- పౌర హక్కుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కూకలకుంట రవి
- సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ డివిజన్ కార్యదర్శి వెంకన్న
నవతెలంగాణ-సత్తుపల్లి
అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ, దోపిడీ, పీడనలేని సమసమాజ స్థాపన కోసం ప్రజలు ఐక్యంగా పోరాడాలని పౌరహక్కుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కూకలకుంట రవి, సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ సత్తుపల్లి డివిజన్ కార్యదర్శి ఎ. వెంకన్న పిలుపునిచ్చారు. స్థానిక నీలం రామచంద్రయ్య భవనంలో డివిజన్ కార్యదర్శివర్గ సభ్యులు అమర్లపూడి శరత్ అధ్యక్షతన నిర్వహించిన వర్ధంతి సభలో వారు మాట్లాడారు. స్వాతంత్ర్యం వచ్చి దశాబ్దాలు గడుస్తున్నా పాలకవర్గాల విధానాల వల్ల పేదలు మరింత పేదరికంలోకి నెట్టబడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
దేశ సహజ వనరులు, గనులు, బ్యాంకులు, ఇస్రో, రైల్వే, విమానయానం వంటి ప్రజా సంపదను స్వదేశీ, విదేశీ బహుళజాతి కంపెనీలకు కట్టబెడుతున్నారని విమర్శించారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న హామీని మోదీ ప్రభుత్వం విస్మరించిందని దుయ్యబట్టారు. రాష్ట్రంలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా వందలాది వాగ్దానాలు చేసి కాలయాపన చేస్తోందని విమర్శించారు. ఇందిరమ్మ ఇండ్ల పథకం కాంగ్రెస్ కార్యకర్తల ఉపాధి పథకంగా మారిందని, కండువా కప్పుకున్న వారికే ఇళ్లు ఇవ్వడం శోచనీయమన్నారు.
నిత్యావసరాలు, పెట్రోల్, గ్యాస్ ధరలు పెంచి సామాన్యులపై భారాలు మోపుతున్నారని మండిపడ్డారు. సోషలిస్టు సమాజ స్థాపన కోసం ప్రాణాలర్పించిన అమరవీరుల ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే నిజమైన నివాళి అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకులు గంటా శ్రీను, మండల నాయకులు సున్నం కృష్ణ, దుంప రాఘవులు, కుంట కృష్ణ, నెక్కొండ అలివేలు, వెంకట నరసమ్మ, నారాయణ, విశ్వనాథం, రాములమ్మ, జలాల్, రమేష్ పాల్గొన్నారు.






కామెంట్లు (0)