కుట్టు మిషన్ల నిల్వ కేంద్రంగా మారిన రైతు వేదిక
దుమ్ము, ధూళితో నిండిన భవనం.. శిథిలావస్థకు చేరిన తలుపులు
నిర్వహణ లేకపోవడంతో విలువైన సామగ్రి మాయమయ్యే ప్రమాదం
రైతుల సమావేశాలకు నిర్మించిన భవనంలోనే ఏఈఓ కార్యాలయం!
నవతెలంగాణ కాటారం
రైతుల సమస్యలను చర్చించేందుకు, వ్యవసాయ రంగ అభివృద్ధికి సంబంధించిన సమావేశాలు నిర్వహించేందుకు ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన రైతు వేదికలు లక్ష్యం తప్పుతున్నాయా? రైతులందరూ ఒకచోట చేరి తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లాల్సిన భవనాలు నేడు నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనంగా మారుతున్నాయి. ఇందుకు కాటారం మండలంలోని రైతు వేదిక దుస్థితి అద్దం పడుతోంది.
రైతుల సమావేశాల కోసం ప్రత్యేకంగా నిర్మించిన రైతు వేదిక భవనంలో ఇందిరా క్రాంతి పథకానికి సంబంధించిన మహిళా సంఘాల కుట్టు మిషన్లను ఏడాదికాలంగా నిల్వ ఉంచడం విమర్శలకు తావిస్తోంది. దీంతో రైతుల సమావేశాలు నిర్వహించాల్సిన భవనం క్రమంగా నిల్వ కేంద్రంగా మారిపోయింది. భవనంలో దుమ్ము, ధూళి పేరుకుపోవడంతో పాటు కార్యాలయ నిర్వహణ కూడా అస్తవ్యస్తంగా తయారైంది. రైతులకు ఉపయోగపడాల్సిన వేదిక ఇతర అవసరాలకు వినియోగించబడుతుండటంపై రైతులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
శిథిలావస్థలో తలుపులు.. భద్రత గాలికి!
మరోవైపు రైతు వేదిక ప్రధాన ద్వారం శిథిలావస్థకు చేరి, ఎప్పుడు ఊడిపడుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. భవనంలో నిల్వ ఉంచిన కుట్టు మిషన్లతో పాటు మండల వ్యవసాయ శాఖ కార్యాలయానికి సంబంధించిన విలువైన సామగ్రి భద్రత ప్రశ్నార్థకంగా మారింది. తలుపులే సక్రమంగా లేని పరిస్థితిలో సామగ్రికి రక్షణ ఎలా ఉంటుందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించకపోతే విలువైన వస్తువులు మాయమయ్యే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
నిర్వహణ నిధులేవీ? పట్టించుకునే వారేరీ?
రాష్ట్రవ్యాప్తంగా రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం రైతు వేదికలను నిర్మించినప్పటికీ, వాటి నిర్వహణపై మాత్రం తగిన శ్రద్ధ చూపడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. భవనాల నిర్మాణానికే ప్రాధాన్యత ఇచ్చి, వాటి నిర్వహణ, మరమ్మతులు, పరిశుభ్రత కోసం అవసరమైన నిధులు కేటాయించకపోవడంతో అనేక ప్రాంతాల్లో రైతు వేదికలు క్రమంగా శిథిలావస్థకు చేరుతున్నాయి. లక్షలాది రూపాయల ప్రజాధనంతో నిర్మించిన భవనాలు నిరుపయోగంగా మారుతుంటే సంబంధిత అధికార యంత్రాంగం ఏం చేస్తోందన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
వ్యవసాయ శాఖకు సొంత భవనం లేక.. రైతు వేదికలోనే కార్యాలయం!
కాటారం మండల వ్యవసాయ శాఖ కార్యాలయానికి సొంత భవనం లేకపోవడంతో రైతు వేదికలోనే ఏఈఓ కార్యాలయాన్ని ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఒకవైపు రైతుల సమావేశాలకు కేటాయించిన భవనం, మరోవైపు వ్యవసాయ శాఖ కార్యాలయ అవసరాలు, ఇంకోవైపు మహిళా సంఘాల కుట్టు మిషన్ల నిల్వ.. ఇలా ఒకే భవనాన్ని అనేక అవసరాలకు వినియోగిస్తుండటంతో అసలు రైతు వేదిక ఉద్దేశమే నీరుగారిపోతోంది.
ఇప్పటికైనా అధికారులు మేల్కొనాలి!
రైతుల కోసం నిర్మించిన రైతు వేదికలను ఇతర అవసరాలకు వినియోగించకుండా వాటి అసలు లక్ష్యాన్ని కాపాడాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. భవనంలో నిల్వ ఉంచిన కుట్టు మిషన్లను తగిన భద్రత కలిగిన ప్రదేశానికి తరలించాలి. శిథిలమైన తలుపులకు మరమ్మతులు చేపట్టాలి. భవనాన్ని పూర్తిస్థాయిలో శుభ్రం చేసి, విలువైన సామగ్రికి భద్రత కల్పించాలి. రైతు వేదికల నిర్వహణకు ప్రత్యేక నిధులు కేటాయించి, నిరంతర పర్యవేక్షణ చేపట్టాలి.
లేకపోతే రైతుల సంక్షేమం కోసం నిర్మించిన రైతు వేదికలు కేవలం ప్రభుత్వ పథకాల ప్రచారానికే పరిమితమై, చివరకు నిరుపయోగ భవనాలుగా మిగిలిపోయే ప్రమాదం ఉంది. రైతుల కోసం నిర్మించిన వేదికల్లో రైతులకే చోటు లేకపోవడం పాలనా వ్యవస్థలోని నిర్లక్ష్యానికి నిదర్శనం కాదా? ఇప్పటికైనా సంబంధిత జిల్లా, మండల స్థాయి అధికారులు స్పందించి రైతు వేదికకు పూర్వ వైభవం తీసుకురావాలని రైతులు కోరుతున్నారు.








కామెంట్లు (0)