Magazines

ఎల్బీనగర్‌, హయత్‌‌నగర్‌ డబుల్‌ డెక్కర్‌ ఎలివేటెడ్‌ కారిడార్‌‌కు ఆమోదం

1 గంట క్రితం

Approval for LB Nagar, Hayatnagar double-decker elevated corridor
avatar
Rajabapu Odela

ప్రచురించబడింది అక్టో 14, 2026 | 2 నిమిషాల చదవడం

తెలంగాణ అభివృద్ధికి కీలక ముందడుగు

పలు కీలక ప్రాజెక్టులకు కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ

సానుకూలం : రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌‌రెడ్డి

నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్‌

​రాష్ట్రాభివృద్ధికి ఊతమిచ్చే పలు మౌలిక వసతుల ప్రాజెక్టులపై కేంద్ర మంత్రి నితిన్‌ ‌గడ్కరీ సానుకూలంగా స్పందించారనీ, ఎల్‌‌బీనగర్‌-హయత్‌‌నగర్‌ ‌డబుల్‌ ‌డెక్కర్‌ ఎలివేటెడ్‌ ‌కారిడార్‌‌కు ఆమోద ముద్ర వేయడం తెలంగాణ అభివృద్ధికి కీలక ముందడుగు అని రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌‌రెడ్డి తెలిపారు. మంగళవారం ఢిల్లీలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో రాష్ట్ర మంత్రి జూపల్లితో కలిసి కోమటిరెడ్డి భేటీ అయ్యారు. పలు కీలక ప్రాజెక్టులపై చర్చించారు. అనంతరం కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడారు. ఎన్‌‌హెచ్‌ 65 హైదరాబాద్ - విజయవాడ - మచిలీపట్నం రహదారి విస్తరణ పనులు జనవరిలో ప్రారంభిస్తామని హామీ ఇచ్చారనీ, కృష్ణా నదిపై సోమశిల వద్ద ఐకానిక్ కేబుల్ బ్రిడ్జి నిర్మాణ శంకుస్థాపనకు అంగీకారం తెలిపారని చెప్పారు. తెలంగాణకు ఐదు రోప్‌వేలు, మూడు ఆర్‌ఓబీలకు ఆమోదం లభించిందని తెలిపారు. హైదరాబాద్–శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్‌పై కొత్త డీపీఆర్‌కు ఆదేశాలు జారీ చేశామన్నారు. 34 రహదారి పనులకు సీఆర్‌ఐఎఫ్‌ నిధుల కోసం కేంద్ర అధికారులకు ‌నితిన్‌ ‌గడ్కరీ ఆదేశాలు జారీ చేశారని చెప్పారు. హైదరాబాద్–అమరావతి గ్రీన్‌ఫీల్డ్ హైవే ప్రతిపాదనపై సానుకూల స్పందించారన్నారు. హైదరాబాద్ లో జరగనున్న ఐఆర్‌‌సీకి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ హాజరవుతారని తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య రోడ్డు అనుసంధానాన్ని మరింత బలోపేతం చేసేలా ఎన్‌‌హెచ్‌ 167‌కెపై కృష్ణా నదికి ఐకానిక్ కేబుల్ బ్రిడ్జి నిర్మాణానికి సంబంధించిన శంకుస్థాపన కోసం చేసిన ప్రతిపాదనకు కేంద్ర మంత్రి అంగీకారం తెలిపారన్నారు. ఈ వంతెన నిర్మాణం పూర్తయితే ఈ ప్రాంతంలో సోమశిల నుంచి సంగమేశ్వర వరకు నిర్మించే ఈ బ్రిడ్జి ద్వారా తిరుపతి వెళ్లే వారికి సుమారు 80కి.మీ దూరం తగ్గి, దాదాపుగా మూడు గంటల ప్రయాణ సమయం తగ్గుతుందని వివరించారు. పర్యాటకం అభివృద్ధి చెందడంతో స్థానికంగా ఉద్యోగ అవకాశాలు మెరుగుపడనున్నాయనీ, ఆర్ధిక కార్యకలాపాలకు కొత్త అవకాశాలు ఏర్పడనున్నాయని తెలిపారు. తెలంగాణలో పర్యాటక అభివృద్ధికి, ప్రముఖ పర్యాటక ప్రాంతాలకు సులభంగా చేరుకునేందుకు పర్వతమాల పథకం కింద ఐదు రోప్‌వేల ఏర్పాటుకు కేంద్ర మంత్రి ఆమోదం తెలిపిందని చెప్పారు. హైదరాబాద్–అమరావతి గ్రీన్‌ఫీల్డ్ హైవే ప్రతిపాదనపైనా కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని తెలిపారు. రహదారులు కేవలం ప్రయాణ సాధనాలు మాత్రమే కాకుండా ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచే అభివృద్ధి మార్గాలని అన్నారు. రాష్ట్ర రహదారి వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు, ప్రజలకు మెరుగైన రవాణా సదుపాయాలు అందించేందుకు ఈ సమావేశం దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో ఎంపీ మల్లు రవి, ప్రభుత్వ విప్‌ ‌బీర్ల అయిలయ్య, రాష్ట్ర అధికారులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్