Magazines

ఏది నిజం?

3 రోజుల క్రితం

What is true?
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 08, 2026 | 3 నిమిషాల చదవడం


జుట్టుపోలుగాడు : అరె మావా కేతిగా! మా నాయకుడు హైదరాబాద్‌ ‌వచ్చి ధూం ధాం చేశాడు. ‘అసలు బోగస్‌ ఓట్ల కోసమే కాంగ్రెస్‌ ‌రచ్చరచ్చ చేస్తుంది. అక్రమ చొరబాటుదారులను కాపాడేందుకే ఈ తతంగమంతా. దేశాన్ని తప్పుదోవ పట్టిస్తుంది. ఎవరెంత ప్రయత్నించినా చొరబాటు దారులందరినీ తన్ని తరిమేసేవరకు ఊరుకోం’ అంటూ ‘ప్రజాస్వామ్యాన్ని రక్షిద్దాం. అరాచకత్వాన్ని అంతం చేద్దాం’ అని పిలుపునిచ్చాడు తెల్సా.

కేతిగాడు : మొగుడ్ని కొట్టి మొగసాలకెక్కడం అంటే ఇదే. దేశంలో పదమూడుకోట్ల మందికి పైగా ఓట్లు గల్లంతయ్యాయని దేశమంతా గగ్గోలు పెడ్తుంటే వాటికి సమాధానం చెప్పకుండా తప్పుదోవంటే ఎట్టా కుదురుద్ది?

జుట్టుపోలుగాడు : ఈ పదమూడు కోట్ల మందిలో మూడు కోట్లమంది చొరబాటు దార్లేనంట. మిగిలిన పదికోట్ల మంది అడ్రస్‌ ‌మారినవి, మరణించినవారివి, డూప్లికేట్‌ ఉన్నవారివంట.

కేతిగాడు : హమ్మయ్య. గల్లంతైన ఓట్లు ఏ రూపంలోనైనా పదమూడు కోట్లు వున్నట్టు ఈ రూపంలోనైనా ఒప్పుకున్నందుకు చాలా సంతోషం. ఇప్పటిదాకా ఈ చొరబాటుదారులని, వారివారి దేశాలకు పంపకుండా అడ్డుకున్నదెవరు? కేంద్రంలో గత 12 ఏళ్లుగా అధికారంలో ఉన్నది మీరే కదా. ఎందుకు పంపలేదు, అడ్డుకోలేదు మరి? మొత్తం ఈ తతంగాన్నంతా పబ్లిక్‌ ‌డొమైన్‌‌లో పెట్టమంటే ఎన్నికల కమిషన్‌ ఎందుకు పెట్టదు?

జుట్టుపోలుగాడు : అంటే..?

కేతిగాడు : మొత్తం మన దేశంలో ప్రజలు ఇంతమంది, ఓటర్లు ఇంతమంది, పరాయి దేశస్థులు (చొరబాటుదార్లు) ఇంతమంది, ఫలానా కాలం నాటికి చనిపోయిన వాళ్లు ఇంతమంది, కొత్తగా ఓటర్లైన వాళ్లు ఇంతమంది... ఇలా అన్ని లెక్కలతో ఎక్కడికక్కడ, పంచాయితీల వారీగా వార్డుల వారీగా జాబితాలు అతికించి పెట్టొచ్చుగా. ఆధార్‌ ‌కార్డులు తీసుకునేలా ఓటరు ఐడి కార్డులు తీసుకునేట్టు సహకరించొచ్చు కదా. అలా చేయకుండా ఎంతకాలం మసిపూసి మారేడు కాయ చేస్తారు?

జుట్టుపోలుగాడు: ఇవన్నీ అడ్డగోలు మాటలు. నిజంగా మా బిజెపివి అక్రమాలు అయితే తెలంగాణలో కాంగ్రెస్‌ ఎలా గెలుస్తుంది? అని మా నాయకుడు అన్నాడు తెల్సా?

కేతిగాడు : ప్రజాస్వామ్యానికి పారద్శకత - జవాబుదారీతనం అనే రెండు కళ్లుంటాయి. ఎన్నికల కమిషన్‌ అది పాటించాలి. దాని గురించి మాట్లాడకుండా అడ్గగోలుగా ఏదేదో మాట్లాడుతుంది మీరు. అందుకే కాంగ్రెస్‌ ‌మాక్‌ పార్లమెంట్‌ ‌నిర్వహించి ప్రజా అభిశంసన కార్యక్రమం చేపట్టంది. ఓట్ల చోరీ దేశద్రోహం అని ప్రకటించింది. చీఫ్‌ ఎలక్షన్‌ ‌కమిషనర్‌ ‌జ్ఞానేష్‌ కుమార్‌‌ను తప్పించి, దేశద్రోహం కేసుగా విచారణ జరిపించాలని డిమాండ్‌ ‌చేసింది. అసలు ఓట్ల చోరీ కోసమే బిజెపి పద్ద కుట్ర చేసిందని, 13.2 కోట్ల ఓట్లు అన్యాయంగా తొలగించిదని, చివరకు పార్లమెంటు ఆమోదం లేని ఫారం -6 ను ఇష్టారాజ్యంగా మార్చుకున్నదని, ఎలక్షన్‌ ‌కమిషన్‌ ఇంటర్నెట్‌ ‌వేదికను తన ఆధీనంలోకి తీసుకుని క్షేత్రస్థాయి పరిశీలనా ప్రక్రియను అనామకం చేసిందని, తక్కిన ఇద్దరు కమిషనర్లను దూరం పెట్టి, జ్ఞానేష్‌‌ను తమ కీలు బొమ్మగా మార్చిందని... ఇంత విస్పష్టంగా కాంగ్రెస్‌ ‌తీర్మానించింది. ఇండియా కూటమి బలపరిచింది.

జుట్టుపోలుగాడు : అందుకే మీ బతుకు ఇక మాక్‌ ‌పార్లమెంటేనని, అక్కడ కూడా రాహుల్‌ ‌గాంధీది ఎప్పటికీ ప్రతిపక్ష పాత్రేనని మా నాయకుడు ఎద్దేవా చేశాడు. గమనించలేదా?

కేతిగాడు : కాంగ్రెస్‌ అక్కడితో ఆగలేదు కదా.. రాజధాని ఢిల్లీ నగరం రామ్‌‌లీలా మైదానంలో లక్షాలాది మందితో భారీ బహిరంగ సభ జరిపింది. నీవది గమనించలేదా... ‘ఓటు దొంగిలించడమంటే దేశాన్ని దొంగిలించడమే. మోడీ, అమిత్‌‌షా, జ్ఞానేష్‌లు దేశం గొంతు నొక్కారు. జ్ఞానేష్‌ ఇక జైలుకే అంటూ దేశాన్ని మనం సరైన మార్గంలో నడిపించుకుందాం’ అని రాహుల్‌ ‌గాంధీ పిలుపునిచ్చాడు.

జుట్టుపోలుగాడు : అది విన్నాడు గనుకనే మా నాయకుడు అన్నాడు. రాహుల్‌ ‌గాంధీ మీరెప్పటికీ ప్రధాని కాలేరు. విదేశీ శక్తుల అండతోనే ఆ ర్యాలీ జరిగిందని విమర్శించాడు.

కేతిగాడు : ఏది నిజమో జనానికి తెలిపేందుకు బహిరంగ చర్చకు సిద్ధమని రాహుల్‌ ‌సవాల్‌ ‌విసిరాడుగా. అబద్దాలు చెప్పడం ఆపండి. ఆ విదేశీ శక్తులు సోషల్‌ ‌మీడియా అండతోనే మీ పదవిని మీరు కాపాడుకుంటున్నారు. ధైర్యముంటే బహిరంగ చర్చకు రండి అని ఆహ్వానించాడు తెల్సా...

బంగారక్క : ఒక్కటి మాత్రం నిజం. సిఇసి జ్ఞానేష్‌ ‌కుమార్‌ ఇంతగా బరితెగించి ఓట్‌ ‌చోరీ అక్రమాలకు పాల్పడకపోతే ఇండియా కూటమిలోని 21 పార్టీలకు ఇంత బలం ఎక్కడనుండి వచ్చేది. రాజకీయ పార్టీ కానీ కాక్రోచ్‌ ‌జనతా పార్టీ యువత ఎందుకు ఇంతగా రంగంలోకి దూకేది? పత్రికలు, మీడియా ఎందుకింత ఘోషించేవి. దేశ స్వాతంత్ర్యాననంతరం ఓటు హక్కు గురించి ఇంత ఎత్తున చర్చ జరగటం ఇదే ప్రథమం. అధికారంలో ఎవరు వుంటారు? ఎవరు వస్తారు అన్నది కాదు ముఖ్యం. ఆయుధం లేకుండా యుద్ధానికి, ఓటు లేకుండా ఎన్నికలకు పోలేం. ఓటు ప్రజాస్వామ్య ప్రాథమిక ఆయుధం. అందుకే ఓటు హక్కు కాపాడుకునే ఉద్యమం అనివార్యమైంది.


కె.శాంతారావు, 99597 45723

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్