జెన్కో, ట్రాన్స్‌కోకు సింగరేణి బొగ్గు అడ్డుకుంటాం
విద్యుత్ సౌధ ఎదుట సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ధర్నా
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
సింగరేణి బకాయిలు రూ.59 వేల కోట్లు తక్షణమే చెల్లించాలని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ అనుబంధం) డిమాండ్ చేసింది. లేకుంటే జెన్కో, ట్రాన్స్‌కోకు సింగరేణి బొగ్గు అడ్డుకుంటామని హెచ్చరించింది. మంగళవారం హైదరాబాద్ లోని విద్యుత్ సౌధ ప్రాంగణంలో నిర్వహించిన ధర్నాలో సింగరేణిలోని 12 ఏరియాల నుంచి కార్మికులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా యూనియన్ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య మాట్లాడుతూ వేల కోట్ల బకాయిలు పేరుకుపోవడంతో కార్మికులకు వేతనాలు చెల్లించేందుకు అప్పులు చేస్తున్నారనీ, కనీస భద్రతా పరికరాల కొనుగోలుకు కూడా నిధుల కొరత ఎదురవున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. పండుగల బోనస్ లపైన కూడా ప్రభావం పడుతుందని తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో రూ.26 వేల కోట్ల బకాయిలుంటే కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో అవి రూ.59 వేల కోట్లకు చేరాయని తెలిపారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పై నిప్పులు చెరిగిన డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క స్వయంగా ఆ శాఖ మంత్రిగా ఉండి కూడా నిధులు విడుదల చేయడం లేదని విమర్శించారు. యూనియన్ ప్రధాన కార్యదర్శి రాజ్‌కుమార్ మాట్లాడుతూ సింగరేణి అభివృద్ధి గురించి గొప్పలు చెబుతున్న ప్రభుత్వాలు, సంస్థకు రావాల్సిన బకాయిలను చెల్లించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నాయని విమర్శించారు. ఏఐటీయూసీ గౌరవ అధ్యక్షుడు ఎం.డి.యూసుఫ్ మాట్లాడుతూ సింగరేణిని ప్రయివేటికరించే కుట్రలో భాగంగానే బకాయిలు చెల్లించడం లేదని విమర్శించారు. ప్రభుత్వ కుట్రలను కార్మికుల ఎప్పటికీ సఫలం కానియబోరని ఆయన హెచ్చరించారు. ధర్నా అనంతరం యూనియన్ ప్రతినిధుల బృందం జెన్ కో ఫైనాన్స్ డైరెక్టర్ వీర మహేందర్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ నిరసన కార్యక్రమంలో ఏఐటీయూసీ ఉపాధ్యక్షుడు మారగోని ప్రవీణ్ కుమార్, సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ అదనపు ప్రధాన కార్యదర్శి ఎం. రంగయ్య తదితరులు పాల్గొన్నారు.
34 శాతానికే పరిమితమా?
గతేడాది ప్రకటించిన 34 శాతానికే సింగరేణి బోనస్ ను పరిమితం చేయడం పట్ల సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి రాజ్‌కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గుర్తింపు యూనియన్ సమక్షంలో లాభాలు, బోనస్‌పై ప్రకటన చేయాల్సి ఉండగా, కొన్ని సంఘాలు కోర్టును ఆశ్రయించాయనే కారణంతో కాంగ్రెస్ ప్రభుత్వం గత ఏడాది ప్రకటించిన 34 శాతం బోనస్‌నే ఏకపక్షంగా ప్రకటించిందని ఆరోపించారు. సింగరేణి ప్రాంత ఎమ్మెల్యేలను సమావేశానికి ఆహ్వానించిన ప్రభుత్వం, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావును ఎందుకు పిలవలేదని ప్రశ్నించారు.






కామెంట్లు (0)