Magazines

ఉక్రెయిన్‌పై రష్యా దాడులు...

3 గంటల క్రితం

attacks
avatar
balaji

ప్రచురించబడింది నవం 20, 2026 | 2 నిమిషాల చదవడం

400 డ్రోన్లు, 100 క్షిపణులతో విరుచుకుపడిన మాస్కో సేనలు

8 మంది మృతి... పలువురికి గాయాలు

దెబ్బతిన్న రాజధాని కీవ్ ... మూడు వంతెనలు ధ్వంసం

కీవ్ : అమెరికా, చైనా దేశాధినేతలతో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ త్రైపాక్షిక చర్చలు జరిపిన కొద్ది గంటల వ్యవధిలోనే శుక్రవారం తెల్లవారుజామున ఉక్రెయిన్‌పై మాస్కో సేనలు భీకర క్షిపణి, డ్రోన్ దాడులు జరిపాయి. ప్రపంచ శాంతికి కట్టుబడి ఉన్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా అధినేత జిన్‌పింగ్‌లతో కలిసి పుతిన్ ఉమ్మడి డిక్లరేషన్ విడుదల చేసిన తర్వాత దానికి తూట్లు పొడుస్తూ ఉక్రెయిన్‌పై రష్యా సేనలు విరుచుకుపడ్డాయి. త్రైపాక్షిక చర్చల అనంతరం ట్రంప్ ఐరోపా నాయకులతో మాట్లాడుతూ పుతిన్ అలసిపోయారని, యుద్ధానికి స్వస్తి చెప్పి శాంతికి సిద్ధంగా ఉన్నారని వ్యాఖ్యానించారు. అయితే రష్యా గతంలో ఎన్నడూ లేని విధంగా రాత్రికి రాత్రే కనీసం వంద క్షిపణులను ప్రయోగించిందని, ఇది అసాధారణమని ఉక్రెయిన్ ఆరోపించింది.

పోలాండ్ గగనతలాన్ని ఉల్లంఘించి...

ఎనిమిది గంటలకు పైగా కొనసాగిన భారీ దాడుల్లో ఎనిమిది మంది మరణించగా 28 మంది గాయపడ్డారని ఉక్రెయిన్ అధికారులు చెప్పారు. రష్యా సేనలు మొత్తంగా 400 డ్రోన్లను ప్రయోగించాయి. వీటిలో 120 జెట్ - పవర్డ్ డ్రోన్లు ఉన్నాయి. ఇవి ప్రాథమికంగా కాంపాక్ట్ క్రూయిజ్ క్షిపణులు. ఇదిలావుండగా దాడి సమయంలో రష్యా దళాలు పోలండ్ గగనతలాన్ని ఉల్లంఘించాయి. కొన్ని ‘వస్తువులు’ తన భూభాగంలో పడడంతో యుద్ధ విమానాలను రంగంలోకి దింపానని, పేట్రియాట్ గగనతల రక్షణ వ్యవస్థలను క్రియాశీలకం చేశానని పోలాండ్ ప్రభుత్వం తెలియజేసింది. గురువారం రాత్రి నుంచి కొనసాగిన రష్యా క్షిపణి దాడుల్లో రాజధాని కీవ్ బాగా దెబ్బతిన్నది. పేలుడు శబ్దాలు వినిపించాయి. ఆకాశంలో దట్టమైన పొగలు అలముకున్నాయి.


జనావాసాల పైనా దాడులు

భూమి, ఆకాశం, గాలి నుంచి అత్యంత కచ్చితత్వంతో కూడిన ఆయుధాలతో పాటు డ్రోన్లను ఉపయోగించి భారీ దాడులు చేశామని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఉక్రెయిన్ సైనిక, ఇంధన కేంద్రాలు, ఒడిశా ప్రాంతంలోని ఓడరేవు మౌలిక సదుపాయాలు, కీవ్‌లోని రవాణా సదుపాయాలను లక్ష్యంగా చేసుకున్నామని వివరించింది. అయితే ఖార్కివ్‌లోని ఓ ఆస్పత్రి, వివిధ ప్రాంతాల్లోని నివాస భవనాలపై కూడా రష్యా దళాలు దాడులు చేశాయని ఉక్రెయిన్ తెలిపింది. గురువారం రాత్రి జరిగిన దాడుల్లో మూడు వంతెనలు దెబ్బతిన్నాయి. దీంతో రాజధానిలో రెండు వైపులా ఉన్న ప్రాంతాలను కలిపే రవాణా మార్గాలకు అంతరాయం ఏర్పడింది. ఉష్ణోగ్రతలు సున్నా కంటే తక్కువకు పడిపోవడం మొదలైన తరుణంలో దాడుల కారణంగా ఉక్రెయిన్‌లోని పలు ప్రాంతాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్