వాషింగ్టన్ : తమ దాడుల కారణంగా అణ్వాయుధాల తయారీకి దారులు మూసుకుపోవడంతో ఇరాన్ ఇప్పుడు రసాయన, జీవాయుధాల తయారీపై దృష్టి సారించే అవకాశం ఉన్నదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. చైనాలోని షెన్జెన్లో పర్యటించిన ట్రంప్ ఫాక్స్ న్యూస్‌కు ఇంటర్వ్యూ ఇస్తూ అమెరికా, ఇజ్రాయిల్ దాడుల కారణంగా ఇరాన్ అణ్వాయుధ కార్యక్రమం దెబ్బ తిన్నదని తెలిపారు. అణ్వాయుధాల తయారీ కష్టం కావడంతో ఇరాన్ ఇప్పుడు గ్యాస్, జీవ ఆయుధాల తయారీ వైపు చూస్తోందని అన్నారు. వాషింగ్టన్ డీసీలో ‘డర్టీ బాంబ్’ లేదా రసాయన దాడికి ఇరాన్ ప్రణాళికలు రచిస్తోందంటూ అమెరికా నిఘా వర్గాలు చేసిన హెచ్చరికపై స్పందిస్తూ వాటికి భయపడాల్సిన అవసరం లేదని ప్రజలకు భరోసా ఇచ్చారు. అయితే ఇరాన్ కనుక అటువంటి దుస్సాహసానికి పాల్పడితే ఆ దేశాన్ని పూర్తిగా నామరూపాలు లేకుండా చేస్తామని హెచ్చరించారు. ఇనాన్ తదుపరి చర్యలపై తాము తొందరపడడం లేదని, జనవరి 1వ తేదీ తర్వాత పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకుంటామని ట్రంప్ తెలిపారు. ట్రంప్ ఆరోపణలను ఇరాన్ విదేశాంగ శాఖ, ఐరాసలో ఇరాన్ రాయబార కార్యాలయం ఖండించాయి. రసాయన ఆయుధాల వినియోగాన్ని తాము ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్ధించబోమని స్పష్టం చేశాయి. ప్రజల్లో భయాందోళనలు సృష్టించి సైనిక చర్యలను సమర్ధించుకోవడానికే అమెరికా ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తోందని తెలిపాయి.







కామెంట్లు (0)