Magazines

ప్రత్యామ్నాయ పంటలకు సిద్ధం చేయాలి

4 గంటల క్రితం

వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 10, 2026 | 1 నిమిషాల చదవడం

రాష్ట్రంలో సూపర్ ఎల్‌నినో ప్రభావంతో రానున్న రోజుల్లో సాగునీటి, తాగునీటి ఎద్దడి తీవ్రతరమయ్యే ప్రమాదం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి యాసంగి సీజన్‌లో రైతులు పంటల సాగును వాయిదా వేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మరోవైపు వరి, మొక్కజొన్న వంటి అధిక నీటి అవసరమయ్యే పంటలకు బదులుగా ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని ప్రభుత్వం సూచిస్తోంది. అయితే పరస్పర విరుద్ధ ప్రకటనలతో రైతుల్లో అయోమయం నెలకొంది. ఈ పరిస్థితుల్లో రైతులను ప్రత్యామ్నాయ పంటల సాగుకు గ్రామస్థాయిలోనే సన్నద్ధం చేయడం అత్యవసరం. ఖరీఫ్ సీజన్‌లో రాష్ట్రంలోని 315 మండలాల్లో కరువు పరిస్థితులు నెలకొన్నట్లు అధికారులు అంచనా వేశారు.

ఇప్పటికే వర్షాభావ పరిస్థితుల కారణంగా భూగర్భ జలాలు, చెరువులు, జలాశయాల్లో నీటి నిల్వలు తగ్గిపోయాయి. రబీ సీజన్‌లో కూడా సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు తక్కువగా ఉండటంతో నీటి లభ్యతను దృష్టిలో పెట్టుకుని పంటల ప్రణాళిక రూపొందించాలి. ప్రతి గ్రామంలో వ్యవసాయ, రెవెన్యూ అధికారులు రైతులతో సమావేశాలు నిర్వహించాలి. గ్రామ పరిధిలోని సాగునీటి వనరులు, భూగర్భ జలాల లభ్యత, భూముల స్వభావాన్ని పరిశీలించి ఏయే పంటలు సాగు చేయవచ్చో స్పష్టంగా తెలియజేయాలి. తక్కువ నీటితో పండే పప్పుధాన్యాలు, నూనెగింజలు, చిరుధాన్యాలు, ఇతర ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించాలి. అవసరమైన విత్తనాలు, సాంకేతిక సలహాలు, మార్కెటింగ్ సదుపాయాలు ప్రభుత్వం కల్పించాలి.

పంటలు సాగు చేయకుండా విరమించుకునే రైతులకు ముందుగానే ఆర్థిక పరిహారం ప్రకటించాలి. సాగు చేసి నీటి ఎద్దడితో పంటలు నష్టపోయిన రైతులకు కూడా ఎకరాకు తగిన పరిహారం అందిం చాలి. వ్యవసాయ కూలీల కుటుంబాలకు జీవనోపాధి సహాయం కల్పించాలి. కరువు పరిస్థితుల్లో రైతులను కేవలం ప్రకటనలతో వదిలేయకుండా, గ్రామస్థాయిలో కార్యాచరణ రూపొందించి ప్రత్యామ్నాయ పంటల సాగుకు ప్రభుత్వం పూర్తి సహకారం అందించాలి. ​

- బొంతు రాంబాబు

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్