Magazines

వృద్ధాశ్రమం భూమి కబ్జాకు యత్నం

1 గంట క్రితం

old age home land
avatar
Rajabapu Odela

ప్రచురించబడింది అక్టో 14, 2026 | 2 నిమిషాల చదవడం

అడ్డుకున్న సీపీఐ(ఎం) కార్యకర్తలపై దాడి

బీరు సీసాలు, కత్తులు, రాళ్లతో దాడి

కార్యకర్తలకు తీవ్ర గాయాలు

ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ అనుచరుల పనేనని సీపీఐ(ఎం) ఆరోపణ

నవతెలంగాణ-నిజాంపేట్‌

​మేడ్చల్‌ ‌మల్కాజిగిరి జిల్లా ప్రగతినగర్‌ పీపుల్స్‌ ప్రోగ్రెస్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో వృద్ధాశ్రమం కోసం కొనుగోలు చేసిన నాలుగు ఎకరాల స్థలాన్ని ఆక్రమించేందుకు కొందరు ప్రయత్నించడం కలకలం రేపింది. దీన్ని అడ్డుకున్న సీపీఐ(ఎం) కార్యకర్తలపై దుండగులు బీరు సీసాలు, కత్తులు, రాళ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో నలుగురు సీపీఐ(ఎం) కార్యకర్తలు గాయపడగా, వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. వివరాల్లోకెళ్తే.. కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గం బౌరంపేట్‌ కమాన్‌ నుంచి బౌదురుపల్లి చౌరస్తాకు వెళ్లే మార్గంలో సర్వే నంబర్‌ 259లో పీపుల్స్‌ ప్రోగ్రెస్‌ ట్రస్ట్‌ నాలుగు ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేసినట్టు ట్రస్ట్‌ ప్రతినిధులు తెలిపారు. అయితే కొందరు వ్యక్తులు నకిలీ పత్రాలు సృష్టించి భూమిని ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని గతంలోనే దుండిగల్‌ రెవెన్యూ అధికారులకు ప్రతినిధులు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో మంగళవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో కొందరు వ్యక్తులు ట్రస్ట్‌ స్థలంలో సంచరిస్తున్నారనే సమాచారంతో సీపీఐ(ఎం) కార్యకర్తలు అక్కడికి వెళ్లారు. స్థలం ట్రస్ట్‌కు చెందినదని, ఇక్కడికి ఎందుకు వచ్చారని ప్రశ్నించడంతో దుండగులు దుర్భాషలాడారు. దాంతోపాటు బీరు సీసాలతో, కత్తులతో సీపీఐ(ఎం) కార్యకర్తలపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో పలువురు గాయపడగా.. ఆస్పత్రికి తరలించి దుండిగల్‌ పోలీసులకు సమాచారం అందించారు. ఇదిలా ఉండగా దాడికి పాల్పడింది ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌ అనుచరులేనని సీపీఐ(ఎం) కార్యకర్తలు ఆరోపించారు.

​దాడిని ఖండించిన సీపీఐ(ఎం) నేతలు

సీపీఐ(ఎం) కార్యకర్తలపై దాడి ఘటనను పార్టీ నాయకులు ఖండించారు. సీపీఐ(ఎం) రాష్ట్ర సీనియర్‌ నాయకులు ‌డిజి.నరసింహారావు ఈ దాడిని ఖండిస్తూ ట్రస్ట్‌ ఆస్తులను పరిరక్షించేందుకు పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరారు. దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని పార్టీ మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా కార్యదర్శి పి.సత్యం డిమాండ్‌ చేశారు. సర్వే నంబర్‌ 259లో ట్రస్ట్‌ చట్టబద్ధంగా కొనుగోలు చేసిన నాలుగు ఎకరాల స్థలంపై కొందరు కావాలనే వివాదాలు సృష్టిస్తున్నారని తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు సమగ్ర విచారణ జరిపి, ట్రస్ట్‌ ఆస్తులకు రక్షణ కల్పించాలని కోరారు. ఘటనా స్థలాన్ని సీపీఐ(ఎం) నాయకులు ఏ.అశోక్‌, జి.శ్రీనివాసులు, రాజశేఖర్‌, వెంకన్న, లక్ష్మణ్‌, నరేష్‌, లింగస్వామి, శంకర్‌, రాథోడ్‌ సంతోష్‌, శ్రీనివాస్‌, పీపుల్స్‌ ప్రోగ్రెస్‌ ట్రస్ట్‌ సభ్యులు శ్రీరాములు చౌదరి, సూర్యప్రకాష్‌, సోమిరెడ్డి, వెంకటరామయ్య పరిశీలించారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్