- ప్రభుత్వ వైఫల్యాలపై బీఆర్ఎస్ సమరశంఖం
- బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య
నవతెలంగాణ-సత్తుపల్లి
తెలంగాణ సాధన కోసం కేసీఆర్ ఆమరణ దీక్ష చేపట్టిన రోజును పురస్కరించుకుని, ఈ నెల 29న సత్తుపల్లి నియోజకవర్గ స్థాయి ‘దీక్షా దివస్’ సభను ఘనంగా నిర్వహించేందుకు బీఆర్ఎస్ నాయకత్వం సిద్ధమైంది. స్థానిక లక్ష్మీ ప్రసన్న ఫంక్షన్ హాల్లో మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య బుధవారం పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో ఏర్పాటుచేసిన సమావేశం ఏర్పాటు చేసి దీక్ష దివస్ కార్యక్రమాలను వివరించారు.
మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు దీక్షా దివస్ కార్యక్రమాలు ఉంటాయన్నారు. ఆ రోజు ఉదయం 9 గంటలకు తెలంగాణ తల్లి విగ్రహానికి, అమరవీరులకు ఘనంగా నివాళులర్పించనున్నట్లు తెలిపారు. సత్తుపల్లి టౌన్, రూరల్, వేంసూరు మండలాల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి సభను విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు.
తెలంగాణ వనరులను ఢిల్లీకి ధారాదత్తం చేస్తున్నారు
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక తెలంగాణ వనరులను ఢిల్లీకి ధారాదత్తం చేస్తున్నారని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన కంటే ఢిల్లీ పర్యటనలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఆరోపించారు. పల్నాడు లిఫ్ట్ ఇరిగేషన్ పేరుతో నాగార్జునసాగర్ వద్ద చేపడుతున్న ప్రాజెక్టుల వల్ల కృష్ణా జలాల్లో తెలంగాణ వాటాకు తీవ్ర నష్టం వాటిల్లుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. దీనికి నిరసనగా డిసెంబర్ మొదటి వారంలో నల్గొండ వేదికగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వెంకట వీరయ్య ప్రకటించారు.
నియోజకవర్గంలో అకాల వర్షాలు, తుఫాను కారణంగా పంటలు దెబ్బతిన్నా ప్రభుత్వం ఆదుకోవడం లేదని మండిపడ్డారు. కల్లూరు, తల్లాడ, పెనుబల్లి, వేంసూరు మండలాల్లో పంట నష్టం వివరాలు నమోదు చేయలేదని, జిల్లాలో ముగ్గురు కీలక మంత్రులు ఉన్నప్పటికీ రైతులకు పరిహారం అందలేదని విమర్శించారు. కొనుగోలు కేంద్రాల్లో కేవలం బోర్డులు మాత్రమే పెట్టారని, తడిసిన, రంగు మారిన ధాన్యాన్ని కొనకపోవడంతో క్వింటా ధర రూ.4,000 నుంచి రూ.2,800కు పడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
మరోవైపు డీలర్ల వద్ద విత్తనాల కొరత ఏర్పడి రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అర్హులైన నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇవ్వకుండా, ఓ నాయకుడు తనకే ఇల్లు కావాలని అడగడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. ఇందిరమ్మ కమిటీల పేరుతో పథకాలను పంచుతూ, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన సర్పంచులను అవమానిస్తూ పంచాయతీరాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపించారు. తమిళనాడు తరహాలో ప్రజలు చైతన్యవంతమై ఆలోచిస్తున్నారని, రాష్ట్రంలో మళ్లీ కేసీఆర్ పాలన రావాలని ప్రజలు కోరుకుంటున్నారని సండ్ర స్పష్టం చేశారు. 29న జరిగే సభకు బీఆర్ఎస్ శ్రీను అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని సండ్ర కోరారు. ఈ సమావేశంలో మున్సిపల్ మాజీ చైర్మన్ కూసంపూడి మహేష్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ కొత్తూరు ఉమామహేశ్వరరావు, ఆత్మ మాజీ చైర్మన్ శీలపురెడ్డి హరికృష్ణారెడ్డి, నాయకులు దొడ్డా శంకరరావు, ఎస్కే రఫీ, మల్లూరు అంకమరాజు, మాజీ జెడ్పీటీసీ సభ్యులు కూసంపూడి రామారావు, ఆయూబ్ పాషా, పర్వతనేని వేణు, నడ్డి ఆనందరావు, మేకల నరసింహారావు, అక్షింతల చంటి, అమరవరపు కృష్ణారావు పాల్గొన్నారు.






కామెంట్లు (0)