నీట మునిగిపోతున్న గ్రామాలు, జనావాసాలు, ఆలయాలు
ప్రమాదంలో వన్యప్రాణుల మనుగడ
కెన్`బెట్వా నదుల అనుసంధాన ప్రాజెక్టు పై గిరిజనుల నిరసనలు
భోపాల్ : మధ్యప్రదేశ్‌లో బీజేపీ ప్రభుత్వం చేపట్టిన కెన్`బెట్వా నదుల అనుసంధాన ప్రాజెక్టుపై నిరసనలు వెల్లువెత్తున్నాయి. ఛతర్‌పూర్, పన్నా జిల్లాలలోని స్థానికులు, గిరిజనులు ఈ ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ ఆందోళనలను తీవ్రతరం చేస్తున్నారు. ప్రాజెక్ట్ కారణంగా తమ గ్రామాలు, ఆవాసాలు, దేవాలయాలు నీట మునుగుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రకటించిన నష్టపరిహారం ఏ మాత్రం సరిపోదని అది కూడా సరిగా అందడం లేదని, పునరావాస సౌకర్యాలు కల్పించడంలో సర్కారు దారుణంగా విఫలమైందని ఆరోపించారు. ఈ ప్రాజెక్టు తో తమకు నిలువ నీడ లేకుండా పోతుందని, ఇక ఎలా బతకాలని వారు ప్రశ్నించారు. మరోవైపు ఈ ప్రాజెక్ట్ పన్నా టైగర్ రిజర్వ్ పరిధిలోకి వస్తుండడంతో పర్యావరణానికి, జీవ వైవిధ్యానికి ముప్పు కలుగుతుందని పర్యావరణవేత్తలు, స్థానికులు మండిపడుతున్నారు.
వినూత్న రీతిలో నిరసనలు
ప్రాజెక్టు ను నిరసిస్తూ ప్రజలు వినూత్న రీతిలో ఆందోళనలు చేపట్టారు. నది ఒడ్డున చితిని పేర్చి దానిపై పడుకొంటున్న వారు కొందరైతే మెడకు ఉరితాడు వేసుకొని, మోకాలు లోతు నీటిలో నిలబడుతున్న వారు మరికొందరు. ముఖానికి మట్టి పూసుకొని నిరసన తెలుపుతున్న వారూ ఉన్నారు. జులైలో ఛతర్‌పూర్‌లోని కనిపి గ్రామం వద్ద పదిహేను రోజుల పాటు జరిగిన నిరసన దీక్షను పోలీసులు బలవంతంగా భగ్నం చేసి ఆందోళనకారులను అరెస్ట్ చేశారు. ఆ తర్వాత సెప్టెంబర్ నుంచి ఈ ప్రాంతంలో తిరిగి నిరసనలు ఊపందుకున్నాయి.
వన్యప్రాణుల మనుగడ ప్రశ్నార్థకం
మన దేశంలో విజయవంతంగా నడుస్తున్న పులుల సంరక్షణ కేంద్రాలలో పన్నా టైగర్ రిజర్వ్ ఒకటి. ప్రాజెక్ట్ కారణంగా అటవీ ప్రాంతం మునిగిపోతే పులుల సంచారానికి అంతరాయం కలుగుతుంది. వాటి మనుగడ, సంతానోత్పత్తి దెబ్బతింటాయి. పన్నా అడవులలోని కెన్ నదీ లోయలు అంతరించిపోతున్న పలు జాతుల రాబందులకు సహజ సిద్ధమైన ఆవాసాలు. ఆనకట్ట నీటి కారణంగా రాబందులు గూళ్లు కట్టుకునే ఎత్తయిన రాతి లోయలు మునిగిపోతాయి. కెన్ నదిలో ఉన్న మొసళ్ల అభయారణ్యం కూడా ఈ ప్రాజెక్ట్ కారణంగా ప్రభావానికి గురవుతుంది. కెన్ నదిలో మిగులు నీరు ఉన్నదనే అంచనాతో ప్రాజెక్టు ను చేపట్టారు. అయితే ఎగువన ఆనకట్ట కడితే దిగువన ఉన్న కెన్ నదీ పరీవాహక ప్రాంతాలలో ప్రవాహం తగ్గి, భూగర్భ జలాలు పడిపోయే ప్రమాదం ఉన్నదని పర్యావరణవేత్తలు తెలిపారు. నష్టాన్ని భర్తీ చేయడానికి వేరే ప్రాంతంలో మొక్కలు నాటతామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ శతాబ్దాల నాటి సహజ అడవిని, పర్యావరణ వ్యవస్థను కృత్రి మంగా సృష్టించడం సాధ్యం కాదని నిపుణులు స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టు పై చాలా కాలంగా చర్చ నడుస్తున్నప్పటికీ ప్రధాని మోడీ ఇచ్చిన మద్దతుతో ఇప్పుడు కార్యరూపం దాలుస్తోంది.
నీట మునుగుతున్న నివాస ప్రాంతాలు
ఈ ప్రాజెక్ట్ బుందేల్‌ఖండ్ ప్రాంత అభివృద్ధిలో ఓ మైలురాయి అని ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ చెబుతున్నారు. సుమారు రూ.44,605 కోట్ల అంచనాలతో చేపడుతున్న ఈ ప్రాజెక్ట్ ద్వారా సుమారు 64 లక్షల మందికి తాగునీరు, లక్షలాది హెక్టార్ల భూమికి సాగునీరు అందుతుందని ప్రభుత్వం అంటోంది. అయితే ప్రాజెక్టు లో భాగంగా కెన్ నదిపై నిర్మించే రెండు కిలోమీటర్ల పొడవైన దౌధన్ ఆనకట్ట కారణంగా సుమారు 22,200 ఎకరాల భూమి నీట మునుగుతుంది. ఈ ముంపు ప్రాంతంలో 5,258 హెక్టార్ల దట్టమైన అటవీ భూమి ఉంది. ఇందులో పన్నా టైగర్ రిజర్వ్ కు చెందిన 4,141 హెక్టార్ల భూమి అత్యంత కీలకమైన కోర్ అటవీ ప్రాంతం. 1,314 హెకార్లు బఫర్ జోన్‌లో ఉన్నాయి. అంటే టైగర్ రిజర్వ్ పరిధిలోని సుమారు 10 శాతం నివాస ప్రాంతం నీటిలో కలిసిపోతుందన్న మాట. ఈ ప్రాజెక్ట్ కోసం అడవిలోని 23 లక్షలకు పైగా చెట్లను నరికివేయాల్సి ఉంటుందని పర్యావరణ అధ్యయనాలు హెచ్చరించాయి. చెట్ల నరికివేతతో ఆ ప్రాంతంలో పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుంది.







కామెంట్‌లు (0)