- రైతులకు జిల్లా వ్యవసాయ అధికారి బాబూరావు సూచనలు
నవతెలంగాణ - అశ్వారావుపేట
ఆర్నబ్ తుఫాను ప్రభావంతో కురిసిన వర్షాలు, ఈదురుగాలుల కారణంగా పంటలకు జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు జిల్లా వ్యవసాయ అధికారి బాబూరావు గురువారం క్షేత్రస్థాయిలో పర్యటించారు. గుమ్మడివల్లి, కోయ రంగాపురం, నారాయణపురం, అనంతారం, గాండ్లగూడెం, నందిపాడు తదితర గ్రామాల్లో వరి, పత్తి, మినుము పంటలను పరిశీలించి రైతులకు పలు సూచనలు చేశారు.
వరి పొలాల్లో నీరు నిల్వ ఉండకుండా చూడాలని, కోతకు సిద్ధమైన పంటను వాతావరణ పరిస్థితులను గమనించి కోయాలని సూచించారు. పత్తి పంటలో తేమ కారణంగా నాణ్యత దెబ్బతినకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. మినుము పొలాల్లో మురుగునీరు బయటకు వెళ్లేలా చర్యలు చేపట్టాలని, వేరుకుళ్లు, ఇతర తెగుళ్ల లక్షణాలను గుర్తించి వ్యవసాయ అధికారుల సలహా మేరకు నివారణ చర్యలు చేపట్టాలని తెలిపారు.
రైతులు వాతావరణ మార్పులను ఎప్పటికప్పుడు గమనిస్తూ వ్యవసాయ శాఖ సూచనలు పాటించాలని కోరారు. ఈ పర్యటనలో మండల వ్యవసాయ అధికారి శ్రీనివాసరావు, ఏఈవోలు రవీంద్ర, భాను, సతీష్, రైతులు పాల్గొన్నారు.






కామెంట్లు (0)