భార్యాభర్తల మధ్య ఎలాంటి సమస్యలు వచ్చినా ఆ ప్రభావం మొదటిగా పడేది పిల్లల పైనే. అయినప్పటికీ కొందరు తల్లిదండ్రులు ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోరు. ఎప్పుడూ తాగి గొడవ చేసే భర్తలను కూడా మార్చుకోవడానికి మహిళలు చాలా ప్రయత్నిస్తారు. ఇతను తాగి గొడవ చేయడమే కాదు హెచ్ఐవీ రోగం బారిన పడినా ఆమె సర్దుకుపో వడానికి సిద్ధమయింది. కానీ అతను మాత్రం తాగొచ్చి నిత్యం ఆమెను మాటలతో చిత్ర హింసలు చేస్తున్నాడు. ఇక చివరకు భరించలేక విడిపోవడానికి సిద్ధమయింది. ఆ వివరాలు ఏంటో ఈ రోజు ఐద్వా అదాలత్ (ఐలమ్మ ట్రస్ట్)లో చదువుదాం...
స్వప్నకు దాదాపు 32 ఏండ్లు ఉంటాయి. భర్త రవికి 35 ఏండ్లు ఉంటాయి. వీరికి ఒక పాప ఉంది. భార్యాభర్తలిద్దరూ మూడేండ్ల నుండి విడిగా ఉంటున్నారు. మధ్యలో పెద్ద మనుషులు పంచాయితి పెట్టి మాట్లాడితే ఇద్దరూ ఆరు నెలలు కలిసి ఉన్నారు. ఒకరోజు రవి తాగి గొడవ చేయడంతో స్వప్న తిరిగి పుట్టింటికి వెళ్లిపోయింది. ప్రస్తుతం ఆమెకు రవితో కలిసి ఉండటం ఇష్టం లేదు. అతను ఎప్పుడూ తాగి ఆమెను మాటలతో హింసిస్తుంటాడు.
నాలుగేండ్ల కిందట రవికి ఆరోగ్యం బాగోలేకపోవడం వల్ల రెండు నెలలు ఇంట్లోనే ఉన్నాడు. ఎన్ని మందులు వాడినా ఉపయోగం లేక పోవడంతో హెచ్ఐవీ టెస్ట్ చేశారు. అందులో అతనికి పాజిటివ్ వచ్చింది. అప్పుడు భార్యాభర్తలిద్దరినీ కూర్చోబెట్టి డాక్టర్లు కౌన్సెలింగ్ ఇచ్చారు. స్వప్నకు, పాపకు టెస్ట్ చేస్తే నెగిటివ్ వచ్చింది. దాంతో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ భార్యాభర్తలు కలిసి ఉండవచ్చని డాక్టర్లు చెప్పారు. వైద్యుల సలహా మేరకు కొన్ని రోజులు ఇద్దరూ కలిసే ఉన్నారు. అయితే రవి తాగి స్వప్నను ఇబ్బంది పెట్టడంతో అతన్ని వదిలి దూరంగా ఉంటుంది.
పెద్దమనుషులు మాట్లాడినపుడు మాత్రం స్వప్న భర్తతో కలిసి ఉంటుంది. కానీ రవిలో మాత్రం ఎలాంటి మార్పు లేకపోవడంతో ఇక అతనితో కలిసి బతకడం ఆమె వల్ల కావడం లేదు. దాంతో రవి వచ్చి స్వప్నతో గొడవ పెట్టుకున్నాడు. ఇక అతనితో అస్సలు కలిసి ఉండలేక, విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకుంది. తనకు ఎలాగైనా సాయం చేయమంటూ ఐద్వా లీగల్సెల్కు వచ్చింది.
మేము రవికి ఫోన్ చేసి ఆఫీస్కు పిలిపించాము. అతను వాళ్ల అక్కను తీసుకొని వచ్చాడు. ‘మేడమ్ స్వప్న ఇంట్లో పనులు ఏమీ చేయదు. ఉద్యోగం మాత్రం చేస్తుంది. ఇంట్లో కనీసం వంట కూడా చేయదు. ఆమె ఉదయం ఆఫీసుకు వెళ్లిన తర్వాత నేను వస్తాను. నేను వచ్చేసరికి ఇంట్లో తింటానికి ఏమీ ఉండదు. పాపకు బయట ఏదో కొనిబెడుతుంది. లేదంటే మ్యాగి చేసి పెడుతుంది. ఎప్పుడో ఒకసారి అంటే పర్లేదు. కానీ రోజూ ఇలాగే చేస్తుంది. నేను నైట్ డ్యూటీ చేస్తాను. సాయంత్రం వెళితే మళ్లీ ఉదయమే వచ్చేది. స్వప్న ఆఫీస్ అయిపోయిన వెంటనే ఇంటికి రాదు. వాళ్ల పుట్టింటికి వెళ్లి ఎప్పుడో నేను ఆఫీసుకు వెళ్లే మందు వస్తుంది.
ఆరోజు కూడా అలాగే చేస్తే నేను ఏదో రెండు మాటలు అంటే గొడవ పెట్టుకొని బయట కూర్చుంది.
ఇంట్లోకి రమ్మంటే రాలేదు. అందుకే నేను కోపంతో ఇంటికి తాళం వేసుకొని ఆమెకు ఇవ్వకుండా వెళ్లిపోయాను. అంతే ఇక అప్పటి నుండి ఇంటికి రానంటుంది. వాళ్ల అమ్మ వాళ్ల దగ్గరే ఉంటుంది. నేను ఎన్ని సార్లు వెళ్లి అడిగినా రావడం లేదు. ఫోన్ చేస్తే మాట్లాడడం లేదు. ఇన్ని నెలల తర్వాత మీ దగ్గరకు వచ్చింది’ అని చెప్పుకొచ్చాడు.
‘ఇప్పటికీ ఆమెను వదులుకోవడం నాకు ఇష్టం లేదు. మేము కలిసి ఉండటమే నాకు కావాలి. ఆమెను నాతో పంపించండి. ఆమెను, పాపను జాగ్రత్తగా చూసుకుంటాను’ అన్నాడు. దానికి స్వప్న ‘ఇలాంటి మాటలు నమ్మి నేను ఆయనతో కలిసి ఉండటానికి వెళ్లితే మళ్లీ గొడవ చేసి ఇంటికి తాళం వేసుకొని వెళ్లిపోతాడు. ఇక అతనితో కలిసి ఉండటం నా వల్ల కాదు’ అని తేల్చి చెప్పింది.
వాళ్ల అక్క మధ్యలో కల్పించుకొని ‘మా తమ్ముడి ఆరోగ్యం బాగోలేదు. ఇలాంటి పరిస్థితుల్లో వాడిని చూసుకోవల్సి వస్తుందని వదిలిపెట్టి వచ్చేసింది. ప్రస్తుతం మా అమ్మ పరిస్థితి కూడా బాగోలేదు. ఆమెకు పక్షవాతం వచ్చి మంచంలో ఉంది.
వీళ్లు ఇలా గొడవ పడి విడివిడిగా ఉంటున్నారు. ఆమెను ఎవరు చూసుకోవాలి. ఆమె బాధ్యత ఎవరిది. ఈ విషయం కూడా మీరే చెప్పండి. తల్లిని చూసుకోవల్సిన బాధ్యత కొడుకులకు లేదా?’ అన్నది.
దానికి మేము ‘తల్లి బాధ్యత పిల్లలందరిదీ ఉంటుంది. ప్రస్తుతం స్వప్న అక్కడ ఉండటం లేదు కాబట్టి ఆడపిల్లలుగా మీ ముగ్గురు అక్క చెల్లెళ్లు మీ అమ్మను చూసుకోండి. రవికి కూడా బాధ్యత ఉంటుంది. అయితే రవికి హెచ్ఐవీ వుంది. ఇలాంటి పరిస్థితుల్లో అతను స్వప్నతో ఎంత మంచిగా ఉండాలి. కానీ తాగొచ్చి ఆమెను అవమానిస్తుంటే అతనితో ఎలా కలిసి ఉంటుంది. పెద్దమనుషుల మాట గౌరవించి ఇప్పటికే ఆమె చాలా సార్లు భర్తతో కలిసి ఉండటానికి వచ్చింది. కానీ అతనిలో ఎలాంటి మార్పూ లేదు. పైగా మా దగ్గరకు వచ్చి వంట చేయదు, ఇంట్లో పనులు చేయదు అని చెబుతున్నాడు. ఆమె మాత్రం ఇలాంటి భర్తను ఎన్నాళ్లని భరిస్తుంది. ఇప్పుడు తన భర్తతో కలిసి ఉండాలా వద్దా అనేది నిర్ణయించుకునే అధికారం స్వప్నకే ఉంది.
మేము చెప్పేది మాత్రం ఒక్కటే. పాపకు తల్లిదండ్రులు ఇద్దరూ కావాలి. కాబట్టి కలిసి ఉంటే బాగుంటుంది. ఇద్దరూ కలిసి సంతోషంగా వుంటే పాప కూడా ఆరోగ్యకరమైన వాతావరణంలో పెరుగుతుంది. అలా కాదని విడిపోతే పాప బాధ్యత ఎవరు చూసుకోవాలి, పాప ఎవరి దగ్గర ఉంటుంది. ఎవరి దగ్గర ఉన్నా మరొకరు చూడాలనుకున్నప్పుడు పాపను చూసుకోవచ్చు. ఆ విధంగా ఏర్పాటు చేసుకోండి. పాప భవిష్యత్తుకు మీరు ఏం చేస్తారో కూడా ఆలోచించుకోండి. మీకు నెల రోజులు టైం ఇస్తున్నాము. ఈలోపు ఆలోచించుకొని మా దగ్గరకు రండి’ అని చెప్పి పంపించాము.
మళ్లీ నెల రోజుల తర్వాత ఇద్దరూ వచ్చారు. ఇద్దరూ మ్యూచువల్గా విడాకులు తీసుకోవడానికి అంగీకరించారు. రవి పాపకు స్కూల్ ఫీజు కట్టడానికి అంగీకరించాడు. అలాగే ఎప్పుడైనా పాపను రవి ఇంటికి తీసుకెళ్లి రెండు రోజులు పెట్టుకొని తిరిగి పంపించడానికి స్వప్న అంగీకరించింది.
‘ఇప్పటికీ ఆమెను వదులుకోవడం నాకు ఇష్టం లేదు. మేము కలిసి ఉండటమే నాకు కావాలి. ఆమెను నాతో పంపించండి. ఆమెను, పాపను జాగ్రత్తగా చూసుకుంటాను’ అన్నాడు. దానికి స్వప్న ‘ఇలాంటి మాటలు నమ్మి నేను ఆయనతో కలిసి ఉండటానికి వెళ్లితే మళ్లీ గొడవ చేసి ఇంటికి తాళం వేసుకొని వెళ్లిపోతాడు.
నాలుగేండ్ల కిందట రవికి ఆరోగ్యం బాగోలేకపోవడం వల్ల రెండు నెలల ఇంట్లోనే ఉన్నాడు. ఎన్ని మందులు వాడినా ఉపయోగం లేక పోవడంతో హెచ్ఐవీ టెస్ట్ చేశారు. అందులో అతనికి పాజిటివ్ వచ్చింది. అప్పుడు భార్యాభర్తలిద్దరినీ కూర్చోబెట్టి డాక్టర్లు కౌన్సెలింగ్ ఇచ్చారు. స్వప్నకు, పాపకు టెస్ట్ చేస్తే నెగిటివ్ వచ్చింది.
- వై వరలక్ష్మి, 9948794051







కామెంట్లు (0)