నవతెలంగాణ-హైదరాబాద్ : ప్రముఖ ఇన్వెస్టర్, రచయిత రాబర్ట్ కియోసాకి ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై సంచలన హెచ్చరికలు చేశారు. అమెరికా ప్రభుత్వం చేస్తున్న భారీ అప్పులు, ఫెడరల్ రిజర్వ్ విధానాల వల్ల భవిష్యత్తులో తీవ్ర ఆర్థిక సంక్షోభం తప్పదని ఆయన పేర్కొన్నారు. ద్రవ్యోల్బణం, ఏఐ వల్ల ఉద్యోగ భద్రతకు ముప్పు పొంచి ఉందని, అందుకే ప్రజలు బంగారం, బిట్‌కాయిన్ వంటి ఆస్తులపై దృష్టి సారించాలని సూచించారు. 2002లోనే తాను ఈ ప్రమాదాలను ఊహించానని చెబుతూ, ఆర్థిక పరిజ్ఞానాన్ని పెంచుకోవడం ద్వారానే ప్రజలు తమను తాము రక్షించుకోగలరని కియోసాకి స్పష్టం చేశారు.
ముఖ్యంగా.. అమెరికా ప్రభుత్వం చేస్తున్న భారీ అప్పులు, ఫెడరల్ రిజర్వ్ విధానాలు, డబ్బు ముద్రణ, ప్రపంచ ఆర్థిక మార్కెట్లలో పెరుగుతున్న రిస్క్‌ల వల్ల పెద్ద సంక్షోభం వచ్చే అవకాశం ఉందని కియోసాకి అభిప్రాయపడ్డారు. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని తాను ETFల ద్వారా కాకుండా.. నేరుగా బంగారం, వెండి, బిట్‌కాయిన్, ఎథీరియం వంటి ఆస్తులను కొనుగోలు చేస్తున్నట్లు వెల్లడించారు. వీటితో పాటు రియల్ ఎస్టేట్, చమురులో కూడా పెట్టుబడులు పెడుతున్నట్లు చెప్పారు.
కియోసాకి ప్రధానంగా అమెరికా ఆర్థిక వ్యవస్థలో పెరుగుతున్న అప్పుల గురించి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అమెరికా ప్రతి 90 రోజులకు ఒక ట్రిలియన్ డాలర్ల అప్పును పెంచుకుంటూ పోతోందని ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఒక ట్రిలియన్ డాలర్ అంటే 1,000 బిలియన్ డాలర్లు. అంటే ఒకటి తర్వాత 12 సున్నాలు ఉంటాయి. ఈ భారీ మొత్తంలో అప్పులు, డబ్బు సరఫరా పెరగడం వల్ల భవిష్యత్తులో డబ్బు విలువ తగ్గి ద్రవ్యోల్బణం పెరిగే ప్రమాదం ఉందన్నది ఆయన వాదన. ప్రభుత్వాలు, ఆర్థిక సంస్థలు తమ ప్రయోజనాలకే.. ప్రాధాన్యత ఇస్తున్నాయని, సామాన్య ప్రజల ఉద్యోగాలు, పొదుపు, పదవీ విరమణ నిధుల భద్రత గురించి సరైన శ్రద్ధ చూపడం లేదని విమర్శించారు.
కృత్రిమ మేధస్సు (AI) కారణంగా భవిష్యత్తులో ఉద్యోగ భద్రతకు ముప్పు ఏర్పడవచ్చని కూడా కియోసాకి అభిప్రాయపడ్డారు. ఇప్పటికే కొన్ని పెద్ద కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్నాయని, ఏఐ విస్తరణతో ఈ పరిస్థితి మరింత పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. అందుకే.. కేవలం ఉద్యోగం, జీతం, బ్యాంకు పొదుపులపైనే ఆధారపడకుండా ఆర్థిక పరిజ్ఞానాన్ని పెంచుకోవాలని సూచించారు.
2002లోనే తన 'రిచ్ డాడ్స్ ప్రాఫసీ' పుస్తకంలో ఇలాంటి ఆర్థిక ప్రమాదాల గురించి హెచ్చరించినట్లు కియోసాకి గుర్తుచేశారు. ప్రజలు ఆర్థికంగా ముందుగానే సిద్ధపడాలని, డబ్బు ఎలా పనిచేస్తుంది, పెట్టుబడులు ఎలా పెట్టాలి, ఆస్తులను ఎలా నిర్మించుకోవాలి అనే విషయాలు నేర్చుకోవాలని సూచించారు. ఇందుకోసం ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తున్న 'క్యాష్‌ఫ్లో క్లబ్స్'లో చేరాలని, లేదా సొంతంగా ఒక క్లబ్‌ను ప్రారంభించాలని పిలుపునిచ్చారు. ఇలాంటి సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని పేర్కొన్నారు.






కామెంట్లు (0)