నవతెలంగాణ-హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖలో క్రమ శిక్షణారాహిత్యం, సుదీర్ఘకాల అనధికారిక గైర్హాజరీపై రాష్ట్ర ప్రభుత్వం అత్యంత కఠినమైన చర్యలు చేపట్టింది. విధులకు తరచూ గైర్హాజరవుతూ రోగులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్న 70 మంది ప్రభుత్వ వైద్యులను ఉద్యోగాల నుంచి తొలగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ 70 మందితోనే కాకుండా, వివిధ దశల్లో గైర్హాజరవుతున్న మరొక 193 మంది వైద్యులపై కూడా తక్షణమే క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది.
గతంలో మే నెలలోనే డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పరిధిలో 51 మంది వైద్యులను విధి నిర్వహణలో అలసత్వం వహించినందుకుగాను ఉద్యోగాల నుంచి తొలగించింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యుల గైర్హాజరును ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించవద్దని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అధికారులకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశారు. డీఎంఈ, డీఎస్‌హెచ్‌ఎస్ అధికారులు సమర్పించిన సమగ్ర నివేదికలను పరిశీలించిన అనంతరం ... సుదీర్ఘకాలంగా అనధికారికంగా విధులకు దూరంగా ఉంటున్న వైద్యులపై ప్రభుత్వం ఈ కఠిన నిర్ణయం తీసుకుంది.







కామెంట్‌లు (0)