గోపాలం పదవీ విరమణ చేసిన ఒక సాధారణ ప్రభుత్వ ఉద్యోగి. విశ్రాంత జీవితాన్ని ప్రశాంతంగా గడుపుతూ, ఆరోగ్యం కోసం రోజూ ఉదయం, సాయంత్రం వేళల్లో తన స్నేహితులతో కలిసి ఊరి చివర ఉన్న ప్రశాంతమైన రహదారిపై నడకకు వెళ్లేవాడు. ఆ దారి పక్కనే ఊరికి ఆధారమైన ఒక అందమైన చెరువు కూడా ఉండేది.
కానీ, గోపాలం ప్రతిరోజూ అక్కడ ఒక బాధాకరమైన దృశ్యాన్ని గమనించేవాడు. బైక్లు, కార్లలో వెళ్లే కొందరు వ్యక్తులు వాహనాలు ఆపి, తమ వెంట తెచ్చిన ప్లాస్టిక్ సంచులు, కవర్లలోని చెత్తను రోడ్డు పక్కన పడేసేవారు. అంతేకాకుండా, ఆ వ్యర్థాలను పక్కనే ఉన్న చెరువులోకి విసిరేస్తూ వెళ్లేవారు. రోజురోజుకూ ఆ ప్రాంతమంతా దుర్గంధంతో, ప్లాస్టిక్ వ్యర్థాలతో నిండిపోవడం చూసి గోపాలం మనసు తీవ్రంగా కలచివేసింది. దీనికి ఎలాగైనా ఒక శాశ్వత పరిష్కారం చూపాలని ఆలోచించాడు.
మరుసటి రోజు ఉదయమే తన మిత్రులతో కలిసి ఓ మంచి పథకం వేశాడు. ఊరి యువకులను, గ్రామ పంచాయతీ అధికారులను కలిసి పరిస్థితి తీవ్రతను వివరించాడు. వారందరి సహాయంతో శ్రమదానం చేపట్టి, చెరువు పక్కన, రోడ్డు కిరువైపులా పేరుకుపోయిన ప్లాస్టిక్ చెత్తనంతటినీ శుభ్రం చేయించాడు.
అంతటితో ఆగకుండా, చెత్త వేసే ఆ ప్రదేశంలో "మన ప్రకృతిని కాపాడుకుందాం - చెరువును స్వచ్ఛంగా ఉంచుదాం" అని రాసిన పెద్ద బోర్డును ఏర్పాటు చేశాడు. అలాగే రోడ్డు పక్కన వ్యర్థాలు వేయడానికి కొన్ని పెద్ద చెత్తబుట్టలను పెట్టించాడు.
ఆ తర్వాత గోపాలం, ఆయన స్నేహితులు కొన్ని రోజుల పాటు ఉదయం, సాయంత్రం వేళల్లో అక్కడ కాపలా ఉన్నారు. బైక్లు, కార్లలో వచ్చి చెత్త పడేయబోయే వారిని ఆపి, కోపపడకుండా ఎంతో ఆప్యాయంగా మాట్లాడేవారు.
"నాయనా! ఈ చెరువు నీళ్లే మన ఊరికి ఆధారం. మనం వేసే ప్లాస్టిక్ వల్ల నీళ్లు విషపూరితమై మూగజీవాలు చనిపోతున్నాయి. ఈ గాలి, నీరు పాడుచేసుకుంటే రేపు మన పిల్లల భవిష్యత్తు ఏమవుతుంది? చూడండి, పక్కనే చెత్తబుట్టలు ఏర్పాటు చేశాం, చెత్తను అందులోనే వేయండి" అని నెమ్మదిగా నచ్చజెప్పేవారు.
గోపాలం మాటల్లోని నిజాయితీ, ఆ వయసులో ఆయన పడుతున్న ఆరాటం అక్కడ ఆగిన ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేశాయి. తమ తప్పు తెలుసుకున్న వాహనదారులు చెత్తను చెరువులో గానీ, రోడ్డు పక్కన గానీ వేయడం పూర్తిగా మానేశారు. తెచ్చిన వ్యర్థాలను చెత్తబుట్టల్లోనే వేయడం అలవాటు చేసుకున్నారు.
కొద్ది రోజుల్లోనే ఆ ప్రాంతమంతా పరిశుభ్రంగా మారి, చెరువు నీళ్లు స్వచ్ఛంగా అలలసడి చేశాయి. ఒక విశ్రాంత ఉద్యోగి పట్టుదల ఊరి రూపురేఖలనే మార్చేసింది.
నీతి: ప్రకృతిని కాపాడుదాం_ ఆరోగ్యంగా జీవిద్దాం
యాడవరం చంద్రకాంత్ గౌడ్, 9441762105






కామెంట్లు (0)