రాచకొండ ఎత్తిపోతలే శాశ్వత పరిష్కారం
పోరాటాలతోనే సాధించుకోవాలి
25 ఏండ్లుగా నిర్లక్ష్యం ఎందుకు ?
సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యురాలు టి. జ్యోతి
నవతెలంగాణ -సంస్థాన్ నారాయణపురం
నల్లగొండ జిల్లా ప్రజలకు సాగు, తాగునీరు అనేది ఓ జీవన్మరణ సమస్య అని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యురాలు టి.జ్యోతి అన్నారు. శివన్నగూడెం ప్రాజెక్టును పూర్తి చేయాలని, రాచకొండ ఎత్తిపోతల పథకానికి నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఐ(ఎం) యాద్రాదిభువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండల కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన పాదయాత్ర ఆదివారం రాత్రి పుట్టపాక గ్రామానికి చేరుకుంది. అక్కడ జరిగిన సభలో జ్యోతి మాట్లాడుతూ.. స్వాతంత్ర్యం వచ్చి 80 ఏండ్లవుతున్నా అభివృద్ధిలో వెనకబడిన మునుగోడు, దేవరకొండ వంటి ఫ్లోరిన్ ప్రభావిత ప్రాంత ప్రజలకు సాగునీటి వసతి కల్పించడంలో పాలకులు పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. అందుకోసం సీపీఐ(ఎం) నాయకులు చేస్తున్న పోరాటం న్యాయబద్ధమైనదని తెలిపారు. ఈ ప్రాంతాలకు నీళ్ళు అందించడంలో 25 ఏండ్లుగా పాలకులు ఎందుకు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారో సమాధానం చెప్పాలన్నారు. వెంటనే శివన్నగూడెం ప్రాజెక్టును పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. రాచకొండ ఎత్తిపోతల పథకానికి నిధులు మంజూరు చేసి పనులు ప్రారంభించాలన్నారు. ఈ ప్రాంతంలో ఒక ఏడాది వర్షాలు కురిస్తే.. ఆ తర్వాత వరుసగా నాలుగేండ్లు కరువే రాజ్యమేలుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. పాలకులు రాష్ట్ర అభివృద్ధిని మరిచి ఎవరి ప్రాంతాలను వారు అభివృద్ధి చేసుకుంటే ఈ ప్రాంత ప్రజలు ఎటుపోవాలని ప్రశ్నించారు. ఈ ప్రాంత ఎమ్మెల్యే ఏం చేస్తున్నారని నిలదీశారు.
నల్లగొండ జిల్లాలో అత్యధికంగా 11 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు మంత్రులు ప్రభుత్వానికి చెందిన వారే ఉన్నప్పటికీ ప్రజలకు సాగునీరు ఎందుకు అందించలేక పోతున్నారో చెప్పాలని జ్యోతి డిమాండ్ చేశారు. పోరాడితే తప్ప రాచకొండ ఎత్తిపోతలు సాధించుకోలేమన్నారు. ప్రజలకు అండగా సీపీఐ(ఎం) ముందుంటుందని, పార్టీకి అండగా ప్రజలు ఉండాలని కోరారు. ఈ ఏడాది ఎల్నినో ప్రభావం నేపథ్యంలో రైతులు పంటలు పండించొద్దని, నీటిని జాగ్రత్తగా వాడుకోవాలని మోడీ నుంచి ఎమ్మెల్యేల వరకు అందరూ సలహాలు ఇస్తున్నారే తప్ప ప్రత్యామ్నాయ మార్గాలను ఎందుకు ఆలోచించడం లేదని ప్రశ్నించారు. గుత్త పెట్టుబడుదారుల కోసం పనిచేసే పాలకులకు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. నేడు చౌటుప్పల్ ఆర్డీవో కార్యాలయం ముందు జరిగే మహాధర్నాను విజయవంతం చేయాలని కోరారు. అంతకుముందు గ్రామానికి వచ్చిన పాదయాత్ర బృందానికి మహిళలు పెద్దఎత్తున బతుకమ్మలతో స్వాగతం పలికారు. ప్రజానాట్యమండలి కళాకారులు ప్రదర్శించిన రైతు రాఘవయ్య వీధి నాటిక ప్రజలను ఎంతగానో ఆకర్షించింది. పిట్ట రాములు అధ్యక్షతన నిర్వహించిన ఈ సభలో పాదయాత్ర బృందం నాయకులు సుర్కంటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నర్సిరెడ్డి, గుంటోజు శ్రీనివాసాచారి, దోడ యాదిరెడ్డి, మల్లెపల్లి లలిత, కుక్కుడాల మంగమ్మ, అయిత రాజు గాలయ్య, గుండు జంగయ్య, దొంతగాని శంకరయ్య, ఆరుట్ల రాజు, ఉప్పలపల్లి బాలకృష్ణ, వెలిజాల సుందరయ్య, జనిగల యాదయ్య, కేసాని కృష్ణ, దూడ భరత్ రెడ్డి, సీనియర్ నాయకులు దోనూరు నర్సిరెడ్డి దొంతగొని పెద్దులు, మర్రి వసంత, మర్రి మహేందర్ రెడ్డి,శివశట్టి లాలయ్య, రావిరాల మల్లేష్, వర్కాల చంద్రశేఖర్, కేశిరెడ్డి జయమ్మ, కొత్త శ్రీకాంత్, కొంగరి మారయ్య, జోకు మహేష్, గాజుల మహేష్ పాల్గొన్నారు.






కామెంట్లు (0)