Magazines

సమైక్య పోరుకు సన్నద్ధం

1 గంట క్రితం

Gearing up for the united struggle
avatar
Rajabapu Odela

ప్రచురించబడింది అక్టో 13, 2026 | 3 నిమిషాల చదవడం

సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ తీర్మానం
నిరసన తెలపడం నేరమైంది

ఓటు హక్కుకు ముప్పు కలిగించే ఏ ప్రక్రియకైనా జవాబుదారీతనం ఉండాల్సిందేనంటూ వ్యాఖ్యలు

న్యూఢిల్లీ : ఈ నెల 9, 11 తేదీల్లో భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్స్‌స్ట్‌) ‌కేంద్ర కమిటీ న్యూఢిల్లీలో సమావేశమై పలు అంశాలపై చర్చలు జరిపింది. అనంతరం ఒక ప్రకటన విడుదల చేసింది. షెడ్యూల్‌ ‌ప్రకారం 9వ తేదీ నుండి 11వ తేదీ వరకు సమావేశం కావాల్సి వుండగా, సమావేశం రెండో రోజున అంటే 10వ తేదీన కేంద్ర కమిటీ సభ్యులు సీఈసీ రాజీనామా కోరుతూ, ఎస్‌ఐఆర్‌‌ను నిలిపివేయాలని డిమాండ్‌ ‌చేస్తూ సాగుతున్న ఆందోళనల్లో పాల్గొన్నారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఇండియన్ ఎక్స్‌‌ప్రెస్‌లో వచ్చిన కథనం నేపథ్యంలో భారత ఎన్నికల కమిషన్‌ ‌ముఖ్యంగా ప్రధాన ఎన్నికల కమిషనర్‌ ‌విశ్వసనీయత తీవ్రంగా దెబ్బతింది. పెద్ద సంఖ్యలో ఓటర్ల తొలగింపునకు సంబంధించిన డేటా వెల్లడించినట్లుగా సర్‌ ‌లోపభూయిష్టంగా వుందని ఈ వార్తా కథనం రుజువు చేసింది. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌)కు, అది ప్రస్తుతం నిర్వహిస్తున్న తీరుకు ఎవరు అనుమతినిచ్చారు అనే అంశానికి సంబంధించే కాకుండా, ఎన్నికల కమిషన్‌ ‌పనితీరు, స్వేచ్ఛా స్వాతంత్య్రాలకు సంబంధించి కూడా ప్రాధమికంగా అనేక ప్రశ్నలను ఈ వార్తా కథనం లేవనెత్తింది. ఫారమ్‌ 6‌కు అక్రమంగా చేసిన సవరణలకు సంబంధించి కూడా ప్రశ్నలు వున్నాయి. నిజమైన ఓటర్ల పేర్లను తొలగించేందుకు పెద్ద సంఖ్యలో ఫారమ్‌ 7 ‌దరఖాస్తులను బిజెపి కార్యకర్తలు అందచేశారంటూ వచ్చిన వార్తలతో ఈ ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ దుర్వినియోగం గురించి ఆందోళనలు మరింత పెరిగాయి. పైగా ఐటీ నిర్మాణ వ్యవస్థలోని మార్పులు కేంద్రీకరణకు దారి తీయడం, ఓటర్ల నమోదు అధికారుల (ఎలక్టోరల్‌ ‌రిజిస్ట్రేషన్‌ ఆఫీసర్లు) పాత్రకు సంబంధించిన చట్టబద్ధమైన నిబంధనల పూర్తి ఉల్లంఘనకు దారి తీస్తోంది.

భారత రాజ్యాంగం హామీ కల్పించిన ప్రజాస్వామ్య హక్కులకు సర్‌ ‌పెను సవాలుగా ఆవిర్భవించింది. ఓటు హక్కు అనేది ప్రజా సార్వభౌమాధికారానికి ఒక ప్రాధమిక వ్యక్తీకరణ. ప్రాతినిధ్య ప్రజాస్వామ్య పునాది. ఈ హక్కును గందరగోళంలో పడేసే ఏ ప్రక్రియకు అయినా జవాబుదారీతనం వుండాల్సిందేనని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ పేర్కొంది.

ఢిల్లీ, ఇతర చోట్ల ఆందోళనకారులపై సాగించిన అణచివేత చర్యలను కేంద్ర కమిటీ తీవ్రంగా ఖండించింది. కేంద్ర హోం శాఖ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు ఢిల్లీ పోలీసులు చేపట్టిన చర్యలు ఇటీవలి కాలంలో అత్యంత దారుణమైనవని పేర్కొంది. నిరసన తెలియచేసే ప్రాధమిక హక్కును కూడా ఈ ప్రభుత్వం లాగేసుకుంది. దీంతో మరోసారి ఈ ప్రభుత్వ నిరంకుశ స్వభావం వెల్లడైందని కేంద్ర కమిటీ పేర్కొంది. ఇది రాజ్యాంగంలోని 19వ అధికరణను ఉల్లంఘించడమే. శాంతియుతంగా ఒక చోట సమావేశం కావడం, అసమ్మతిని వ్యక్తం చేయడం, ప్రభుత్వ అధికారులకు పిటిషన్‌ అందచేయడమనేది ఆర్‌ఎస్‌ఎస్‌‌ నియంత్రణలో గల బిజెపి ప్రభుత్వం హయాంలో పెద్ద నేరంగా మారిందని సీపీఐ(ఎం) విమర్శించింది.

సీపీఐ(ఎం) సీనియర్‌‌ నేతలు, జాన్‌ ‌బ్రిట్టాస్‌, శివదాసన్‌ ‌వంటి ఎంపీలు, మహిళలతో సహా ఆందోళనకారులపై అత్యంత కిరాతకంగా సాగించిన అణచివేతను ఏ నాగరిక సమాజమూ కూడా క్షమించలేదు. వివిధ సంఘాల విద్యార్ధి నేతలు కూడా దారుణమైన రీతిలో దాడులకు గురయ్యారు. కేంద్ర కమిటీ సమావేశం జరుగుతున్న వేదిక అయిన హరికిషన్‌ ‌సింగ్‌ ‌సూర్జిత్‌ ‌భవన్‌ ఆవరణలోకి కూడా పోలీసులు బలవంతంగా ప్రవేశించడానికి ప్రయత్నించారు. కాక్రోచ్‌ ‌జనతా పార్టీ పత్రికా సమావేశం నిర్వహించిన ప్రెస్‌‌క్లబ్‌ ఆఫ్‌ ఇండియా ఆవరణలోకి కూడా పోలీసులు ప్రవేశించారు. మీడియా సిబ్బందితో సహా అనేకమందిని అదుపులోకి తీసుకున్నారు. వివిధ ప్రాంతాల్లో నిరసనల కవరేజీకి వచ్చిన అనేకమంది మీడియా వ్యక్తులను కూడా నిర్బంధించారు.

తన ఫాసిస్ట్‌ ‌స్వభావానికి తగినట్లుగా, నిరసనకారులపై దాడి చేసి, వారిని భయభ్రాంతులకు గురి చేయడానికి బీజేపీ-ఆర్‌ఎస్‌ఎస్‌ తన కార్యకర్తలను ఖాకీ యూనిఫారాల్లోనూ, సాధారణ దుస్తుల్లోనూ మోహరించింది. మహిళా ఆందోళనకారులను లైంగికంగా కూడా వేధించినట్లు కొన్ని దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి.అన్ని రకాల ఆంక్షలను, అణచివేతలను తట్టుకుని తమ వాణి వినిపించడానికి దేశం నలుమూలల నుండి ముందుకు వచ్చిన యువత, విద్యార్ధులు, కార్యకర్తలు, సామాన్య పౌరుల ధృఢ దీక్షకు, కృతి నిశ్చయానికి కేంద్ర కమిటీ అభివందనం తెలియచేసింది. ప్రజాస్వామ్య భాగస్వామ్యం భవిష్యత్‌‌కు సంబంధించిన విస్తృత ఆందోళనను ఇది ప్రతిబింబిస్తోంది. సర్‌‌కు వ్యతిరేకంగా సాగించే ఈ ఆందోళనను ఓటు హక్కును కాపాడుకునేందుకు, పౌర స్వేచ్ఛలను పరిరక్షించుకునేందుకు, భారత పౌరసత్వానికి నిర్దేశిత ప్రాతిపదిక అయిన రాజ్యాంగ చట్టబద్ధత కోసం, రాజ్యాంగబద్ధమైన వ్యవస్థలు ప్రజలకు జవాబుదారీగా వుండేందుకు హామీ కల్పిస్తూ సాగించే విస్తృత పోరాటంలో భాగంగానే చూడాల్సి వుందని సిపిఎం పేర్కొంది.

సిఇసి రాజీనామా కోసం, సర్‌ ఉపసంహరణకు, ఎన్నికల కమిషనర్ల నియామకాలకు సంబంధించిన చట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ అన్ని ప్రజాస్వామ్య శక్తులతో కలిసి పోరు సల్పాలని కేంద్ర కమిటీ తీర్మానించింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్