కృష్ణా జలాల అక్రమ తరలింపును అడ్డుకోవాలి

44 నిమిషాల క్రితం

Krishna water
avatar
Shiva Kumar

ప్రచురించబడింది నవం 27, 2026 | 3 నిమిషాల చదవడం

అపెక్స్‌ కౌన్సిల్‌, కేంద్రానికి తక్షణమే లేఖ రాయాలి
తెలంగాణ విశ్రాంత ఇంజినీర్ల సంఘం డిమాండ్‌
లిఫ్ట్‌ ప్రాజెక్టులను 30 వరద రోజుల ప్రాతిపదికన రీడిజైన్‌ చేయాలి

నవతెలంగాణ – బంజారాహిల్స్‌

కృష్ణా నది జలాలను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అనుమతులు లేకుండా తరలించడాన్ని తక్షణమే నిలిపివేయాలని తెలంగాణ విశ్రాంత ఇంజినీర్ల సంఘం డిమాండ్‌ చేసింది. కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ), అపెక్స్‌ కౌన్సిల్‌ అనుమతులు లేకుండా, తెలంగాణ ప్రభుత్వానికి సమాచారం ఇవ్వకుండానే గేట్లు తెరిచి నీటిని తరలించడం సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని సంఘం ప్రతినిధులు ఎం. శ్యాంప్రకాష్‌రెడ్డి, తన్నీరు వెంకటేశం పేర్కొన్నారు. శుక్రవారం ఖైరతాబాద్‌లోని విశ్వేశ్వరయ్య ఇంజినీర్స్‌ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు.


ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తొలుత సుమారు 2,500 క్యూసెక్కుల నీటిని తరలించడం ప్రారంభించి, ప్రస్తుతం దాదాపు 6 వేల క్యూసెక్కుల నీటిని తీసుకెళ్తోందని ఆరోపించారు. తాగునీటి అవసరాల పేరుతో నీటిని తరలిస్తున్నప్పటికీ, దీనిపై ముగ్గురు సభ్యుల కమిటీలో ఏకాభిప్రాయం కుదరకపోవడంతో కేఆర్‌ఎంబీ సమావేశం నిర్వహించాలని నిర్ణయించిందన్నారు. సమావేశం త్వరగా జరిగేలా చర్యలు తీసుకోవాల్సిన ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అందుకు భిన్నంగా తన నియంత్రణలో ఉన్న ప్రధాన కాలువ హెడ్‌ రెగ్యులేటరీ గేట్లు తెరవడం అనుచితమని విమర్శించారు.


నీటి అవసరాలపై కేఆర్‌ఎంబీ వద్ద వాదనలు వినిపించి, అనుమతించిన మేరకే నీటిని వినియోగించుకోవాల్సిన బాధ్యత రెండు రాష్ట్రాలపై ఉందన్నారు. ఉభయ రాష్ట్రాలు అంగీకరించిన నిబంధనలను ప్రభుత్వాలే ఉల్లంఘిస్తే అది సరైన పరిపాలన అనిపించుకోదని వ్యాఖ్యానించారు. కేఆర్‌ఎంబీ వెంటనే జోక్యం చేసుకుని నీటి తరలింపును నిలిపివేయాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు.

లిఫ్ట్‌ ప్రాజెక్టులను రీడిజైన్‌ చేయాలి

కృష్ణా నదిపై నిర్మించిన లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టులన్నీ 90 వరద రోజుల ప్రాతిపదికన రూపకల్పన చేశారని సంఘం ప్రతినిధులు తెలిపారు. జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్‌ ప్రాజెక్టులపై ఆధారపడిన తెలంగాణ లిఫ్ట్‌ పథకాలు 90 రోజులపాటు పంపులు నడిస్తేనే కేటాయించిన నీటిని వినియోగించుకునేలా రూపొందించారని వివరించారు. రాయలసీమ ప్రాంతంలోని ప్రాజెక్టులు మాత్రం 30 వరద రోజుల ప్రాతిపదికన రూపకల్పన చేశారని పేర్కొన్నారు. అక్కడి ప్రాజెక్టులకు 100 టీఎంసీల నీరు అవసరమైతే రోజుకు సుమారు 3 టీఎంసీల చొప్పున 30 రోజుల్లోనే వినియోగించుకునే అవకాశం ఉందన్నారు.


తెలంగాణలో వరద ప్రవాహం ఎక్కువ కాలం అందుబాటులో ఉండకపోవడంతో 90 రోజుల రూపకల్పన వల్ల ఆశించిన స్థాయిలో నీటిని వినియోగించుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీశైలం నుంచి వరద ప్రవాహం ఉన్నప్పటికీ గరిష్ఠంగా 40 నుంచి 45 రోజులకు మించి నీటిని తీసుకునే పరిస్థితి లేదన్నారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టును 90 రోజుల నుంచి 60 రోజుల ప్రాతిపదికన మార్చినట్లు గుర్తుచేశారు. ఇదే తరహాలో జూరాలపై ఆధారపడిన నెట్టెంపాడు, భీమా, కోయిల్‌సాగర్‌తో పాటు శ్రీశైలంపై ఆధారపడిన కల్వకుర్తి ప్రాజెక్టును కూడా 30 వరద రోజుల ప్రాతిపదికన రీడిజైన్‌ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఇందుకు అవసరమైన కొత్త రిజర్వాయర్లను నిర్మించాలని సూచించారు.


శాశ్వత నీటి కేటాయింపులపై నిర్ణయం అవసరం

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నీటి పంపకాలపై శాశ్వత పరిష్కారం కోసం ట్రిబ్యునల్‌ నిర్ణయం లేదా రెండు రాష్ట్రాల మధ్య ఒప్పందం అవసరమని ప్రతినిధులు పేర్కొన్నారు. అప్పటివరకు 299 టీఎంసీల నీటి వినియోగాన్ని తాత్కాలిక ఏర్పాటుగానే పరిగణించాలని స్పష్టం చేశారు. ఇది శాశ్వత నీటి కేటాయింపు కాదని, బ్రిజేష్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌ తుది నిర్ణయం వెలువడిన తర్వాత తెలంగాణకు మరింత నీటిని వినియోగించుకునే అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు.


అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, సంబంధిత కేంద్ర మంత్రులు, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నేరుగా చర్చించే అవకాశం ఉంటుందని తెలిపారు. తెలంగాణ నీటి హక్కులు, ప్రాజెక్టుల అవసరాలు, నీటి వినియోగంపై రాష్ట్ర వాదనలను బలంగా వినిపించేందుకు ఇది కీలక వేదికగా నిలుస్తుందన్నారు. అక్రమ నీటి తరలింపును అడ్డుకోవడంతో పాటు తెలంగాణకు న్యాయంగా దక్కాల్సిన నీటిని వినియోగించుకునేలా కేంద్రం, కేఆర్‌ఎంబీ చర్యలు తీసుకోవాలని కోరారు. అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశం నిర్వహించాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వం వెంటనే కేంద్రానికి లేఖ రాయాలని సూచించారు. ఈ సమావేశంలో సంఘం ప్రతినిధులు జనార్దన్‌, దామోదర్‌రెడ్డి, రామిరెడ్డి, రాజ నర్సయ్య, జగదీశ్వర్‌, మదన్‌మోహన్‌ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్