Magazines

పట్టభద్రుడి ఓటు.. సమాజపు గొంతు

1 గంట క్రితం

వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 03, 2026 | 2 నిమిషాల చదవడం

ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటుకూ విలువ ఉంటుంది. అయితే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు మరింత ప్రత్యేకమైనది. ఇది కేవలం ఒక అభ్యర్థి రాజకీయ భవిష్యత్తును నిర్ణయించడం కాదు.. విద్యావంతుల ఆకాంక్షలు, నిరుద్యోగ యువత ఆశలు, విద్యారంగ సమస్యలు, సామాజిక న్యాయానికి ప్రాతినిధ్యం కల్పించే అవకాశం. అందుకే పట్టభద్రుల ఓటు వ్యక్తిగత పరిచయాలు, కుల, మత, ప్రాంతీయ సమీకరణాలకు, తాత్కాలిక ప్రయోజనాలకు అతీతంగా ఉండాలి. నేడు డిగ్రీలు, పీజీలు పూర్తిచేసిన లక్షలాది మంది యువత అర్హతకు తగిన ఉద్యోగాలు లేక నిరాశలో ఉన్నారు. ప్రభుత్వ శాఖల్లో ఖాళీల భర్తీ, నియామకాల్లో పారదర్శకత, ఉద్యోగ నోటిఫికేషన్ల సకాలంలో విడుదల వంటి అంశాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించే నాయకత్వం అవసరం. కేవలం ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చేవారు కాకుండా, నిరుద్యోగుల పక్షాన శాసన మండలిలో నిరంతరం గళమెత్తేవారిని ఎన్నుకోవాలి.

అదే విధంగా ప్రభుత్వ విద్యాసంస్థల్లో మౌలిక సదుపాయాలు, అధ్యాపకుల నియామకాలు, పరిశోధన వసతులు మెరుగుపడాలి. పేద విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌, హాస్టల్‌ సదుపాయాలు సకాలంలో అందాలి. విద్య వ్యాపార వస్తువుగా కాకుండా ప్రతి ఒక్కరికీ అందాల్సిన సామాజిక హక్కుగా ఉండాలి. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు విద్య, ఉద్యోగ, ఆర్థిక రంగాల్లో సమాన అవకాశాలు కల్పించాలి. కులవృత్తులు, స్వయం ఉపాధి, నైపుణ్య శిక్షణకు ప్రోత్సాహం అందాలి. గ్రామీణ విద్యార్థులకు గ్రంథాలయాలు, పోటీ పరీక్షల శిక్షణ కేంద్రాలు, డిజిటల్‌ సదుపాయాలు కల్పించాలి. మహిళలకు ఉన్నత విద్య, ఉపాధి, ఆర్థిక స్వావలంబనలో సమాన అవకాశాలు దక్కాలి. పట్టభద్రుల ఎమ్మెల్సీ పాత్ర కేవలం రాజకీయ పదవికి పరిమితం కాకూడదు.

విద్యార్థులు, అధ్యాపకులు, నిరుద్యోగులు, ఉద్యోగుల సమస్యలపై శాసనమండలిలో ప్రశ్నిస్తూ, ప్రభుత్వ విధానాల్లోని లోపాలను ఎత్తిచూపాలి. ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి. ఎన్నికల ముందు మాత్రమే కాకుండా, ఎన్నికల తర్వాత కూడా ప్రజల పక్షాన నిలవాలి. అభ్యర్థుల గత ప్రజాసేవ, సామాజిక బాధ్యత, సమస్యలపై అవగాహన, పోరాట నిబద్ధతను పరిశీలించి ఓటు వేయాలి. కులం, మతం, ప్రాంతం, వ్యక్తిగత పరిచయాలు, తాత్కాలిక ప్రలోభాలకు అతీతంగా సమాజ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకోవాలి. విద్య, ఉపాధి, సామాజిక న్యాయం, ప్రజాస్వామ్య హక్కుల కోసం పోరాడే నాయకత్వాన్ని ఎన్నుకోవాలి. ఎందుకంటే పట్టా వ్యక్తిగత అర్హతకు గుర్తింపు కావచ్చు.. కానీ పట్టభద్రుడి ఓటు సమాజ భవిష్యత్తుకు బాధ్యత కావాలి!

- కొడారి సత్యపాల్ యాదవ్, 8688139376

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్