న్యూరో సైన్సెస్, జెనెటిక్ సైన్సెస్‌లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌గా ‘టిమ్స్’
పెండింగ్ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలి : వైద్య, ఆరోగ్యాశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ
ఆస్పత్రిలో పనుల పరిశీలన .. అధికారులతో సమీక్ష
నవతెలంగాణ-సిటీబ్యూరో
హైదరాబాద్‌లోని అల్వాల్ టిమ్స్ ఆస్పత్రి పనులను డిసెంబర్ చివరి నాటికి పూర్తి చేసి, కొత్త ఏడాది జనవరిలో అందుబాటులోకి తీసుకొస్తామని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. ఆస్పత్రి నిర్మాణ పనులు, మౌలిక సదుపాయాలు, వైద్య పరికరాల ఏర్పాటు పురోగతిని మంత్రి మంగళవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
స్థానిక ఎమ్మెల్యే శ్రీగణేష్, ఆర్అండ్బీ, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో కలిసి దాదాపు 3 గంటలపాటు ఆస్పత్రిలోని అన్ని బ్లాక్‌లు, ఓపీ విభాగం, డయాగ్నస్టిక్స్, సీటీ స్కాన్, ఎక్స్ రే విభాగాలు, ఆపరేషన్ థియేటర్లు, ఇతర వైద్య విభాగాలను మంత్రి పరిశీలించారు. అందుబాటులో ఉన్న సదుపాయాలు, ఇంకా చేపట్టాల్సిన పనులపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆర్ అండ్ బీ అధికారులు, వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు, నిర్మాణ పనులు చేపడుతున్న కాంట్రాక్ట్ ఏజెన్సీ ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. ఆస్పత్రిలో
ఇంకా పూర్తి చేయాల్సిన సివిల్, ఎలక్ట్రికల్, తదితర పనులను వేగవంతం చేయాలని మంత్రి ఆదేశించారు. ఆక్సిజన్, మెడికల్ గ్యాస్ పైప్‌లైన్ వ్యవస్థ, ఓపీ కౌంటర్లు, హెల్ప్ డెస్క్‌లు, ఫార్మసీ, కన్సల్టేషన్ రూములు, టాయిలెట్లు, ఆపరేషన్ థియేటర్లకు అవసరమైన అనుబంధ సదుపాయాలన్నీ పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. రోగులకు ఎలాంటి అసౌకర్యమూ కలగకుండా ప్రతి విభాగాన్నీ ప్రణాళికాబద్ధంగా సిద్ధం చేయాలని సూచించారు. అత్యవసర విభాగంలో రోగుల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా ప్రవేశ మార్గాలను క్రమబద్ధీకరించాలని ఆదేశించారు.
ప్రస్తుతం పనులు 95 శాతానికిపైగా పూర్తయ్యాయని అధికారులు మంత్రికి వివరించారు. మిగిలిన పనులను వేగంగా పూర్తి చేసి జనవరి 2027 నాటికి ఆస్పత్రిని ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు.
ఈ ఆస్పత్రిలో మొత్తం 1,000 బెడ్లు అందుబాటులో ఉంటాయని వెల్లడించారు. 21 మేజర్, 7 మైనర్ ఆపరేషన్ థియేటర్లు అందుబాటులో ఉంటాయన్నారు. అత్యాధునిక వైద్య పరికరాలు, డయాగ్నస్టిక్ సదుపాయాలతో రోగులకు సమగ్ర వైద్య సేవలు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.
న్యూరో, జెనెటిక్ సైన్సెస్‌లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్
అల్వాల్ టిమ్స్‌ను న్యూరో సైన్సెస్, జెనెటిక్ సైన్సెస్ విభాగాల్లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌గా అభివృద్ధి చేయనున్నట్టు మంత్రి తెలిపారు. ఈ విభాగాల్లో అత్యాధునిక వైద్య సేవలతోపాటు పరిశోధనలకు కూడా ప్రాధాన్యత ఇవ్వనున్నట్టు చెప్పారు. న్యూరాలజీ, న్యూరోసర్జరీ వంటి ప్రత్యేక వైద్య విభాగాలతోపాటు వివిధ సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు ఒకే చోట అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. దీన్ని కుత్బుల్లాపూర్ ప్రభుత్వ మెడికల్ కాలేజీకి అనుబంధ టీచింగ్ ఆస్పత్రిగా అభివృద్ధి చేయనున్నట్టు వెల్లడించారు. ఆస్పత్రి ప్రాంగణంలో నర్సింగ్ కాలేజీని కూడా ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. ఆస్పత్రికి వచ్చే రోగుల సహాయకులు, బంధువులకు వసతి కల్పించేందుకు ధర్మశాల నిర్మాణం కూడా చేపడుతున్నారు.






కామెంట్లు (0)