Magazines

అరుదైన కీటకం

3 రోజుల క్రితం

A rare insect
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 08, 2026 | 2 నిమిషాల చదవడం

ఆకర్షణీయమైన రంగుల మేళవింపు, 15 సెం.మీ పొడవాటి రెక్కలు, వాటిపై కనుపాపలను పోలిన గుర్తులు.. వీటన్నింటిని చూడగానే ఎవరైనా పెద్దగా ఉండే సీతాకోక చిలుక అనుకుంటారు. కానీ అది సీతాకోక చిలుక కాదు. సహజసిద్ధ అటవీ ప్రాంతాల్లో ఉండే అరుదైన టస్సార్​ సిల్క్​మాత్​ (పట్టు చిమ్మట). అంతర్జాతీయ వస్త్ర మార్కెట్​లో సహజసిద్ధ వన్యపట్టు ఈ జీవి నుంచే ఉత్పత్తి అవుతుంది. అరుదైన టస్సార్​ సిల్క్​మాత్​ మంచిర్యాల జిల్లా తాండూరు అటవీ ప్రాంతంలో తాజాగా కనువిందు చేసింది. ఈ జీవికి కొన్ని ప్రత్యేకతలున్నాయి.

​గుడ్లు, లార్వా, కోశస్థ దశ నుంచి పూర్తి చిమ్మటగా మారిన తర్వాత దానికి ఆహారం తినే నోటి భాగాలు ఏమీ ఉండవు. సుమారు రెండు వారాల వ్యవధిలోనే సంతానోత్పత్తి ప్రక్రియను పూర్తి చేసి చనిపోతుంది. అప్పటి వరకు గొంగళి పురుగు దశలో ఉన్నప్పుడు తిని దాచుకున్న శక్తితోనే జీవించగలుగుతుంది. రాత్రివేళ ఎక్కువగా సంచరించే ఈ కీటకం, ప్రకృతి ఇచ్చిన ఒక విచిత్రమైన ఆత్మరక్షణ తంత్రాన్ని కలిగి ఉంటుంది. దీని రెక్కలపై సరిగ్గా రంధ్రాలు పడినట్లుగా ఉండే మచ్చలే దీనికి ప్రధాన ఆయుధాలు. ఆహార వేటకు వెళ్లినప్పుడు శత్రుపక్షులు దాడి చేయకుండా తన రెక్కలపై ఉన్న ఈ వినూత్న నిర్మాణాలతో వాటిని భయపెడుతుంది.

​అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా ఎంతో గిరాకీ ఉండే టస్సార్​ పట్టును ఉత్పత్తి చేసేది కూడా ఈ చిమ్మెటలే. సాధారణంగా తెలంగాణ ప్రాంతంలో చాలా అరుదుగా కనిపించే ఈ చిమ్మెటలు ఛత్తీస్​గఢ్​, ఒడిశా, ఝార్ఖండ్​, మధ్యప్రదేశ్​, మహారాష్ట్రల్లోని అటవీ ప్రాంతాల్లో విస్తారంగా సంచరిస్తాయి. ఈ అరుదైన పట్టుచిమ్మట గురించి అటవీశాఖ తాండూరు డీఆర్వో గౌరీశంకర్​ అనేక విషయాలు చెప్పారు. సహజసిద్ధంగా ఏర్పడి జీవ వైవిధ్యం కలిగిన దట్టమైన అటవీప్రాంతాల్లోనే ఇవి కనిపిస్తాయన్నారు. మాదారం బీట్​ పరిధిలో ఇవి కనిపించడం హర్షించదగిన విషయమన్నారు. ఈ పరిసర అటవీ ప్రాంతం జీవవైవిధ్యం సమతుల్యంగా ఉందనడానికి ఈ జీవుల ఉనికే నిదర్శనమన్నారు. ఈ జీవి రెక్కల పైభాగంలో ఉండే గుడ్లగూబ, పిల్లి కండ్ల వంటి మచ్చలు శత్రువుల నుంచి రక్షించుకునేందుకు ప్రకృతి ప్రసాదించిన అద్భుతమైన ఆత్మరక్షణ ఆయుధంగా ఉపయోగపడతాయని తెలిపారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్