తరగతులను నిలిపివేయాలని ఆదేశం
లేహ్ : పర్యావరణ కార్యకర్త సోనం వాంగ్చుక్కు చెందిన లేహ్‌లోని 'డెసర్ట్ ఫ్లవర్ స్కూల్'లో తరగతులను, ఇతర కార్యకలాపాలను నిలిపివేయాలని లడఖ్ యంత్రాంగం నోటీసు జారీ చేసింది. తగిన అనుమతులు పొందకుండానే ఈ పాఠశాల కార్యకలాపాలు ప్రారంభమయ్యాయంటూ వాంగ్‌చుక్ భార్య, హెచ్‌ఐఎఎల్ వ్యవస్థాపకురాలు, సిఇఒ డాక్టర్ గీతాంజలి జె. అంగ్మోకు లేహ్ తహసీల్దార్ నోటీసు పంపించారు. జమ్మూ కాశ్మీర్, లడఖ్ హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న ఈ కేసుపై ఎటువంటి ప్రభావం పడకుండా, "ప్రస్తుత స్థితిని యథాతథంగా కొనసాగించాలని" ఆ అధికారి పేర్కొన్నారు. ఫ్యాంగ్ ప్రాంతంలో ఉన్న 'డెసర్ట్ ఫ్లవర్ స్కూల్' నిర్వహణకు అనుమతి కోరుతూ సెప్టెంబర్ 22న లేహ్ డిప్యూటీ కమిషనర్‌కు ఆంగ్మో లేఖ రాశారు.
సంబంధిత అధికారుల నుండి అనుమతులు లేదా ఆమోదం పొందకముందే పాఠశాలలో తరగతులు, ఇతర కార్యకలాపాలు ప్రారంభమయ్యాయని తహసీల్దార్ తాజాగా పేర్కొన్నారు. ప్రత్యామ్నాయ విశ్వవిద్యాలయాన్ని స్థాపించడానికి ఫ్యాంగ్ థాంగ్లో హెచ్ఐఎఎల్కు 40 ఏళ్ల లీజుకు 2018లో అప్పటి ప్రభుత్వం భూమిని కేటాయించింది. ఆ సంస్థ లీజు లాంఛనాలను పూర్తి చేయలేదని, ఏ విశ్వవిద్యాలయం కోసం భూమిని కేటాయించారో దానిని స్థాపించలేదని ఆరోపిస్తూ లడఖ్ పరిపాలన యంత్రాంగం దానిని 2025 ఆగష్టు 21న రద్దు చేసింది. ఈ నిర్ణయాన్ని హెచ్‌ఐఎఎల్ హైకోర్టులో సవాలు చేసింది. నీట్ అవకతవకలపై ఆందోళనలో సోనం వాంగ్‌చుక్ నిరవధిక నిరాహార దీక్ష చేపట్టడం, కేంద్రంలోని మోడీ ప్రభుత్వం చేపట్టిన ప్రజావ్యతిరేక చర్యలపై గళం విప్పుతున్న నేపథ్యంలో కక్షసాధింపు చర్యలకు కేంద్రం దిగుతోందని పలువురు విమర్శిస్తున్నారు.
సోనం వాంగ్‌చుక్ పాఠశాలకు లడఖ్ యంత్రాంగం నోటీసు
1 గంట క్రితం

balaji
ప్రచురించబడింది నవం 03, 2026 | 1 నిమిషాల చదవడం






కామెంట్లు (0)