పది నెలల్లోనే ట్రిలియన్ డాలర్లు దాటిన మిగులు ...
పెరిగిన హై-టెక్ ఉత్పత్తుల అమ్మకాలు
ఆంక్షలు, పరిమితులతో అడ్డుకునేందుకు
ఈయూ దేశాల యత్నాలు
సముద్ర వాణిజ్యంపై దృష్టి సారించిన బీజింగ్
బీజింగ్ : చైనా వాణిజ్య మిగులు ఈ ఏడాది తొలి పది నెలల కాలంలో ఒక ట్రిలియన్ డాలర్లు దాటింది. కృత్రిమ మేధ (ఏఐ)కు సంబంధించిన మౌలిక సదుపాయాల నిర్మాణంలో ప్రపంచ దేశాల మధ్య నెలకొన్న పోటీ కారణంగా చైనా హై-టెక్ ఉత్పత్తుల అమ్మకాలు పెరిగాయి. అదే విధంగా బలహీనంగా ఉన్న దేశీయ డిమాండును బీజింగ్ అధిగమించింది. చైనా వాణిజ్య మిగులు గణనీయంగా పెరగడానికి ఈ పరిణామాలు దోహదపడ్డాయి. వచ్చే వారం షెన్జెన్లో ఆసియా-పసిఫిక్ ఆర్థిక సహకార సదస్సు జరుగు తుంది. ఈ సదస్సు సందర్భంగా చైనా, అమెరికా అధ్యక్షులు జిన్‌పింగ్, డొనాల్డ్ ట్రంప్ సమావేశమవుతారు. వీరిద్దరూ ఈ సంవత్సరం సమావేశం కావడం ఇది మూడోసారి. జిన్‌పింగ్, ట్రంప్ భేటీలో ఆర్థిక సంబంధాలను బలోపేతం చేసుకోవడం, సుంకాల విధానంపై చర్చ జరిగే అవకాశం ఉంది.
సాంకేతిక ఉత్పత్తులకు డిమాండ్
ఏఐ రంగంలో ప్రపంచవ్యాప్త పెట్టుబడుల జోరు కారణంగా వచ్చే ఏడాది వరకూ చైనా సాంకేతిక ఉత్పత్తులకు డిమాండ్ అధికంగా ఉంటుందని భావిస్తున్నారు. గత సంవత్సరం అక్టోబర్ నెలతో పోలిస్తే ఈ ఏడాది అదే నెలలో చైనా ఎగుమతులు 35.2 శాతం మేర పెరిగాయని కస్టమ్స్ డేటా చెబుతోంది. ఈ పెరుగుదల సెప్టెంబరులో 36.3 శాతంగా నమోదైంది. ఆర్థికవేత్తలు అంచనా వేసిన 33.5 శాతం వృద్ధితో పోలిస్తే అక్టోబరులో ఎగుమతులు ఎక్కువగానే జరిగాయి. ఎగుమతుల వృద్ధి కారణంగానే వాణిజ్య మిగులు 1.04 ట్రిలియన్ డాలర్లకు పెరిగింది. గత సంవత్సరం కూడా వాణిజ్య మిగులు ట్రిలియన్ డాలర్లకు చేరింది. అయితే ఈ ఏడాది రెండు నెలల ముందుగానే చైనా ఆ మైలురాయిని చేరుకోవడం విశేషం.
సముద్ర వాణిజ్యం ఆధునీకరణ దిశగా...
వచ్చే వారం ప్రపంచ నేతలు షెన్జెన్ నగరానికి వచ్చినప్పుడు వారికి ప్రపంచ వాణిజ్యంపై చైనాకు ఉన్న దార్శనికత కన్పిస్తుంది. ఆ నగరంలో అత్యాధునిక హార్డ్‌వేర్, సాఫ్ట్వేర్లతో కళకళలాడుతున్న ఓ హై-టెక్ ఓడరేవు వారిని ఆశ్చర్యచకితులను చేస్తుంది. డ్రైవర్ లేని ట్రక్కులు, రిమోట్ కంట్రోల్‌తో నడిచే క్రేన్లు, ఏఐ ఆధారిత వ్యవస్థలతో కూడిన మావాన్ టెర్మినల్...చైనాలో నడిచే అనేక ఆటోమేటెడ్ పోర్ట్ కార్యకలాపాలలో ఇది ఒకటి. ప్రపంచవ్యాప్తంగా జరిగే మొత్తం వస్తువుల వాణిజ్యంలో 80 శాతానికి పైగా చైనాలోనే జరుగుతుండడం విశేషం. ప్రపంచంలోని వివిధ ఓడరేవుల్లో బీజింగ్‌కు ఉన్న భారీ వాటాలపై పాశ్చాత్య దేశాలు ఇప్పటికే దృష్టి సారించాయి. షిప్పింగ్ టెక్నాలజీని ఎగుమతి చేయాలని చైనా చేస్తున్న ప్రయత్నాలు ఆ దేశానికి కొత్త బలాన్ని ఇవ్వవచ్చునని అవి భయపడుతున్నాయి. సముద్ర వాణిజ్యాన్ని ఆధునీకరించాలన్న తన లక్ష్యంలో మార్పేమీ లేదని చైనా స్పష్టం చేస్తోంది. డిజిటల్ పరివర్తనను ముందుగా ఎవరు పూర్తి చేస్తారో వారే ప్రపంచ ఓడరేవులు, నౌకా రవాణా రంగంలో పోటీలో పైచేయి సాధిస్తారని చైనా రవాణా మంత్రిత్వ శాఖ మే నెలలో తన వెబ్సైటులో ప్రచురించిన సంపాదకీయంలో వ్యాఖ్యానించింది.
ఆటోమేటెడ్ టెర్మినల్స్‌లో టాప్
ఇతర దేశాల కంటే చైనాలోనే అధిక సంఖ్యలో 60 స్వయంచాలక టెర్మినల్స్ ఉన్నాయని రవాణా మంత్రిత్వ శాఖ డేటా చెబుతోంది. తూర్పున ఉన్న క్వింగ్డావో నగరంలోని న్యూ కియాన్వాన్ కంటైనర్ టెర్మినల్ ప్రపంచంలోనే మొట్టమొదటి స్వయంచాలక టెర్మినల్. 2030 నాటికి 90 ఆటోమేటెడ్ టెర్మినల్స్‌ను ఏర్పాటు చేయాలని చైనా లక్ష్యంగా పెట్టుకుంది. ఈ సాంకేతికత కారణంగా ఇప్పటికే ప్రపంచ మార్కెట్లకు చైనా వస్తువుల ప్రవాహం వేగవంతమైంది. ప్రతి క్రేన్ గంటకు 61 కంటైనర్లను నిర్వహిస్తుంది. ఇది సంప్ర దాయ డాక్ల రేటుతో పోలిస్తే రెట్టింపు కంటే ఎక్కువ. దీనికి భిన్నంగా అమెరికా ఓడరేవుల్లో ఆటోమేషన్ ప్రక్రియ నత్తనడక నడుస్తోంది. ఉద్యోగాలు కోల్పోతామేమోనని కార్మికులు భయాందోళనలు వ్యక్తం చేసి ఆందోళనలు జరపడం దీనికి కారణం. చైనాలో ఆ సమస్యలేవీ లేవు.
ఈయూతో ఉద్రిక్తతలు తప్పవా ?
చైనా వాణిజ్య మిగులు పెరుగుతున్న నేపథ్యంలో యూరోపియన్ యూనియన్‌తో ఉద్రిక్తతలు తలెత్తే అవకాశం ఉన్నదని ఆర్థికవేత్తలు అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం యూరోపియన్ యూనియన్‌కు చైనా నుంచి హైబ్రిడ్ వాహనాల ఎగుమతులు జరుగుతున్నాయి. రాబోయే సంవత్సరాలలో వీటిని పరిమితం చేసేందుకు ఉద్దేశించి చైనాతో ఈయూ ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకుంది. అయితే ఈ చర్య ఇంకా అమలులోకి రాకపోవడంతో చైనా ఫ్యాక్టరీలు ఈయూకు హైబ్రిడ్ వాహనాల ఎగుమతులను కొనసాగిస్తాయని, తద్వారా సమీప భవిష్యత్తులో అవి పెరగవచ్చునని అంచనా. చైనా తయారీదారులు విదేశీ మార్కెట్లలో తమ ఉనికికి విస్తరించుకుంటున్నందున సుంకాలు, వాణిజ్య అవరోధాలు ఎదురయ్యే ప్రమాదం ఉన్నదని నిపుణులు హెచ్చరించారు.
ఎగుమతి దిగుమతులు ఇలా...
అమెరికాతో చైనా వాణిజ్య మిగులు సెప్టెంబరులో 34.01 బిలియన్ డాలర్లు ఉండగా అక్టోబరులో 32.71 బిలియన్ డాలర్లకు తగ్గింది. వాణిజ్య ఒప్పందాన్ని మరో రెండు నెలల పాటు పొడిగించాలని ఇరు దేశాలు తాజాగా నిర్ణయించాయి. గత ఏడాది అక్టోబరుతో పోలిస్తే ఈ సంవత్సరం అక్టోబరులో అమెరికా నుంచి దిగుమతులు 41.6 శాతం పెరిగాయి. అదే సమయంలో రేర్-ఎర్త్ ఎగుమతులు స్వల్పంగా పెరిగాయి. మధ్యప్రాచ్యంలో సరఫరా అంతరాయాలను కొనుగోలుదారులు సర్దుబాటు చేసుకోవడంతో ముడి చమురు దిగుమతులు మార్చి తర్వాత గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. అక్టోబరులో చైనా వాహన ఎగుమతులు స్థిరమైన వృద్ధిని కొనసాగించాయి. అయితే దేశీయంగా వాహన అమ్మకాలు వరుసగా 12వ నెలలోనూ క్షీణించాయి. మరోవైపు అమెరికా డాలర్ల విలువ పరంగా చూస్తే చైనా సెమీకండక్టర్ల ఎగుమతులు మొదటి పది నెలల కాలంలో 111.1 శాతం మేర పెరిగాయి. హై-టెక్ ఉత్పత్తుల మొత్తం రవాణా 47.9 శాతం పెరిగింది. రాబోయే కాలంలో ఏఐ సంబంధిత వాణిజ్యం బలంగా కొనసాగుతుందని నిపుణుల అంచనా.






కామెంట్లు (0)