అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలి: ఎమ్మెల్యే పవార్ రామరావు పటేల్
నవతెలంగాణ - ముధోల్
గ్రామాల అభివృద్ధే తమ ధ్యేయమని ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామరావు పటేల్ అన్నారు. సోమవారం మండల అభివృద్ధి కార్యాలయంలో నిర్వహించిన మండల స్థాయి ప్రత్యేక సమావేశానికి ఎమ్మెల్యే హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయా శాఖల అధికారులు గత 45 రోజుల్లో చేపట్టిన అభివృద్ధి పనులు, పూర్తయిన పనులు, చేపట్టబోయే పనుల వివరాలను అధికారులు ఎమ్మెల్యే కు తెలియజేశారు.
సమావేశంలో గ్రామాల్లో విద్యుత్ స్తంభాలు, విద్యుత్ సంబంధిత సమస్యలను, అభివృద్ధి పనులకు ఇసుక కొరత ప్రధాన సమస్యగా ఉందని, ఇసుక అందుబాటులో లేక పనులు ఆలస్యమవుతున్నాయని సర్పంచ్లు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే సంబంధిత విద్యుత్ శాఖ అధికారులతో మాట్లాడి పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. 45 రోజుల గడువులో ఎలాంటి సమస్యలు పెండింగ్లో ఉండకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
గ్రామపంచాయతీల వారీగా చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై సర్పంచ్లను అడిగి తెలుసుకున్నారు. పలు గ్రామాల్లో సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ప్రతి శాఖ అధికారి పూర్తి సమాచారంతో, సంబంధిత నివేదికలతో సమావేశాలకు హాజరు కావాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అంతకుముందు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరైన ఇళ్లకు సంబంధించిన ప్రోసీడింగ్ పత్రాలను ఎమ్మెల్యే అందజేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీలత, డీఎల్పీవో లక్ష్మణ్, ఎంపీడీవో లవకుమార్, ఎంపీవో శివకుమార్, ఆయా శాఖల అధికారులు, సర్పంచ్లు తదితరులు పాల్గొన్నారు.






కామెంట్లు (0)