Magazines

416 గ్రామాల్లో ‌సమ్రగ భూసర్వే పూర్తి

51 నిమిషాల క్రితం

Comprehensive land survey completed in 416 villages
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 11, 2026 | 3 నిమిషాల చదవడం

వెయ్యి గ్రామాల్లో రీసర్వే 
మైలురాయిని దాటాం

యజమానుల ప్రయోజనాలే ప్రాధాన్యం

రెవెన్యూ రికార్డుల ఆధారంగానే సర్వే

భూసమస్యలకు శాశ్వత 
పరిష్కారం చూపాలి

చిన్న పొరపాటు భూవివాదానికి కారణం కావొద్దు : 
సమీక్షలో మంత్రి పొంగులేటి

నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్‌

రాష్ట్రంలో వెయ్యి గ్రామాల్లో సమగ్ర భూసర్వే మైలురాయిని దాటామని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. 416 గ్రామాల్లో ఈ సర్వే ప్రక్రియ పూర్తయ్యిందని వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న భూ సర్వే పురోగతిపై మంగళవారం హైదరాబాద్‌‌లోని సచివాలయంలో రెవెన్యూ ఉన్నతాధికారులతో మంత్రి సుదీర్ఘ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ తరతరాలుగా కొనసాగుతున్న భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడంతోపాటు ప్రతి భూ యజమానికి భూమిపై స్పష్టమైన హక్కులు, కచ్చితమైన సరిహద్దులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ప్రకటించారు.

ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర భూ సర్వేను అత్యంత పారదర్శకంగా, శాస్త్రీయంగా, పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఈ ప్రక్రియలో భూ యజమానుల ప్రయోజనాలు, వారి అభిప్రాయాలు, మనోభావాలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 10,954 రెవెన్యూ గ్రామాలుంటే, తొలి దశలో హైదరాబాద్ మినహా మిగిలిన 32 జిల్లాల్లో జిల్లాకు 70 గ్రామాల చొప్పున ఎంపిక చేసి, నక్షాలు అందుబాటులో లేని గ్రామాలను కూడా కలుపుకుని మొత్తం 2,720 గ్రామాల్లో రీసర్వే నిర్వహిస్తున్నామని వివరించారు.

సర్వే అనంతరం భూ యజమానులకు నోటీసులివ్వాలి

సర్వే పూర్తయిన అనంతరం సంబంధిత భూ యజమానులకు తప్పనిసరిగా నోటీసులు జారీ చేయాలని మంత్రి పొంగులేటి సూచించారు. సర్వేలో నమోదైన వివరాలను పరిశీలించుకునేందుకు, ఏవైనా అభ్యంతరాలు లేదా అభిప్రాయాలు ఉంటే తెలియజేసేందుకు వారికి తగిన అవకాశం కల్పించాలని కోరారు. భూ యజమానుల అభ్యంతరాలను స్వీకరించి, వాటిని క్షుణ్ణంగా పరిశీలించి, నిబంధనల ప్రకారం పరిష్కరించాలని చెప్పారు.

సర్వే ప్రక్రియ ఎలా జరుగుతుంది? సర్వే అనంతరం భూ యజమానులకు ఎలాంటి నోటీసులు జారీ చేస్తారు? అభ్యంతరాలను ఎలా నమోదు చేయాలి? వాటిని ఏ విధంగా పరిష్కరిస్తారు? అనే అంశాలపై గ్రామస్థాయిలో రైతులకు, భూ యజమానులకు విస్తృతంగా అవగాహన కల్పించాలని సూచించారు. సర్వే ప్రక్రియపై ఎలాంటి అపోహలు, అనుమానాలు లేకుండా పారదర్శకంగా వ్యవహరించాలని అన్నారు. భూ యజమానుల సంతృప్తే సర్వే విజయానికి ప్రామాణికమని చెప్పారు. చిన్న పొరపాటు కూడా భవిష్యత్తులో వివాదానికి కారణం కాకూడదని అన్నారు.

భూదార్ కేటాయింపు ప్రక్రియను వేగవంతం చేయాలి

రీసర్వే పూర్తయిన గ్రామాల్లో ప్రతి భూమికి ఆధార్ నెంబర్ తరహాలో ప్రత్యేక గుర్తింపునిచ్చే భూదార్ నెంబర్ కేటాయింపు కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని మంత్రి పొంగులేటి ఆదేశించారు. భూముల వివరాలు, హక్కులు, సరిహద్దులకు సంబంధించి స్పష్టమైన రికార్డులను అందుబాటులోకి తేవాలని సూచించారు. తరతరాల భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని ఆదేశించారు.

​సర్వేను వేగవంతం చేయాలి

125 ఏండ్ల తర్వాత రాష్ట్రంలో సమగ్ర భూ సర్వేకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని మంత్రి పొంగులేటి అన్నారు. ఈ చారిత్రాత్మక కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో అధికారులు అంకితభావంతో పనిచేయాలని సూచించారు. సర్వే ప్రక్రియను మరింత వేగవంతం చేయడంతోపాటు నాణ్యత, పారదర్శకత, కచ్చితత్వం విషయంలో ఎలాంటి రాజీ ఉండొద్దని సూచించారు. గ్రామాల్లో భూ సర్వే ప్రారంభించడానికి ముందుగా ఆ గ్రామానికి సంబంధించిన రెవెన్యూ రికార్డులను పూర్తిస్థాయిలో పరిశీలించాలని చెప్పారు. రికార్డుల్లో ఉన్న వివరాలు, భూముల విస్తీర్ణం, హక్కులు, సరిహద్దులను సమగ్రంగా పరిశీలించిన తర్వాతే వాటి ఆధారంగా క్షేత్రస్థాయిలో సర్వే ప్రక్రియను ప్రారంభించాలని కోరారు.

నేడు కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌

భూ రీసర్వే పురోగతి, క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలు, సర్వే నిర్వహణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, భూ యజమానులకు కల్పించాల్సిన అవకాశాలపై బుధవారం జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, ఆర్డీవోలు, సర్వే శాఖ అసిస్టెంట్ డైరెక్టర్లతో ప్రత్యేక వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాలని మంత్రి నిర్ణయించారు. ఈ సమావేశంలో జిల్లాల వారీగా పురోగతిని సమీక్షించి, అధికారులకు తదుపరి కార్యాచరణపై స్పష్టమైన ఆదేశాలు ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ శాఖ కార్యదర్శి డిఎస్ లోకేశ్‌ కుమార్, సర్వే అండ్ ల్యాండ్ సెటిల్‌మెంట్ కమిషనర్ రాజీవ్ గాంధీ హనుమంతు, జాయింట్ డైరెక్టర్ ప్రసన్నలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్