పంటల సంరక్షణ కోసం 10 రోజుల వరకు 7 టీఎంసీలు
నవతెలంగాణ-నాగార్జునసాగర్
ఆయకట్టు చివరి దశలో ఉన్న వరి పంటలను కాపాడానికి, చెరువులను నింపడానికిగాను భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు నాగార్జునసాగర్ డ్యాం అధికారులు సోమవారం ఎడమ కాలువకు నీటిని విడుదల చేశారు. సాగర్ ఆయకట్టు ప్రాంతంలో ఎండిపోతున్న వరి పంటలను కాపాడాలని నాగార్జునసాగర్, మిర్యాలగూడ శాసనసభ్యులు కుందూరు జైవీర్ రెడ్డి, బత్తుల లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్‌కు రైతుల నుంచి, విపక్షాల నుంచి ఒత్తిడి వస్తోంది. ఈ మేరకు పొలాలు ఎండుతున్న విషయాన్ని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి వివరించారు. ఆలస్యమైతే రైతులకు భారీ నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని, నీరు విడుదల చేయాలని విన్నవించడంతో స్పందించిన మంత్రి నాగార్జునసాగర్ ప్రాజెక్టు అధికారులకు నీటి విడుదల చేయాలని ఆదేశాలిచ్చారు. దీంతో సోమవారం ఉదయం 500 క్యూసెక్కులతో మొదలు పెట్టి 2000, సాయంత్రం వరకు 6 వేల క్యూసెక్కులకు వరకు పెంచనున్నట్టు అధికారులు తెలిపారు. సుమారు పది రోజులపాటు 7 టీఎంసీల నీటిని విడుదల చేయనున్నారు. ఈ నీటిని నల్లగొండ, సూర్యాపేట జిల్లాలకే పరిమితం చేయనున్నారు. నాగార్జునసాగర్ జలాశయంలో ప్రస్తుతం నీటిమట్టం 540.30 అడుగులకు చేరింది. జలాశయంలో 188.9530 టీఎంసీల నీరు నిల్వ ఉంది. శ్రీశైలం నుంచి 2,100 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదవుతుండగా, అంతే మొత్తంలో నీటిని విడుదల చేస్తున్నారు. ఎడమ కాలువకు 6000 క్యూసెక్కులు, ఎస్ఎల్బీసీ ద్వారా 1,500, వరద కాలువ ద్వారా 600 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. రైతులు సాగర్ నీటి కొరతను దృష్టిలో పెట్టుకొని వృథా చేయకుండా నీరు వాడుకోవాలని, వేసవిలో తాగునీటికి ఇబ్బందులు ఎదురవుతాయని తెలిసినా ప్రభుత్వం తప్పనిసరి పరిస్థితులలో నీటి విడుదలకు చేస్తుందని నల్లగొండ జిల్లా ఇరిగేషన్ సీఈ శ్రీనివాస్ రెడ్డి, సాగర్ డ్యామ్ ఎస్ఈ మల్లికార్జున రావు తెలిపారు. జూన్ వరకు తాగునీటి అవసరాలకు సుమారు 20 టీఎంసీల నీరు అవసరం ఉంటుందని చెప్పారు.







కామెంట్లు (0)