వల్ల ఇప్పటికే ఈ సేవలు అందుబాటులో ఉన్న ఆస్ప్రత్లుల్లో సేవలకు అంతరాయం కలగటం వల్ల ప్రయివేటు ఆస్పత్రులను ఆశ్రయించాల్సి వస్తోందన్నారు. ఈ పరిస్థితిని అధిగమించేందుకు ఇతర రాష్ట్రాల్లో అనుసరిస్తున్న విధానాలపై వైద్యులు, ఆరోగ్యశాఖ అధికారులతో కూడిన ప్రత్యేక బృందం అధ్యయనం చేసిందనీ, తమిళనాడు సహా పలు రాష్ట్రాల్లో విజయవంతంగా అమలవుతున్న పీపీపీ విధానాలను పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించిందని తెలిపారు. రోగులకు అత్యాధునిక వైద్య పరీక్షలు అందుబాటులో ఉండాలనీ, ఆర్థిక కారణాలతో ఎవ్వరూ వైద్య పరీక్షలకు దూరం కాకూడదని స్పష్టం చేశారు. వైద్యులు సూచించిన రోగులకు ఎంఆర్‌ఐ పరీక్షలు పూర్తి ఉచితంగా అందేలా ఒప్పందాలు, విధివిధానాలు రూపొందించాలని అధికారులకు సూచించారు. మహబూబ్‌నగర్ జీజీహెచ్‌లో పైలట్ ప్రాజెక్టు అమలుకు అవసరమైన ఏర్పాట్లు చేపట్టి, దాని ఫలితాలను బట్టి రాష్ట్రవ్యాప్తంగా విస్తరణకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమీక్షలో ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి క్రిస్టినా జడ్ చొంగ్తు, టీజీఎంఎస్‌ఐడీసీ ఎమ్‌‌డీ గౌరవ్ ఉప్పల్, డాక్టర్ మర్రి చెన్నారెడ్డి టిమ్స్ డైరెక్టర్ నరేంద్ర కుమార్, డీఎంఈ వాణితో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.




ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్