నవతెలంగాణ-హైదరాబాద్: అక్టోబర్ 10న జంతర్ మంతర్ వద్ద 'కాక్రోచ్ జనతా పార్టీ' (CJP) తలపెట్టిన నిరసన కార్యక్రమం నేపథ్యంలో.. శాంతిభద్రతల పరిస్థితిని సమీక్షించేందుకు ఢిల్లీ పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఉన్నతాధికారుల సమావేశం జరుగుతోంది. ఢిల్లీ పోలీస్ వర్గాల సమాచారం ప్రకారం, అధికారులు ప్రస్తుత పరిస్థితులను అంచనా వేయడంతో పాటు, ఈ నిరసన నేపథ్యంలో రాజధానిలో విధించిన ఆంక్షలపై సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలను చర్చిస్తున్నారు. నిరసన సమయంలో మెట్రో రైలు సేవలను పూర్తిగా నిలిపివేయకుండా చూడాలని, అలాగే భద్రతా ఏర్పాట్ల వల్ల ప్రయాణికులకు అనవసరమైన ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని సుప్రీంకోర్టు శుక్రవారం అధికారులను ఆదేశించిన నేపథ్యంలో ఈ సమావేశం జరుగుతోంది.
ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా కోరుతూ అక్టోబర్ 10న ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ర్యాలీకి సిద్ధమైన విషయం తెలిసిందే.రేపు కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) చేపట్టనున్న నిరసనకు సంబంధించి ఢిల్లీ పోలీసులు విధించిన కఠిన పరిమితులపై సుప్రీం అభ్యంతరం వ్యక్తం చేసింది. శుక్రవారం ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఢిల్లీ మెట్రో 57 స్టేషన్లను మూసివేయాలన్న నిర్ణయంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. మెట్రో స్టేషన్ల మూసివేత సాధారణ పౌరుల హక్కులను దెబ్బతీస్తుందని పేర్కొంది. ఆందోళనలకు, ప్రజల సౌకర్యాల మధ్య బ్యాలెన్స్ ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించింది.







కామెంట్‌లు (0)