జైస్వాల్, రాహుల్ అర్థ సెంచరీలు
భారత్ తొలి ఇన్నింగ్స్ 159/1
న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ 368/10
వెల్లింగ్టన్
టెస్టు
రెండో రోజు
తొలి టెస్టులో టీమ్ ఇండియా ఎదురుదాడి మొదలైంది. హెన్రీ నికోల్స్ (175 నాటౌట్), గ్లెన్ ఫిలిప్స్ (118) 216 పరుగుల భారీ భాగస్వామ్యంతో ఆతిథ్య న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 368 పరుగులు చేసింది. రెండో రోజు బంతితో ఆకాశ్ దీప్ మెరువగా ఆఖరు ఐదు వికెట్లను భారత్ 82 పరుగులకే పడగొట్టింది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (85), కెఎల్ రాహుల్ (52 నాటౌట్) అర్థ సెంచరీలతో రాణించారు. జైస్వాల్ దూకుడుతో తొలి ఇన్నింగ్స్‌లో భారత్ మరో 209 పరుగుల వెనుకంజలోనే నిలిచింది.
నవతెలంగాణ-వెల్లింగ్టన్
భారత ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (85, 89 బంతుల్లో 16 ఫోర్లు), కెఎల్ రాహుల్ (52 నాటౌట్, 116 బంతుల్లో 5 ఫోర్లు) అర్థ సెంచరీలతో కదం తొక్కారు. ఓపెనర్లు తొలి వికెట్‌కు 130 పరుగుల భాగస్వామ్యంతో భారత్‌కు అదిరే ఆరంభం అందించారు. తొలి ఇన్నింగ్స్‌లో 39 ఓవర్లలోనే 159 పరుగులు చేసిన భారత్.. మరో 209 పరుగుల వెనుకంజలో కొనసాగుతోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి కెఎల్ రాహుల్ తోడుగా దేవదత్ పడిక్కల్ (16 నాటౌట్, 35 బంతుల్లో 3 ఫోర్లు) అజేయంగా క్రీజులో నిలిచాడు. అంతకముందు, న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 368 పరుగులు చేసింది. హెన్రీ నికోల్స్ (175 నాటౌట్, 335 బంతుల్లో 21 ఫోర్లు), గ్లెన్ ఫిలిప్స్ (118, 216 బంతుల్లో 14 ఫోర్లు) సెంచరీలతో ఆరో వికెట్‌కు 216 పరుగుల భారీ భాగస్వామ్యం నిర్మించారు. భారత బౌలర్లలో జశ్‌ప్రీత్ బుమ్రా (4/92), ఆకాశ్ దీప్ (3/53), అన్షుల్ కాంబోజ్ (2/69) రాణించారు.
ఓపెనర్లు అదరగొట్టారు
తొలి ఇన్నింగ్స్‌లో 26 బంతులకు భారత్ తొలి పరుగు చేసింది. టీ విరామానికి ముందు రాహుల్, జైస్వాల్ కాస్త ఇబ్బంది పడ్డారు. రాహుల్ 5 పరుగుల వద్ద హెన్రీ ఓవర్లో రివ్యూ నిరాకరణతో బతికిపోగా.. జైస్వాల్ 6 పరుగుల వద్ద ఫిలిప్స్ క్యాచ్ వదిలేయటంతో జీవనదానం పొందాడు. టీ విరామానికి 8 ఓవర్లలో భారత్ 16/0 పరుగులు చేసింది. ఈ సమయంలో టీమ్ ఇండియా ఒత్తిడిలో కనిపించింది. కానీ, బ్రేక్ తర్వాత యువ ఓపెనర్ జైస్వాల్ ఎదురుదాడి చేసేందుకు ఎక్కువ సమయం తీసుకోలేదు. డ్రైవ్స్ ఆడుతూ బౌండరీలు బాదిన జైస్వాల్.. ఆన్ డ్రైవ్‌తో 66 బంతుల్లోనే అర్థ సెంచరీ సాధించాడు. అర్థ సెంచరీ తర్వాత మరింత దూకుడుగా ఆడిన జైస్వాల్ 16 ఫోర్లతో 89 బంతుల్లోనే 85 పరుగులు చేశాడు. సెంచరీకి చేరువైన జైస్వాల్‌ను వికెట్ కీపర్ క్యాచ్‌కు రివ్యూ కోరిన కివీస్ తొలి బ్రేక్ సాధించింది. మరో ఓపెనర్ కెఎల్ రాహుల్ నెమ్మదిగా ఆడినా.. బౌలర్ల సహనాన్ని పరీక్షించాడు. ఐదు ఫోర్లతో 88 బంతుల్లో అర్థ సెంచరీ సాధించాడు. జైస్వాల్ దూకుడుతో కివీస్ బౌలర్లు లయ తప్పారు. అతడి నిష్క్రమణ తర్వాత మళ్లీ పరుగుల నియంత్రణతో బ్యాటర్లపై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేశారు. దేవదత్ పడిక్కల్ (16 నాటౌట్) సైతం మూడు ఫోర్లతో మెప్పించాడు. తొలి ఇన్నింగ్స్‌లో 39 ఓవర్లలో 159 పరుగులు చేసిన భారత్ ఒక్క వికెట్ కోల్పోయింది. మరో 9 వికెట్లు చేతిలో ఉండగా.. 209 పరుగుల వెనుకంజలోనే నిలిచింది. దీంతో మూడో రోజు ఆటలో భారీ ఆధిక్యంపై కన్నేసి భారత్ బరిలోకి దిగనుంది.
హెన్రీ అజేయ సెంచరీ
173 పరుగుల ఓవర్‌నైట్ భాగస్వామ్యంతో బ్యాటింగ్‌కు వచ్చిన హెన్రీ (175 నాటౌట్), ఫిలిప్స్ (118) జోడీని ఆకాశ్ దీప్ విడదీశాడు. ఆ తర్వాత ఓ ఎండ్‌లో వరుస వికెట్లు పడగొట్టారు. ఆఖరు 5 వికెట్లను భారత్ 82 పరుగులకే కూల్చింది. నాథన్ స్మిత్ (14), జెమీసన్ (11), మాట్ హెన్రీ (1), డఫ్ఫీ (4)లను ప్రసిద్, ఆకాశ్, బుమ్రా, కాంబోజ్ సాగనంపారు. హెన్రీ నికోల్స్ భారీ సెంచరీతో అజేయంగా నిలిచాడు.
స్కోరు వివరాలు
న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ : లేథమ్ (బి) బుమ్రా 0, కాన్వే (సి) పంత్ (బి) కాంబోజ్ 4, నికోల్స్ నాటౌట్ 175, రచిన్ (సి) పంత్ (బి) ఆకాశ్ 15, మిచెల్ (సి) జైస్వాల్ (బి) బుమ్రా 1, బ్లండెల్ (సి) గిల్ (బి) బుమ్రా 5, ఫిలిప్స్ (బి) ఆకాశ్ 118, స్మిత్ (ఎల్బీ) ప్రసిద్ 15, జెమీసన్ (సి) రాహుల్ (బి) ఆకాశ్ 11, హెన్రీ (ఎల్బీ) బుమ్రా 1, డఫ్ఫీ (సి) పంత్ (బి) కాంబోజ్ 4, ఎక్స్‌ట్రాలు : 20, మొత్తం : (121 ఓవర్లలో ఆలౌట్) 368.
వికెట్ల పతనం : 1-2, 2-12, 3-51, 4-52, 5-70, 6-286, 7-318, 8-343, 9-348, 10-368.
బౌలింగ్ : బుమ్రా 20-8-92-4, అన్షుల్ కాంబోజ్ 23-5-69-2, ఆకాశ్ దీప్ 23-7-53-3, ప్రసిద్ కృష్ణ 26-2-100-1, వాషింగ్టన్ సుందర్ 20-2-45-0.
భారత్ తొలి ఇన్నింగ్స్ : యశస్వి జైస్వాల్ (సి) బ్లండెల్ (బి) హెన్రీ 85, కెఎల్ రాహుల్ నాటౌట్ 52, దేవదత్ పడిక్కల్ నాటౌట్ 16, ఎక్స్‌ట్రాలు : 6, మొత్తం : (39 ఓవర్లలో 1 వికెట్) 159.
వికెట్ల పతనం : 1-130.
బౌలింగ్ : మాట్ హెన్రీ 12-3-43-1, కైల్ జెమీసన్ 11-5-15-0, జాకడ్ డఫ్ఫీ 10-0-72-0, నాథన్ స్మిత్ 6-0-29-0.







కామెంట్లు (0)