‘నెలసరి అపవిత్రం కాదు.. అవగాహన లేకపోవడమే అపవిత్రం’. ఉదయం సూర్యుడు తన కిరణాలను భూమిపై చల్లుతున్నాడు. పక్షుల
కిలకిలరావాలతో ఊరు మేల్కొంది. చిన్న గ్రామంలోని ఒక పెంకుటిల్లు నుంచి నవ్వుల శబ్దం వినిపిస్తోంది. ఆ ఇంట్లో అందరికీ ప్రాణం పవిత్ర.
పదకొండేళ్ల చిట్టి పాప. చదువులో తెలివి, మనసులో మంచితనం. తన అమ్మ అంటే ప్రాణం. ప్రతి రోజు స్కూల్‌కి వెళ్లే ముందు అమ్మ జడ వేస్తుంటే పవిత్ర అద్దంలో చూసుకుంటూ, ‘అమ్మా.. నేను పెద్దయ్యాక నీలాగే అందంగా ఉంటానా?’ అని అడిగేది.
అమ్మ నవ్వుతూ ‘నువ్వు నాకంటే ఇంకా అందంగా ఉంటావు’ అనేది. కానీ ప్రతి నెల నాలుగు రోజుల పాటు ఆ నవ్వు ఇంట్లో కనిపించేది కాదు.
ఒక రోజు పవిత్ర గమనించింది. అమ్మ వంటగదిలోకి వెళ్లబోతుంటే నాన్నమ్మ అడ్డుకుంది. ‘అక్కడికి వెళ్లకు.. నీకు నెలసరి వచ్చింది’. అమ్మ నిశ్శబ్దంగా వెనక్కి వచ్చింది. పూజ గదిలోకి వెళ్లలేదు. అందరితో కలిసి భోజనం చేయలేదు. మూలన ఒక చాప వేసుకుని కూర్చుంటుంది. పవిత్ర పరుగెత్తుకుంటూ వెళ్లి అమ్మను హత్తుకోబోయింది.
‘వద్దు పవిత్ర!’ అని నాన్నమ్మ గట్టిగా అరిచింది. పవిత్ర ఒక్కసారిగా ఆగిపోయింది. ‘ఎందుకు నాన్నమ్మా?’ అడిగింది. ‘అమ్మను ఇప్పుడు ముట్టుకోకూడదు’ అంది. ‘ఎందుకు?’ అంది మళ్లీ. ‘అది పెద్దవాళ్ల విషయం’ సూటిగా చెప్పింది. ఆ రాత్రి పవిత్రకు నిద్ర పట్టలేదు. ‘అమ్మ ఏ తప్పూ చేయలేదు.. మరి అందరూ ఎందుకు ఇలా చేస్తున్నారు?’ అని ఆలోచించింది. కొన్ని రోజుల తర్వాత ఇంట్లో శ్రావణ మాసపు పూజలు ప్రారంభమయ్యాయి. అమ్మ ఆందోళనగా ఒక చిన్న చీటీపై మందు పేరు రాసి పవిత్ర చేతిలో పెట్టింది.
‘బంగారం.. మెడికల్ షాప్‌కి వెళ్లి ఈ మందు తీసుకురా’ అంది. పవిత్ర వెళ్లి తీసుకొచ్చింది. అమ్మ మందు వేసుకుంటూ మెల్లగా అంది.. ‘ఈసారి పీరియడ్స్ కొంచెం ఆలస్యంగా వస్తాయి. పండుగ అయిపోయాక వస్తే మంచిది.’ ఆ మాట పవిత్ర గుండెల్లో భయాన్ని నాటింది. ‘అంటే పీరియడ్స్ వస్తేనే అమ్మను అందరూ దూరంగా పెడుతున్నారా? నాకు కూడా త్వరలో వస్తాయంటున్నారు.. అప్పుడు నన్నూ ఇలా చేస్తారా?’ ఆ రోజు నుంచి పవిత్ర మనసులో ఒకే భయం.
‘నాకు పీరియడ్స్ రావొద్దు..’ కొన్ని వారాల తర్వాత అమ్మ మందు వేసుకుంటుండగా పవిత్ర గమనించింది. అమ్మ వెళ్లిన తర్వాత అదే మందు నుంచి ఒక మాత్ర తీసుకుని రహస్యంగా మింగేసింది. ‘ఇలా చేస్తే నాకు పీరియడ్స్ రావు..’ అని అమాయకంగా అనుకుంది. అది ఒకసారి కాదు.. మరోసారి.. ఇంకోసారి... ఆమెకు అది ప్రమాదకరమైన మందు అనే విషయం తెలియదు. అది భయంతో తీసుకున్న నిర్ణయం. ఒక రోజు అమ్మ పనిలో ఉండడంతో పవిత్ర ఒక్కతే మెడికల్ షాప్‌కి వెళ్లింది.
‘అంకుల్.. అదే టాబ్లెట్లు ఇవ్వండి’. షాపులో ఉన్న వ్యక్తి ఆశ్చర్యపోయాడు. ‘ప్రతి నెలా నువ్వే వస్తున్నావు.. ఇవి ఎవరికమ్మా?’ అని అడిగాడు. ‘నాకే’ అంది. ‘నీ వయసెంత?’ అన్నాడు. ‘పదకొండు’ అంది. ఆయన ముఖం ఒక్కసారిగా మారిపోయింది. ‘ఒక్క నిమిషం.. అని వెంటనే పవిత్ర తల్లికి ఫోన్ చేశాడు. కొద్దిసేపట్లో తల్లి పరుగెత్తుకుంటూ వచ్చింది.
‘పవిత్రా.. నువ్వు ఈ మందులు ఎందుకు అడుగుతున్నావు?’ అని వణుకుతున్న
గొంతుతో అడిగింది. పవిత్ర అమాయకంగా ‘నాకు కూడా పీరియడ్స్ వస్తే నన్ను కూడా నీలాగే దూరంగా కూర్చోబెడతారు కదా! నాకు అలా వద్దమ్మా.. అందుకే నాకు పీరియడ్స్ రాకూడదనుకున్నాను’ అంది. ఆ మాట విన్న తల్లి కళ్లలో కన్నీళ్లు ధారపడ్డాయి. పవిత్రను గట్టిగా హత్తుకుంది.
ఇంటికి వెళ్లగానే అందరినీ హాల్లోకి పిలిచింది. ‘ఇవాళ నా కూతురు చేసిన పని తప్పు కాదు.. మనం నేర్పిన భయమే తప్పు’ అన్నది. ఎవరూ మాట్లాడలేదు. ‘ప్రకృతి ఇచ్చిన సహజమైన మార్పును అపవిత్రమని చూపించాం. నా బిడ్డ తన ఆరోగ్యాన్ని పణంగా పెట్టింది. రేపు ఇంకో పాప కూడా ఇలాగే ఆలోచిస్తే దానికి బాధ్యులు ఎవరు? అని ప్రశ్నించింది. భర్త తలదించుకున్నాడు. నాన్నమ్మ కళ్లలో నీళ్లు తిరిగాయి.
మరుసటి రోజు పవిత్రను ఆసుపత్రికి తీసుకెళ్లారు. డాక్టర్ ప్రేమగా నవ్వుతూ ‘పవిత్రా.. నువ్వు ఏ తప్పూ చేయలేదు. నీకు నిజం తెలియలేదు అంతే. కానీ గుర్తుంచుకో.. డాక్టర్ చెప్పకుండా ఎలాంటి మందులూ వాడకూడదు. నెలసరి అనేది ప్రతి అమ్మాయి జీవితంలో సహజమైన మార్పు. అది వ్యాధి కాదు.. అపవిత్రం అంతకన్నా కాదు.
అది ఒక కొత్త జీవానికి ప్రకృతి ఇచ్చిన అద్భుతమైన వరం’ అని చెప్పారు.
అవసరమైన పరీక్షలు చేసి, ఆమె ఆరోగ్యం బాగానే ఉందని చెప్పి తల్లిదండ్రులకు సరైన అవగాహన కల్పించారు. ఇంటికి వచ్చాక నాన్నమ్మ పవిత్ర ముందు చేతులు జోడించింది. ‘నన్ను క్షమించమ్మా. పాత ఆచారాలను నిజమని నమ్మాను. కానీ నీ వల్ల నాకు కొత్త నిజం తెలిసింది’ అంది. తండ్రి పవిత్ర భుజంపై చేయి వేసి ‘ఇకపై మా ఇంట్లో నెలసరి వచ్చిన అమ్మాయిని ఎవరూ దూరంగా పెట్టరు, గౌరవంగా చూసుకుంటారు’ అన్నాడు.
అమ్మ చిరునవ్వుతో పవిత్రను చూసి ‘ఇక నీకు ఎప్పుడూ భయం ఉండదు’ అన్నది. పవిత్ర ఆనందంగా అమ్మ చేతిని పట్టుకుంది. కొన్ని నెలల తర్వాత పవిత్రకు మొదటిసారి నెలసరి వచ్చింది. ఆ రోజు ఇంట్లో ఎవరూ ఆమెను దూరంగా కూర్చోబెట్టలేదు. నాన్నమ్మ స్వయంగా ఆమెకు ఇష్టమైన పాయసం చేసి పెట్టింది. ‘ఇది నీ జీవితంలో ఒక అందమైన కొత్త అడుగు. సిగ్గుపడాల్సిన విషయం కాదు. గర్వపడాల్సిన విషయం’ అని ప్రేమగా చెప్పింది. పవిత్ర ముఖంపై చిరునవ్వు విరిసింది. కిటికీ బయట ఉదయిస్తున్న సూర్యుడిలా.. ఆమె మనసులో కూడా ఒక కొత్త వెలుగు పుట్టింది.
పవిత్ర
53 నిమిషాల క్రితం

balaji
ప్రచురించబడింది అక్టో 03, 2026 | 3 నిమిషాల చదవడం






కామెంట్‌లు (0)