ఎల్బీ స్టేడియం ముందు ధర్నాలో స్పోర్ట్స్ స్టూడెంట్స్ ఫెడరేషన్ డిమాండ్
నవతెలంగాణ-హైదరాబాద్: తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ (శాట్) అవినీతిమయంగా మారిందని, ఈవెంట్ల పేరిట దోచుకున్న డబ్బును వెనక్కి తీసుకునేందుకు శాట్ నిధుల వ్యయంపై సీఐడి విచారణ చేపట్టాలని స్పోర్ట్స్ స్టూడెంట్స్ ఫెడరేషన్ డిమాండ్ చేసింది. క్రీడా రంగ సమస్యల పరిష్కారం కోరుతూ శుక్రవారం ఎల్బీ స్టేడియం ముందు స్పోర్ట్స్ స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మహా ధర్నా నిర్వహించారు. క్రీడాకారుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు బాబులాల్ ఈ సందర్భంగా ధర్నాలో మాట్లాడుతూ.. ‘తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత క్రీడా రంగానికి తీరని అన్యాయం జరుగుతోంది. ఇప్పటివరకు ఒక్క కోచ్ పోస్టును భర్తీ చేయలేదు. బడ్జెట్లో క్రీడలకు కేటాయింపులు భారీగా పెరిగినా, ఆ నిధులను అభివృద్ధి పనులకు వినియోగించడం లేదు. వందల్లో ఉన్న కోచింగ్ ఫీజును వేలల్లో పెంచారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను ఈవెంట్ల పేరిట దోచుకుంటున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్రీడా శాఖలో అవినీతిపై సీఐడీ విచారణకు ఆదేశించాలి. శాట్‌లో డిప్యుటేషన్లో పని చేస్తున్న అర్హత లేని ఉద్యోగులను వెంటనే వెనక్కి పంపించాలి. క్రీడా రంగ అభివృద్ధికి తక్షణమే కోచ్‌ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయాలని’ డిమాండ్ చేశారు. స్పోర్ట్స్ స్టూడెంట్స్ ఫెడరేషన్ ప్రతినిధులు రాజేష్, వినోద్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.







కామెంట్లు (0)