21,717 డీటీఆర్ లు, 2,51,213 ఎల్టీ లైన్లు
జెన్ కోతో పాటు 87 సంస్థల నుంచి విద్యుత్ కేటాయింపు
బకాయిలు రూ.46,155.28 కోట్లు,
అప్పులు రూ.46,126 కోట్లు
ఉత్తర్వులు జారీ చేసిన రాష్ర్ట ప్రభుత్వం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ర్ట ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన తెలంగాణ రైతు విద్యుత్ పంపిణీ కంపెనీ లిమిటెడ్ (టీజీఆర్పీడీసీఎల్)కు 30,62,853 కనెక్షన్లు ప్రభుత్వం బదిలీ చేసింది. ఆస్తులు, అప్పులు, పంపిణీ నెట్వర్క్, మానవ వనరులు, వినియోగదారులు, విద్యుత్ కొనుగోలు కేటాయింపు, హక్కులు, బాధ్యతలు, నిర్దిష్ట విధులకు సంబంధించి తెలంగాణ ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్ సోమవారం జీఓ నెంబర్ 17 జారీ చేశారు. కొత్త డిస్కం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వ్యవసాయ విద్యుత్ వినియోగదారులు, లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలు, మిషన్ భగీరథ, రక్షిత తాగునీటి పథకాలు, హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు, ప్రత్యేక పంపిణీ ట్రాన్స్ ఫార్మర్ల ద్వారా విద్యుత్ పొందుతున్న మున్సిపల్ తాగునీటి కనెక్షన్లకు సేవలు అందించనుంది. తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి(టీజీఈఆర్సీ) జులై 10న జారీ చేసిన ఉత్తర్వులకు లోబడి బదిలీ ప్రక్రియను చేపట్టినట్టు సర్కార్ తెలిపింది. బదిలీ చేయబడిన ఆస్తులు, విధులు, కార్యకలాపాలకు సంబంధించిన హక్కులు, ప్రయోజనాలు, బాధ్యతలు మొదలగు అన్ని అంశాలు నియంత్రణ అవసరాలకు లోబడి (ఇప్పటికే ఉన్న ఏదైనా ఒప్పందం) పథకంలో పేర్కొన్న మేరకు టీజీఆర్పీడీసీఎల్కు సంక్రమిస్తాయి లేదా బదిలీ చేయబడతాయని సర్కార్ ఉత్తర్వులో పేర్కొంది. టీజీ జెన్కో, టీజీ ట్రాన్స్కో, టీజీఎస్పీడీసీఎల్, టీజీ ఎన్పీడీసీఎల్, టీజీఆర్పీడీసీఎల్ సంస్థల ఎండీలు సర్కార్ ఉత్తర్వులకు లోబడి తదుపరి చర్యలు చేపట్టాలని ఆదేశించింది. జెన్కోతో పాటు కేటాయించిన పీపీఏల ప్రకారం 87 సంస్థల నుంచి విద్యుత్ కొనుగోలు చేసుకోవచ్చు.
జీఓ నెంబర్.44, 8 ప్రకారం బదిలీ చేసిన అన్ని అంశాలకు సంబంధించి 12 నెలల లోపు రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ ద్వారా ఈ పథకం యొక్క నిబంధనలను మార్చవచ్చు లేదా సవరించవచ్చని పేర్కొంది. సిబ్బంది విషయాలకు సంబంధించి క్లాజ్ 7 ద్వారా నిరంతరం ఆజమాయిషి ఉంటుందని తెలిపింది. అలాగే రెండు విద్యుత్ సంస్థల నుంచి రైతు డిస్కంకు 660 మంది ఇంజినీర్లు, 340 మంది అడ్మినిస్ర్టేషన్ సిబ్బంది, ఆర్టిజన్లు, ఇతరులు 1,000 మొత్తం 2 వేల మంది సిబ్బందిని బదిలీ చేస్తున్నట్టు వెల్లడించింది. లిఫ్ట్ ఇరిగేషన్, మిషన్ భగీరథ, హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు మొదలగు సంస్థల నుంచి రావాల్సిన బకాయిలు, ఆస్తులు కలిపి రూ.46,155.26 కోట్లు ఉన్నాయని ఉత్తర్వులో పేర్కొన్నారు. రూ.46,126 కోట్లు విద్యుత్ కొనుగోళ్లు, ఇతరములకు సంబంధించిన అప్పులను బదిలీ చేసినట్టు సర్కార్ పేర్కొంది.







కామెంట్లు (0)