Magazines

ఓట్ల కోసమే బీజేపీ మత రాజకీయాలు

1 గంట క్రితం

politics
avatar
balaji

ప్రచురించబడింది నవం 21, 2026 | 6 నిమిషాల చదవడం

మోడీ 12 ఏండ్ల పాలనలోని భయాన్ని 12 రోజుల్లోనే తొలగించిన జెన్‌‌జీ యువత

దమ్ముంటే ఓవైసీపై అమిత్‌‌షా పోటీ చేయాలి

ఆ పార్టీలో మోడీ, షా తప్ప నాకెవరూ తెలియదు..బీఆర్‌ఎస్‌ ఒక ‘ఫూల్స్‌ ప్యారడైజ్‌’

కేసీఆర్ ‘రావణాసురుడు’..కేటీఆర్ ‘మేనేజ్‌మెంట్ కోటా’ నేత..ఆ రెండు పార్టీలతో పేద‌ల‌కు,

దేశానికి లాభం లేదు..డీలిమిటేషన్‌తో దక్షిణాదికి గొడ్డలిపెట్టు..చేగువేరా స్ఫూర్తే మాకు

ఆదర్శం..‘సదరన్ రైజింగ్ సమ్మిట్ 2026’లో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు


నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌
ఓట్ల కోసమే బీజేపీ కుల, మత రాజకీయాలకు పాల్పడుతోందని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి విమర్శించారు. నిజంగా దమ్ము, ధైర్యం ఉంటే కేంద్ర హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి స్థానిక ఎంపీ అసదుద్దీన్ ఓవైసీని ఓడించాలని సవాల్ చేశారు. హిందూ, ముస్లింల ఓట్ల కోసమే మోడీ, అమిత్ షా, అసదుద్దీన్ ఓవైసీ ప్రయత్నిస్తున్నారని అన్నారు. అంతే తప్ప వారి మధ్య పెద్దగా పోటీ ఏమీ లేదని తెలిపారు. కాంగ్రెస్ మాత్రం అన్ని వర్గాలను కలుపుకుని వెళుతున్నదని స్పష్టం చేశారు. ఇక లోక్‌సభ నియోజకవర్గాల సంఖ్యను 50 శాతం పెంచితే కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో దక్షిణాది అవసరం లేకుండా పోతుందని సీఎం ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. కేవలం ఉత్తరాది సీట్ల బలంతోనే అధికారం దక్కించుకునే ప్రమాదం ఉందని హెచ్చరించారు. డీలిమిటేషన్ తర్వాత మొత్తం 850 సీట్లలో ఉత్తరాదికి 650 సీట్లు, దక్షిణాదికి 195 సీట్లు మాత్రమే వచ్చే అవకాశం ఉందని తెలిపారు. ఈ చ‌ర్య‌ దక్షిణ భారత ప్రాధాన్యాన్ని తుడిచిపెట్టే కుట్ర అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలంటే చట్టాలు, రాజ్యాంగాన్ని మార్చాల్సిన పని లేదనీ, ఉన్న 543 సీట్లలోనే 181 సీట్లను మహిళలకు కేటాయించవచ్చని ముఖ్యమంత్రి సూచించారు.

తెలంగాణలో తమకు ప్రధాన రాజకీయ ప్రత్యర్థి బీఆర్ఎస్‌ ‌మాత్రమేననీ, రాష్ట్రంలో బీజేపీకి ఉనికే లేదని వ్యాఖ్యానించారు. ఈ రెండు పార్టీలతో దేశానికి, ప్రజలకు లాభం లేదని అన్నారు. రామాయణ కథలో కేసీఆర్ ‘రావణాసురుడు’ అయితే కేటీఆర్ ‘మేనేజ్‌మెంట్ కోటా’ నేత అని చెప్పారు. శుక్ర‌వారం హైదరాబాద్‌లోని హోటల్ పార్క్ హయత్‌లో జరిగిన ‘ఏబీపీ న్యూస్’ ప్రతిష్టాత్మక వేదిక ‘సదరన్ రైజింగ్ సమ్మిట్-2026’లో ముఖ్యమంత్రి పాల్గొని తాజా రాజ‌కీయ ప‌రిణామాల‌పై త‌న అభిప్రాయాల‌ను వెల్ల‌డించారు. కేంద్ర ప్రభుత్వం తలపెట్ట‌ద‌లిచిన డీలిమిటేషన్ (నియోజకవర్గాల పునర్విభజన) ప్రణాళిక ఏ ఒక్క రాజకీయ పార్టీకో సంబంధించిన సమస్య కాదని స్పష్టం చేశారు. ఆ విష‌యం యావ‌త్ దక్షిణ భారతదేశ ప్రజలందరి భవిష్యత్తుకు పెను సవాల్ అని ఆయన ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ఇండియా కూటమిలోని కొన్ని మిత్రపక్షాలు ఈ అంశంపై మద్దతు ఇస్తాయన్న ఊహాగానాలపై స్పందిస్తూ ‘ ఎవరు మద్దతు ఇచ్చినా ఇవ్వకపోయినా..

మాకు అభ్యంతరం లేదు’ అని అన్నారు. కానీ ఈ విధానం అమలైతే దక్షిణాది ప్రాధాన్యత పూర్తిగా అంతరించిపోతుందని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ప్రజాస్వామ్యంలో సంఖ్యాబలం అత్యంత కీలకమని వివరించారు. గతంలో వాజ్‌పేయి నేతృత్వంలోని ప్రభుత్వం కేవలం ఒక్క ఓటు తేడాతో కూలిపోయిన విషయాన్ని ముఖ్యమంత్రి గుర్తుచేశారు. బీజేపీ చెబుతున్న సీట్ల సంఖ్యను లెక్కించే విధానంపై మాట్లాడుతూ ‘‘ప్రస్తుతం కేరళంలో 20 మంది ఎంపీలు, ఉత్తరప్రదేశ్‌లో 80 మంది ఎంపీలు ఉన్నారు. ఇరు రాష్ట్రాల మధ్య 60 సీట్ల వ్యత్యాసం ఉంది. ఒకవేళ 50 శాతం సీట్లు పెంచితే కేరళంలో 30, యూపీలో 120 సీట్లు అవుతాయి. అప్పుడు ఆ వ్యత్యాసం 90 సీట్లకు చేరుతుంది. ఇంత భారీ తేడా ఏర్పడితే దక్షిణాది రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో పట్టించుకునే వారే ఉండరు’’ అని సీఎం వివరించారు. దక్షిణాదిలో ప్రస్తుతం 129 మంది ఎంపీలు ఉండగా, పునర్విభజన తర్వాత అది దాదాపు 195కి చేరుతుందన్నారు. ‘‘మొత్తం 850 సీట్లలో 650 సీట్లు ఉత్తరాది రాష్ట్రాలకే దక్కితే, బీజేపీ ఏ విధంగానైనా మెజారిటీ సాధిస్తే దక్షిణ భారతదేశ ప్రాధాన్యం పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుంది.

కేవలం తాత్కాలిక రాజకీయ లబ్ది కోసం ప్రధాని మోడీ చేస్తున్న ఈ ప్రయోగం రాబోయే రోజుల్లో దేశానికి పెద్ద ప్రమాదంగా పరిణమిస్తుంది’’ అని ఆయన హెచ్చరించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 175 (ఆంధ్ర), 119 (తెలంగాణ) సీట్ల సమీకరణంలో మెజారిటీ బలంతో తెలంగాణకు అన్యాయం జరిగిందనీ, అందుకే పోరాడి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్నామని ఆయ‌న అన్నారు. జనాభా, జీడీపీ ఆధారంగా ‘50 శాతం ఫార్ములా’ను అమలు చేయాలని సూచించారు. మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలన్న నిజమైన చిత్తశుద్ధి కేంద్ర ప్రభుత్వానికి ఉంటే వెంటనే ఆ పనికి పూనుకోవచ్చని స్పష్టం చేశారు. అందుకోసం కొత్త చట్టాలు, సవరణలు అవసరం లేదని గుర్తు చేశారు. ప్రస్తుతం ఉన్న 543 లోక్‌సభ స్థానాల్లోనే 181 స్థానాలను మహిళలకు కేటాయించవచ్చని సూచించారు. 2023లో మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందడానికి కాంగ్రెస్ పార్టీ సహకరించిందని తెలిపారు. ఇప్పుడు సంఖ్యాబలం ఉందని బెదిరించి బిల్లు పాస్ చేయించుకున్నా, భవిష్యత్తులో డీలిమిటేషన్ అమలైతే దక్షిణాదికి తీవ్ర నష్టం వాటిల్లుతుందని స్పష్టం చేశారు. తెలంగాణలో బీజేపీకి చోటులేదు తాను ఏబీవీపీ నుంచే రాజకీయ ప్రస్థానం ప్రారంభించినప్పటికీ, దేశానికి రాహుల్ గాంధీ నాయకత్వం అవసరమని భావించి కాంగ్రెస్‌లో చేరానని సీఎం రేవంత్‌‌రెడ్డి తెలిపారు.

తెలంగాణలో బీజేపీకి ఎలాంటి ఉనికీ లేదని వ్యాఖ్యానించారు. ఆ పార్టీకి చాలా స్థానాల్లో పోటీ ఇచ్చే స్థాయి కూడా లేదని స్పష్టం చేశారు. గెలిచే రాష్ట్రాల్లోనే బీజేపీ ‘ఓట్ చోరీ’కి పాల్పడుతోందని అన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సికింద్రాబాద్ పరిధిలో ఇటీవ‌ల జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు జ‌రిగితే... బీజేపీ డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయిందని ఎద్దేవా చేశారు. ఇక వారు మాకు పోటీ ఇచ్చేది ఏంటని ప్రశ్నించారు. దేశంలో ఉన్న మిగతా ముగ్గురు కాంగ్రెస్ ముఖ్యమంత్రుల్లో ఎవరితో ఎక్కువ అనుబంధం ఉందని ఏబీపీ యాంకర్ మేఘా ప్రసాద్ అడగ్గా... కర్నాటక సీఎం డీకే శివకుమార్ తో తన అనుబంధం చాలా ప్రత్యేకమని సీఎం రేవంత్ రెడ్డి జవాబిచ్చారు. ఇక బీజేపీలో నచ్చిన ముఖ్యమంత్రి ఎవరని అడగ్గా... అసలు ఆ పార్టీలో మోడీ, అమిత్ షా తప్ప వేరే పేరే తనకు తెలియదన్నారు. కనీసం గుర్తుకు కూడా రావడం లేదని తెలిపారు. నీతి ఆయోగ్ సమావేశాలకు వెళ్లినప్పుడు బీజేపీ ముఖ్యమంత్రుల పేర్లు కూడా గుర్తురాక నేమ్ బోర్డులు చూడాల్సి వస్తున్నదని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ నేతలవి పగటి కలలు..

కేసీఆర్ ‘రావణాసురుడు’ బీఆర్ఎస్ నాయకులంతా ‘ఫూల్స్ ప్యారడైజ్’ (పగటి కలలు) లో జీవిస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. నిన్ననే సిద్దిపేటకు వెళ్లి కాంగ్రెస్ జెండాను ఎగరవేసి వచ్చామని చెప్పారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను తాను రాజకీయ ప్రత్యర్థిగా పరిగణిస్తాననీ, కానీ కేటీఆర్‌ను అసలు సీరియస్‌గా తీసుకోనని అన్నారు. తాను కేవలం 17 ఏండ్లలో జడ్పీటీసీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, ఎంపీ, పీసీసీ ప్రెసిడెంట్ స్వయంశక్తితో ముఖ్యమంత్రి పదవిని సాధించానని ధీమా వ్యక్తం చేశారు. కేటీఆర్ మాత్రం తండ్రిని అడ్డం పెట్టుకుని ‘మేనేజ్‌మెంట్ కోటా’లో నాయకుడయ్యారని తెలిపారు. ఇక తన రాజకీయ కథలో కేసీఆర్ ‘రావణాసురుడు’ అని, గతంలో కేసీఆర్ ప్రోత్సహించిన పార్టీ ఫిరాయింపులే ఇప్పుడు ఆయన్ను చుట్టుకున్నాయని వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం ఉండాలనే ఉద్దేశంతోనే బీఆర్ఎస్‌ను కొనసాగిస్తున్నామనీ, లేదంటే ఎప్పుడో ఖాళీ చేసేవారమని సీఎం రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు.


ఆయనో విజిటింగ్ పీఎం

ప్రధాని నరేంద్ర మోడీ ఒక ‘విజిటింగ్ ప్రైమ్ మినిస్టర్’లా మారారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఆయన విదేశీ పర్యటనలకు లెక్క లేకుండా పోయిందని విమర్శించారు. ప్రధాని తన జీవితంలో ఏనాడు నిజం మాట్లాడలేదని ఆరోపించారు. బీజేపీ ఎప్పుడూ అబద్ధాలే చెబుతూ అధికారం కోసమే పాకులాడుతున్నదని అన్నారు. సీబీఐ, ఐటీ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటోందని చెప్పారు. జాతి, మతం, భాష పేరుతో విభేదాలు సృష్టిస్తోందని వివరించారు. స్వాత్యంత్ర స‌మ‌ర‌యో ధుల పోరాట ఫ‌లితంగానే ఈ దేశంలో పేద‌, ధ‌నిక, కుల, మ‌త తేడా లేకుండా ప్ర‌తి ఒక్క‌రికీ ఓటు హ‌క్కు వ‌చ్చింద‌న్నారు. అయితే, పేదల ఓటు హక్కును తొలగించే కుట్ర జరుగుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ విదేశాల్లో మోడీ ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు చేయడాన్ని ఎలా చూస్తార‌న్న ప్ర‌శ్న‌కు బ‌దులుగా చేగువేరా స్ఫూర్తే త‌మ‌కు ఆద‌ర్శ‌మ‌ని సీఎం అన్నారు.

పేదల హక్కుల కోసం ఆయ‌న ఏ దేశంలో స‌మ‌స్య ఉంటే ఆ దేశానికి వెళ్లి పోరాడార‌ని గుర్తు చేశారు. తాము కూడా ఆయ‌న స్ఫూర్తితోనే ప్రజా సమస్యలపై పోరాడుతామని స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ చేపట్టిన ‘ఓట్ చోర్ - గద్దీ చోర్’ నినాదానికి దేశవ్యాప్తంగా ప్రజల నుంచి విశేష మద్దతు లభిస్తున్నదని తెలిపారు. 12 ఏండ్ల పాలనలో ప్ర‌ధాని మోడీ రూ. 120 లక్షల కోట్ల అప్పులు చేశారని సీఎం తెలిపారు. మోడీకి ముందున్న ప్రధానులందరి అప్పు దాదాపు రూ. 53 లక్షల కోట్లు మాత్రమేనని వివరించారు. మ‌రి ఇంత అప్పు చేసి ఆయ‌న ఈ దేశంలో ఒక్క ప్రాజెక్టు నిర్మించ‌లేద‌నీ, ఒక్క ప్ర‌తిష్టాత్మ‌క విద్యాసంస్థ కూడా నిర్మించ‌లేద‌ని ఆరోపించారు. తొలి ప్ర‌ధాని జ‌వ‌హ‌ర్ లాల్ నెహ్రూ భాక్ర‌నంగ‌ల్ ప్రాజెక్టు, నాగార్జున సాగ‌ర్‌, ఐఐటీ, ఐఐఎం, ఎయిమ్స్ వంటి ప్ర‌తిష్టాత్మ‌క సంస్థ‌ల‌ను నిర్మించార‌ని తెలిపారు. ఇందిరా గాంధీ పేదరిక నిర్మూలన, బ్యాంకుల జాతీయీకరణ, రాజభరణాల రద్దు తదితర కీలక నిర్ణయం తీసుకున్నారని అన్నారు.

రాజీవ్ గాంధీ టెలికం విప్లవంతో దేశంలో టెక్నాలజీకి ప్రాణం పోశారని వివరించారు. ఎల్పీజీ పాలసీలను పీవీ తీసుకొచ్చారనీ, ఆ తర్వాత మన్మోహన్ సింగ్ వాటిని కొనసాగించి దేశ ప్రగతికి కారకులయ్యారన్నారు. అయితే, ప్రధాని మోడీ మాత్రం పీఎం అయ్యాక దేశ ప్ర‌జ‌ల‌ను తిప్ప‌ల‌కు గురి చేస్తూ... అప్పులు చేస్తున్నార‌ని... ఆ డ‌బ్బును నేరుగా దోచి అదానీ జేబులో వేస్తున్నారని ఆగ్ర‌హం వ్యక్తం చేశారు. కాగా, తెలంగాణ ప్ర‌భుత్వం కూడా అదానీతో వ్యాపారాలు చేయ‌డం లేదా అనే ప్ర‌శ్న‌కు... తాము అదానీ సొమ్ముతో ఇక్క‌డి ప్ర‌జ‌ల‌కు ఉపాధి క‌ల్పిస్తున్నామ‌ని అన్నారు. కానీ, మోడీలా మాత్రం ప్ర‌జ‌ల సొమ్మును అదానీ జేబులో వేయ‌డం లేద‌న్నారు. దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన పార్టీ కాంగ్రెస్ మాత్రమేనని, ప్రజలు ఉన్నంత కాలం మరో వెయ్యేళ్లు కాంగ్రెస్ పార్టీ ప్రజల తరఫున పోరాడుతూనే ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. 12 ఏండ్లల్లో మోడీ పెట్టిన భయాన్ని యువత 12 రోజుల్లో తొలగించిందని స్పష్టం చేశారు. ఖేలో ఇండియాను నిర్వహిస్తున్నామని, ఇప్పటికే మెస్సీని తీసుకొచ్చామని అన్నారు.




ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్