Magazines

వీడిన చిన్నారి మర్డర్‌ మిస్టరీ

2 గంటల క్రితం

Toddler's murder mystery solved
avatar
Rajabapu Odela

ప్రచురించబడింది అక్టో 13, 2026 | 2 నిమిషాల చదవడం

రూ.20 లక్షల కోసం హత్య

24 గంటల్లో కౌకూర్‌ కేసును ఛేదించిన పోలీసులు

డీసీపీ కార్యాలయం ఎదుట బాధితుల ఆందోళన

నిందితుడిని అప్పగించాలని డిమాండ్‌

సీపీ హామీతో ఆందోళన విరమణ

నవతెలంగాణ-బేగంపేట్

మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా కౌకూర్‌లోని విల్లా ఆర్కిడ్స్‌ గేటెడ్‌ కమ్యూనిటీలో కిడ్నాప్‌‌నకు గురైన ఐదేండ్ల బాలిక హత్య కేసును పోలీసులు 24 గంటల్లో ఛేదించారు. దర్యాప్తులో భాగంగా అదే కమ్యూనిటీలో పనిచేసిన మాజీ సెక్యూరిటీగార్డును పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. చిన్నారి తల్లిదండ్రుల నుంచి రూ.20 లక్షలు వసూలు చేయాలనే ఉద్దేశంతోనే బాలికను అపహరించి, అనంతరం హత్య చేసినట్టు నిందితుడు అంగీకరించాడు. ఈ మేరకు సోమవారం మల్కాజిగిరి సీపీ సుమతి సికింద్రాబాద్‌‌ డీసీపీ కార్యాలయంలో మీడియాకు వివరాలు వెల్లడించారు. విల్లా ఆర్కిడ్స్‌లో నివసించే ఆరేలియా(5) అలియాస్‌ మోను పీపీ-2 చదువుతోంది. ఈనెల 10న సాయంత్రం సైకిల్‌ తొక్కేందుకు క్లబ్‌హౌస్‌ గేమ్స్‌ జోన్‌కు వెళ్లింది. ఎంతసేపైనా చిన్నారి ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. ఇంతలోనే బాలిక తండ్రికి ఫోన్‌ చేసిన గుర్తుతెలియని వ్యక్తి.. చిన్నారి తన వద్ద ఉందని, రూ.20 లక్షలు ఇవ్వాలని డిమాండ్‌ చేశాడు. ఈ విషయాన్ని వారు పోలీసులకు తెలపడంతో బొల్లారం పోలీసులు కిడ్నాప్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బాలిక ఆచూకీ కోసం మల్కాజిగిరి జోన్‌, ఎస్‌ఓటీ, క్రైమ్స్‌, స్పెషల్‌ బ్రాంచ్‌ విభాగాలకు చెందిన పది ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. గేటెడ్‌ కమ్యూనిటీ, క్లబ్‌హౌస్‌, పరిసర ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహించాయి. ఈ క్రమంలో క్లబ్‌హౌస్‌ సెల్లార్‌లోని వాటర్‌ సంప్‌లో చిన్నారి మృతదేహాన్ని గుర్తించారు. దీంతో కిడ్నాప్‌ కేసు కాస్తా హత్య కేసుగా మారింది.

మాజీ సెక్యూరిటీ గార్డుపై అనుమానం

అదే కమ్యూనిటీలో సెక్యూరిటీ గార్డుగా పని చేసిన బీహార్‌లోని నలంద జిల్లాకు చెందిన విక్రమ్‌ కుమార్‌పై పోలీసులు దృష్టి సారించారు. ఈ నెల 11న సాయంత్రం 4.30 గంటలకు అతడిని అదుపులోకి తీసుకున్నారు. రూ.20 లక్షలు వసూలు చేయాలనే ఉద్దేశంతోనే బాలికను అపహరించి, అనంతరం హత్య చేసినట్టు నిందితుడు అంగీకరించినట్టు పోలీసులు వెల్లడించారు. నిందితుడిని కోర్టులో హాజరుపరచనున్నారు. కేసును ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులో విచారించేలా చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు. 24 గంటల్లో కేసును ఛేదించి నిందితుడిని పట్టుకున్న దర్యాప్తు బృందాన్ని ఉన్నతాధికారులు అభినందించారు. గేటెడ్‌ కమ్యూనిటీలు, అపార్ట్‌మెంట్లలో పనిచేసే సెక్యూరిటీ సిబ్బంది, వాచ్‌మెన్లు, ఇంటి పనివారి వివరాలను పూర్తిస్థాయిలో ధ్రువీకరించుకోవాలని మల్కాజిగిరి పోలీసులు సూచించారు. ‘మీ సురక్ష’ డొమెస్టిక్‌ హెల్పర్స్‌ వెరిఫికేషన్‌, ‘నేను సైతం 2.0’ సీసీటీవీ నిఘా కార్యక్రమాల్లో అపార్ట్‌మెంట్‌ అసోసియేషన్లు, నివాసితులు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

డీసీపీ ఆఫీస్‌ వద్ద ఉద్రిక్తత

‌చిన్నారి అపహరణ, హత్య ఘటనపై బంధువులు, విల్లా ఆర్కిడ్స్‌ గేటెడ్‌ కమ్యూనిటీ వాసులు డీసీపీ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. చిన్నారిని హత్య చేసిన నిందితుడిని తమకు అప్పగించాలని బంధువులు డిమాండ్‌ చేశారు. నిందితుడిని బహిరంగంగా ఉరి తీయాలని నినాదాలు చేశారు. పోలీస్‌స్టేషన్‌లోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించిన ఆందోళనకారులను పోలీసులు అడ్డుకున్నారు. నిందితునిపై 60 రోజుల్లోనే కోర్టులో చార్జిషీట్‌ ‌దాఖలు చేసి న్యాయం చేస్తామని సీపీ హామీ ఇవ్వడంతో బాధితులు ఆందోళన విరమించారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్