Magazines

తెలంగాణ మాండలిక నాటక వైతాళికుడు కేఎల్. నరసింహారావు

3 రోజుల క్రితం

K.L. Narasimha Rao, a pioneer of plays in the Telangana dialect
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 08, 2026 | 2 నిమిషాల చదవడం

వ్యక్తులు మరణించినా వారి ఆశయాలు మరణించవు. కాలగమనంలో తరాలు మారినా, ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన మహనీయుల ఆదర్శాలు అజరామరంగా నిలుస్తాయి. అక్షరాన్ని ఆయుధంగా, కళను చైతన్య సాధనంగా, నాటకాన్ని సామాజిక పరివర్తన వేదికగా మలచుకున్న అరుదైన సాహితీవేత్త కోదాటి లక్ష్మీ నరసింహారావు. తెలంగాణ పల్లె జీవనాన్ని, ప్రజల భాషను, వారి కన్నీటి కథలను, ఆశలను రంగస్థలంపై సజీవంగా ఆవిష్కరించిన ఆయన జీవితం తెలుగు నాటక సాహిత్య చరిత్రలో ఒక స్ఫూర్తిదాయక అధ్యాయం. కే.ఎల్ నరసింహారావు1924 అక్టోబర్ 23న ఉమ్మడి నల్లగొండ జిల్లా మునగాల పరగణాలోని రేపాల గ్రామంలో కోదాటి వెంకట నరసింహారావు, వెంకట రామానరసమ్మ దంపతులకు జన్మించారు. రేపాలలో ప్రాథమిక విద్యను అభ్యసించి, ఉర్దూ భాష నేర్చుకోవాలనే ఆసక్తితో సూర్యాపేటలో చదువుకున్నారు. అనంతరం జగ్గయ్యపేటలో ఉన్నత విద్యను కొనసాగించారు. అభ్యుదయ భావాలు కలిగిన ఉపాధ్యాయుల పరిచయాలు ఆయనలో సామాజిక స్పృహను పెంపొందించాయి. విద్య అనేది వ్యక్తిగత అభివృద్ధికే పరిమితం కాకుండా సమాజ వికాసానికి పునాది కావాలని ఆయన విశ్వసించారు. ఆ విశ్వాసమే ఆయనను రచయితగా, గ్రంథాలయ ఉద్యమకారుడిగా, సాంస్కృతిక సేవకుడిగా తీర్చిదిద్దింది.1944లో స్వగ్రామానికి తిరిగివచ్చిన ఆయన ప్రజల్లో పఠనాసక్తిని, విజ్ఞానదృష్టిని పెంపొందించాలనే సంకల్పంతో ‘గ్రామవెలుగు గ్రంథాలయం’ను స్థాపించారు. ఎనభైకి పైగా పత్రికలను తెప్పించి ప్రజలకు చదివి వినిపిస్తూ అక్షరజ్ఞానంతోపాటు సామాజిక చైతన్యాన్ని వ్యాప్తి చేశారు.

1945 ప్రాంతంలో భూస్వాములు, జీతగాళ్ల మధ్య నెలకొన్న అసమానతలు ఆయనను కలచివేశాయి. అన్యాయాలను ప్రశ్నిస్తూ ‘విప్లవ శంఖం’ అనే తొలి నాటకాన్ని రచించారు. 1946 జనవరి 1న ‘గ్రామవెలుగు నాట్యమండలి’ని స్థాపించి తన ఆశయాలకు కార్యరూపం ఇచ్చారు. తెలంగాణ యాసను కేవలం హాస్యానికి పరిమితం చేయకుండా, గంభీరమైన సామాజిక సమస్యలను వ్యక్తీకరించే శక్తిమంతమైన సాహిత్య భాషగా నిలబెట్టారు. కే.ఎల్. నరసింహారావు నూట యాభైకి పైగా నాటకాలు రచించినట్లు ఆయన జీవిత విశేషాలు తెలియజేస్తున్నాయి. సాంఘిక, గ్రామీణ, హాస్య, బాలల, చారిత్రక, రేడియో నాటకాలతో ఆయన రచనా ప్రపంచం విస్తరించింది. ‘తొలకరి’ నాటిక తెలంగాణ ఇంటర్మీడియట్‌ ద్వితీయ సంవత్సరం తెలుగు పాఠ్యపుస్తకంలో చోటు సంపాదించడం ఆయన సాహిత్యానికి లభించిన గుర్తింపుగా భావించవచ్చు.

1957లో తండ్రి మరణానంతరం రేపాలకు తిరిగివచ్చిన ఆయన పోస్టుమాస్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తూనే గ్రామ సాంస్కృతిక అభివృద్ధికి కృషి చేశారు. గ్రామవెలుగు నాట్యమండలిని పునరుద్ధరించారు. నాటకాలు, సంగీతం, నృత్యాలు, ఉపన్యాసాలు, వ్యవసాయ ప్రదర్శనలు, శాస్త్రీయ చర్చలతో జాతరను విజ్ఞానోత్సవంగా మలిచారు. 1950 నుంచి 2001 వరకు ఆకాశవాణితో కొనసాగిన అనుబంధం ఆయన రచనలకు విస్తృత శ్రోతృవర్గాన్ని అందించింది. ఆరు దశాబ్దాలకు పైగా సాహిత్య, కళా, సాంస్కృతిక రంగాలకు సేవలందించిన ఆయన చివరి దశలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారనే విషయం ఆలోచించాల్సిన అంశం. 1996లో తెరా సాంస్కృతిక కళామండలి ఆయనను కళాపురస్కారంతో సత్కరించింది.

2023 జూలై 22న కోదాడలో చికిత్స పొందుతూ కే.ఎల్. నరసింహారావు కన్నుమూశారు. ఆయన జీవిత విశేషాలను పుస్తక రూపంలో అందించిన రచయిత వేముల వెంకటేశ్వర్లు కృషి ప్రత్యేకంగా ప్రస్తావించదగినది. తన తండ్రి వేముల నరసింహంకు స్నేహితుడైన కే.ఎల్. నరసింహారావు జీవితాన్ని అధ్యయనం చేసి, ఆయన సేవలను అక్షరబద్ధం చేయడం ద్వారా విలువైన సాహిత్య సంపదను భావితరాలకు అందించారు. తెలంగాణ మట్టివాసనను రంగస్థలంపై పరిమళింపజేసిన ఆ మహనీయుని సాహిత్య ప్రస్థానం భావితరాలకు మార్గదర్శకంగా నిలవాలి.

డా. పూసపాటి వేదాద్రి ,

9912197694



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్