- ప్రారంభమైన తరగతులు..
- విద్యార్థుల చేరికలు అంతంత మాత్రమే
- 30 సీట్లకు 10 మంది మాత్రమే ఫీజు చెల్లించి ప్రవేశం
- బోధనా సిబ్బంది, శాశ్వత భవనాలు లేకపోవడమే కారణమా?
నవతెలంగాణ - అశ్వారావుపేట
ఉద్యాన పంటలకు ప్రసిద్ధి చెందిన అశ్వారావుపేటలో ఉద్యాన కళాశాల ఏర్పాటు చేయాలన్న ఈ ప్రాంత ప్రజల చిరకాల ఆకాంక్ష ఎట్టకేలకు నెరవేరింది. అయితే కళాశాల ప్రారంభమైనా ఆశించిన స్థాయిలో విద్యార్థుల చేరికలు లేకపోవడంతో తొలి ఏడాదే కళాశాలకు పురిటి కష్టాలు ఎదురవుతున్నాయి. బోధనా సిబ్బంది నియామకం, శాశ్వత భవన సముదాయం, ఇతర మౌలిక సదుపాయాల కల్పనలో జాప్యం విద్యార్థుల చేరికలపై ప్రభావం చూపుతున్నట్లు తెలుస్తోంది.
స్థానిక ఉద్యాన పరిశోధనా స్థానం (హెచ్ఆర్ఎస్) ప్రాంగణంలోని పరిశోధనా భవనంలో ఈ విద్యా సంవత్సరం నుంచి కళాశాల తరగతులు ప్రారంభించారు. మొదటి బ్యాచ్‌లో 30 మంది విద్యార్థులకు ప్రవేశాలు కల్పించాల్సి ఉండగా, కౌన్సెలింగ్‌లో 11 మంది మాత్రమే ఆసక్తి చూపారు. వీరిలో ప్రస్తుతం 10 మంది మాత్రమే ఫీజు చెల్లించి కళాశాలలో చేరారు. మరొక విద్యార్థి ఇంకా ఫీజు చెల్లించాల్సి ఉంది.
హామీ నెరవేరినా.. సౌకర్యాలేవి?
అశ్వారావుపేటలో ఉద్యాన కళాశాల ఏర్పాటు చేస్తామని స్థానిక ఎమ్మెల్యే జారె ఆదినారాయణ ఇచ్చిన హామీకి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కృషి తోడవడంతో కళాశాల ఏర్పాటు సాధ్యమైంది. శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం ఇందుకు అనుమతులు మంజూరు చేసింది. ఈ క్రమంలో 2026 మే 14న కళాశాల భవన సముదాయ నిర్మాణానికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యే జారె ఆదినారాయణ శంకుస్థాపన చేశారు. అనంతరం అక్టోబర్ 9న కళాశాల అసోసియేట్ డీన్‌గా డాక్టర్ మజ్జిగ శ్రీనివాస్‌ను నియమిస్తూ విశ్వవిద్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది.
అయితే ప్రభుత్వం నుంచి అవసరమైన సాంకేతిక, పరిపాలనా అనుమతులు ఇంకా పూర్తిస్థాయిలో రాకపోవడంతో బోధనా సిబ్బంది కేటాయింపు, శాశ్వత భవన నిర్మాణం, ఇతర మౌలిక సదుపాయాల కల్పనలో జాప్యం జరుగుతోంది. ప్రస్తుతం విశ్వవిద్యాలయం తాత్కాలికంగా బాలురు, బాలికలకు వేర్వేరుగా వసతి సౌకర్యాలు కల్పించింది.
తరగతులు ప్రారంభించాం : అసోసియేట్ డీన్
2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి బీఎస్సీ (ఆనర్స్) హార్టికల్చర్ కోర్సులో ఇప్పటివరకు 11 మంది విద్యార్థులు ప్రవేశం పొందినట్లు అసోసియేట్ డీన్ డాక్టర్ మజ్జిగ శ్రీనివాస్ గురువారం వెల్లడించారు. వీరిలో ముగ్గురు విద్యార్థులు, ఎనిమిది మంది విద్యార్థినులు ఉన్నారని తెలిపారు. నూతనంగా ప్రవేశం పొందిన విద్యార్థులకు ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహించామని, క్రమబద్ధంగా తరగతులు ప్రారంభించినట్లు పేర్కొన్నారు.
వచ్చే ఏడాదైనా చేరికలు పెరిగేనా?
ఉద్యాన పంటల సాగుకు ప్రత్యేక గుర్తింపు ఉన్న అశ్వారావుపేటలో ఉద్యాన విద్యకు మంచి అవకాశాలు ఉన్నాయి. అయితే కళాశాల ఏర్పాటు చేయడంతోనే బాధ్యత పూర్తయినట్లు కాకుండా, దానికి అవసరమైన బోధనా సిబ్బంది, ప్రయోగశాలలు, తరగతి గదులు, శాశ్వత భవనాలు, ఇతర విద్యా సౌకర్యాలను పూర్తిస్థాయిలో కల్పించాల్సిన అవసరం ఉంది. వచ్చే విద్యా సంవత్సరం నాటికైనా ఈ లోపాలను అధిగమించి విద్యార్థుల చేరికలు పెరిగేలా ప్రభుత్వం, విశ్వవిద్యాలయం ప్రత్యేక దృష్టి సారించాలని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు. లేకుంటే ఎంతో ఆశతో ఏర్పాటు చేసిన ఉద్యాన కళాశాల ఆశించిన లక్ష్యాన్ని చేరుకోవడం కష్టమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.





కామెంట్లు (0)