ప్రభుత్వ భూముల పరిరక్షణ చారిత్రాత్మక విజయం : మంత్రి పొన్నం ప్రభాకర్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్ర ప్రభుత్వ న్యాయ పోరాటం ఫలించి వేలాది కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ స్థలాలు అన్యాక్రాంతం కాకుండా దక్కడంపై ముఖ్యమంత్రికి, న్యాయ వ్యవస్థకు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలంగాణ ప్రజల పక్షాన అభినందనలు, కృతజ్ఞతలు తెలిపారు. శుక్రవారం హైదరాబాద్ లోని గాంధీ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ‘ఓట్ బచావో - దేశ్ బచావో’ నినాదంతో కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున పోరాటం చేస్తోందని తెలిపారు. ఈ నిరసన ప్రదర్శనలో పాల్గొనేందుకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నుంచి మండల, బ్లాక్ అధ్యక్షులు, మార్కెట్ చైర్మన్లు, జిల్లా గ్రంథాలయ సంస్థల చైర్మెన్లు సహా ముఖ్య నాయకులందరూ ఢిల్లీకి తరలివెళ్లారని చెప్పారు. హైదరాబాద్ కు వచ్చే ముందు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ అమరుల త్యాగాల పట్ల గతంలో అమిత్ షా, ప్రధానమంత్రి నరేంద్రమోడీ అవమానకరంగా మాట్లాడారన్నారు. కేంద్ర హోంమంత్రిగా దేశంలో కీలక అంశాలను వదిలేసి అమిత్ షా పర్యటిస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా జనగణనలో కులగణన చేర్చాలని అమిత్ షాకు లేఖ రాస్తున్నట్టు తెలిపారు. బీజేపీ పాలనలో రాజ్యాంగబద్ధమైన స్వతంత్ర సంస్థలను నిర్వీర్యం చేస్తున్నారని, దేశవ్యాప్తంగా కుట్రపూరితంగా పేదల ఓట్లను తొలగిస్తున్నారని పొన్నం ఆరోపించారు. ప్రజాస్వామ్యం కోసమంటూ అమిత్ షా రోడ్డెక్కడం కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం చేస్తున్న పోరాట విజయమని ఆయన అభివర్ణించారు.






కామెంట్లు (0)