Magazines

అమెరికా ఎన్నికలు- ప్రపంచానికి గుణపాఠాలు!

4 గంటల క్రితం

US Elections
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 10, 2026 | 6 నిమిషాల చదవడం

అమెరికా మధ్యంతర ఎన్నికల్లో ఎదురైన ఓటమి అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ నేత డోనాల్డ్ ట్రంప్‌కు తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌ను గుర్తుకు తెచ్చింది. తమ నేతను ఇంటికి పంపి తెలంగాణ ఓటర్లు తప్పు చేశారని, ఆ తప్పును సరిదిద్దుకొని తిరిగి భారీ మెజారిటీతో ముఖ్యమంత్రిని చేస్తారని బీఆర్‌ఎస్ నేతలు పదేపదే చెబుతున్నారు. ట్రంప్ కూడా ఇదే తరహాలో స్పందించారు. “తాజా ఎన్నికల ఫలితాలతో అమెరికా చరిత్రలో పెద్ద అడుగు వెనక్కి వేసింది. అయితే భయపడాల్సిన అవసరం లేదు. మనం తిరిగి వస్తాం. గతంలో ఎన్నడూ లేనంత బలంగా, పెద్దగా తిరిగి వస్తాం” అని తన సామాజిక మాధ్యమం ట్రూత్‌లో ప్రకటించారు. అమెరికా టెక్నాలజీ కంపెనీల వాటాల ధరలు పతనమై మూడు లక్షల కోట్ల డాలర్ల సంపద ఆవిరైన నేపథ్యంలో రిపబ్లికన్లు, కార్పొరేట్లను ఊరడించేందుకు ఈ ప్రకటన వెలువడింది. ​అమెరికాలో రిపబ్లికన్, డెమోక్రటిక్ పార్టీల ఆధిపత్యం 1837లో ప్రారంభమైంది. ఈనెల మూడున జరిగిన 120వ పార్లమెంటు ఎన్నికల్లో సెనెట్‌లో డెమోక్రాట్లకు 54, రిపబ్లికన్లకు 44 స్థానాలు వచ్చాయి.

మరో రెండు స్థానాల ఓట్ల లెక్కింపు పూర్తికావాల్సి ఉంది. 435 స్థానాల ప్రజాప్రతినిధుల సభలో డెమోక్రాట్లు 254, రిపబ్లికన్లు 165 స్థానాలు సాధించగా మరో 16 స్థానాల ఫలితాలు వెల్లడికావాల్సి ఉంది. యాభై మంది గవర్నర్లలో 28 మంది డెమోక్రాట్లు, 20 మంది రిపబ్లికన్లు ఎన్నికయ్యారు. 1837 నుంచి ఇప్పటివరకు ఉభయ సభల్లో 105 సార్లు డెమోక్రాట్లు మెజారిటీ సాధించారు. ప్రజాప్రతినిధుల సభలో 55 సార్లు, సెనెట్‌లో 50 సార్లు ఆధిక్యత పొందారు. డెమోక్రాట్లలో పురోగామి శక్తులున్నప్పటికీ పెట్టుబడిదారీ విధానానికి, సామ్రాజ్యవాద ప్రయోజనాలకు ముప్పు వాటిల్లనంతవరకే వారి పురోగామి తనం పరిమితం. తాజా ఎన్నికల్లో ఓటర్లు డెమోక్రాట్లను గెలిపించడం కంటే ట్రంప్‌ను ఓడించడానికే ప్రాధాన్యత ఇచ్చారన్నది వాస్తవం. ట్రంప్, నెతన్యాహులకు ఎదురైన ఓటమి నుంచి వారి మిత్రుడు నరేంద్ర మోడీ గుణపాఠాలు తీసుకుంటారో లేదో తెలియదు. అయితే ప్రపంచవ్యాప్తంగా ఈ ఎన్నికల ఫలితాలపై విస్తృతంగా చర్చ జరుగుతోంది.

రిపబ్లికన్ల కంచుకోటల్లోనూ వారి ఆధిపత్యానికి గండిపడింది. టెక్సాస్‌లో 1996 తరువాత తొలిసారిగా సెనెటర్, రాష్ట్ర అసెంబ్లీ, గవర్నర్, లెఫ్టినెంట్ గవర్నర్ పదవులను డెమోక్రాట్లు భారీ మెజారిటీలతో గెలుచుకున్నారు. గత అధ్యక్ష ఎన్నికల్లో తమ ఓటమికి లాటినోలు, ఆఫ్రికన్ అమెరికన్లే కారణమని డెమోక్రాట్లు విమర్శించారు. కానీ తాజా విజయాల్లో వారితోపాటు శ్వేతజాతి యువత కూడా కీలక పాత్ర పోషించింది. గత పదేండ్లుగా అమెరికాను మరోసారి గొప్ప దేశంగా మార్చాలంటూ సాగిన మాగా మితవాద, నిరంకుశ రాజకీయాలకు వ్యతిరేకంగా ఈ తీర్పు వెలువడిందని విశ్లేషకులు భావిస్తున్నారు. 1974 తరువాత ఇలాంటి మార్పు కనిపించలేదని పేర్కొంటున్నారు. మిసిసిపీ రాష్ట్రంలో 1881 తరువాత తొలిసారిగా ఒక నల్లజాతీయ కార్మిక నేత సెనెటర్‌గా ఎన్నికయ్యారు. గత అధ్యక్ష ఎన్నికల తరువాత 977 మంది బిలియనీర్ల సంపద 28 శాతం పెరిగింది. ​ట్రంప్ అనుకూల ఫాక్స్ మీడియా మాత్రం ఓటమికి ఆయన విధానాలు కారణం కాదని, రిపబ్లికన్ అభ్యర్థుల తీరే కారణమని విశ్లేషించింది.

ఇది తెలుగుదేశం కంచుకోటల్లో ఓటమి ఎదురైనప్పుడు చంద్రబాబు మద్దతుదారులుగా ఉన్న పత్రికలు, టీవీలు స్థానిక నాయకత్వాలపై చేసిన విమర్శలను గుర్తుకు తెస్తుంది. వాస్తవానికి ట్రంప్ విధానాల వల్ల ప్రజలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇరాన్‌పై దాడులు, పన్నులు, దిగుమతి విధానాలు వ్యవసాయ రంగాన్ని దెబ్బతీశాయి. రైతుల దివాలా 85 శాతం పెరిగింది. ఎరువులు, డీజిల్, వ్యవసాయ పనిముట్ల ధరలు 70 శాతం పెరిగాయి. అర్జెంటీనా నుంచి చౌకగా గొడ్డు మాంసం దిగుమతులను నాలుగు రెట్లు పెంచడంతో పశువుల పెంపకదారులు నష్టపోయి ఆగ్రహం వ్యక్తం చేశారు. ​డెమోక్రాట్లు గెలిచినంత మాత్రాన ప్రజలకు వెంటనే మేలు జరుగుతుందని భావించలేం. ప్రజలకు వాగ్దానాలు చేసి, అధికారంలోకి వచ్చిన తరువాత వాటిని విస్మరించడం ఆ పార్టీకి పరిపాటిగా మారింది. అధ్యక్షులు కార్పొరేట్లకు అనుకూలమైన బడ్జెట్ ప్రతిపాదనలను వీటో చేయడం, విమర్శలు రావడం తప్ప వ్యవస్థలో పెద్ద మార్పులు కనిపించడం లేదు.

పార్లమెంటులో ఎవరి ఆధిపత్యం ఉన్నప్పటికీ కార్మికవర్గ ఆందోళనలు తీవ్రంగా ఉన్నప్పుడే కొన్ని మంచి చట్టాలు అమల్లోకి వస్తున్నాయి. డెమోక్రాట్లు వరుసగా ఆధిపత్యం వహించినప్పటికీ ప్రజల జీవితాల్లో గణనీయమైన మార్పులు రాలేదు. ప్రజాస్వామ్యం అంటే పెట్టుబడి నియంతృత్వంగా మారిందన్నది పచ్చినిజం. దీనికి డెమోక్రటిక్ పార్టీ కూడా మినహాయింపు కాదు. ఈ ఎన్నికల్లో ఓటర్లను ప్రభావితం చేసేందుకు కనీసం 1,200 కోట్ల డాలర్లు ఖర్చు చేసినట్లు సమాచారం. ఈ ఎన్నికల్లో మరో ముఖ్యమైన పరిణామం సోషలిస్టు భావజాల ప్రభావం పెరగడం. సోషలిజం అనే పదాన్ని పలకడమే దేశద్రోహంగా చిత్రించిన అమెరికాలో ఇప్పుడు ఆ భావజాలానికి యువతలో ఆదరణ పెరుగుతోంది. కాటో సంస్థ 2025లో నిర్వహించిన సర్వే ప్రకారం 29 ఏళ్లలోపు యువతలో 62 శాతం మంది సోషలిజం పట్ల సానుకూలత వ్యక్తం చేశారు. మొత్తం జనాభాలో దాదాపు పది కోట్ల మంది సోషలిజం పట్ల సానుకూలంగా ఉన్నట్లు అంచనా.

కమ్యూనిస్టు వ్యతిరేక ప్రచారం, పాలస్తీనీయన్లకు మాతృదేశం ఉండాలని కోరేవారిని, యూదు దురహంకారాన్ని వ్యతిరేకించేవారిని కమ్యూనిస్టులుగా ముద్రవేసి భయపెట్టే ప్రయత్నాలు ఫలించలేదు. అమెరికా సమాజంలో దశాబ్దాలుగా ఏర్పడిన కమ్యూనిస్టు వ్యతిరేక భావజాలం క్రమంగా బలహీనపడుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ​న్యూయార్క్‌లో డెమోక్రటిక్ సోషలిస్టు జోహ్రాన్ మందానీ మేయర్‌గా ఎన్నికవడం ఈ మార్పుకు నిదర్శనం. ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహు వస్తే అరెస్టు చేస్తామని ప్రకటించిన ఆయనకు యూదు ఓటర్లలోనూ మద్దతు లభించింది. ఈజిప్టు ఇస్లామిక్ మత సంస్థతో సంబంధాలున్నాయని ప్రచారం చేసినప్పటికీ మిషిగన్‌లో అబ్దుల్ ఎల్ సయద్ సెనెటర్‌గా ఎన్నికై తొలి ముస్లిం సెనెటర్‌గా చరిత్ర సృష్టించారు. గాజా మారణకాండకు వ్యతిరేకంగా సాగిన ఉద్యమంలో ఆయన కీలక భాగస్వామిగా ఉన్నారు. ఎన్నికైన పార్లమెంటు, అసెంబ్లీల్లో 105 మంది పురోగామివాదులు, సోషలిస్టులు ఉన్నారని మీడియా పేర్కొంది. గతంలో ఇద్దరు డెమోక్రటిక్ సోషలిస్టులు ప్రజాప్రతినిధుల సభలో ఉండగా ఇప్పుడు మరో ఆరుగురు ఎన్నికయ్యారు. ముగ్గురు కొత్త సెనెటర్లు కూడా విజయం సాధించారు.

న్యూయార్క్‌తోపాటు వాషింగ్టన్ డీసీ, లాస్ ఏంజెలెస్ నగరాల్లోనూ సోషలిస్టు భావజాలం కలిగిన మేయర్లు ఎన్నికయ్యారు. లాస్ ఏంజెలెస్ మేయర్ నిత్యా రామన్ భారతీయ మూలాలున్న మహిళ. డెమోక్రటిక్ సోషలిస్టు పార్టీలో లక్షా 30 వేల మంది సభ్యులు, 43 రాష్ట్రాల్లో 130 స్థానిక కమిటీలు ఉన్నాయి. జాతీయ, రాష్ట్ర ఎన్నికల్లో 300 మంది అభ్యర్థులకు ప్రచారం చేయగా 105 మంది విజయం సాధించారు. అయితే డెమోక్రటిక్ పార్టీ నేతలు కూడా రిపబ్లికన్లకు భిన్నంగా లేరు. సోషలిస్టు చైనాను, అమెరికాను వ్యతిరేకించే రష్యాను చుట్టుముట్టాలన్న విధానాల్లో వారూ భాగస్వాములే. వాణిజ్య మార్గాలు, ఇంధన సరఫరాలపై ఆధిపత్యం, లాటిన్ అమెరికాను తమ పెరటి తోటగా మార్చుకోవడం, మధ్యప్రాచ్యం, ఆఫ్రికా సహజ సంపదలను కొల్లగొట్టడం వంటి కార్పొరేట్ ప్రయోజనాలకు వారు మద్దతు ఇస్తున్నారు. వియత్నాం దురాక్రమణ, కొరియా యుద్ధం, నాటోను రెచ్చగొట్టి ఉక్రెయిన్ సంక్షోభానికి దారితీసిన పరిణామాలు, గాజాలో ఇజ్రాయిల్ మారణకాండకు మద్దతు వంటి అంశాల్లో డెమోక్రాట్ల పాత్ర కూడా ఉంది.

అయినప్పటికీ పురోగామివాదులు, కమ్యూనిస్టులు ఎన్నికల్లో ఆ పార్టీకి మద్దతు ఇస్తున్నారు. ప్రత్యా మ్నాయ రాజకీయ శక్తి బలంగా ఎదగనందున పెద్ద చెడుతో పోలిస్తే చిన్న చెడు మెరుగనే కారణంతోనే వారు అలా చేస్తున్నారు. ​ట్రంప్ నేతృత్వంలోని రిపబ్లికన్లు, ఇజ్రాయిల్‌లో నెతన్యాహు లికుడ్ పార్టీ ఓటములు భారతదేశంలోని ఆరెస్సెస్, బీజేపీకి ఇబ్బందికరంగా మారాయి. ఆ పార్టీలు, నేతలు వారికి స్ఫూర్తిప్రదాతలు. ముస్లిం విద్వేషం వారిని కలిపే ప్రధాన అంశం. గాజాలో మారణకాండకు పాల్పడిన ఇజ్రాయిల్‌పై బీజేపీ, ఆరెస్సెస్ విమర్శలు చేయలేదు. ఇజ్రాయిల్ ఎన్నికల్లో అరబ్బులు ఓట్ల అక్రమాలకు పాల్పడ్డారంటూ నెతన్యాహు చేసిన ఆరోపణలను ఆరెస్సెస్ పత్రిక ఆర్గనైజర్ సమర్థించింది. గాజా భవిష్యత్తు, ఇరాన్‌తో యుద్ధ పరిస్థితి, ఇజ్రాయిల్‌తో అమెరికా సంబంధాలపై ఎక్కువగా దృష్టి పెట్టింది. ఇజ్రాయిల్‌లో అరబ్బుల జనాభా 22 శాతం మాత్రమే. తమను ద్వితీయ శ్రేణి పౌరులుగా చూస్తున్న యూదు దురహంకార పార్టీలకు బదులు తమకు ప్రాతినిధ్యం వహించే పార్టీలకు ఓటు వేయాలని అరబ్బు సంస్థలు పిలుపునిచ్చాయి. వారి ఓట్ల సమీకరణ కోసం యాప్ రూపొందించడాన్ని నెతన్యాహు అక్రమంగా చిత్రించారు.

అరబ్బులు ఐక్యంగా ఎన్నికల్లో పాల్గొని మొత్తం 120 స్థానాల్లో 19 సీట్లు సాధించారు. వారి మద్దతు లేకుండా ప్రభుత్వం ఏర్పాటు చేయలేని పరిస్థితి ఏర్పడింది. జాతీయ ప్రభుత్వం ఏర్పడినా అరబ్బులకు ప్రాతినిధ్యం కల్పించాల్సి వస్తుందన్నదే ఆర్గనైజర్ ఆందోళనకు కారణం. మెజారిటీ ఓటు చోరీ గురించి మాట్లాడేవారు మైనారిటీలు అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలను ఎలా సమర్థిస్తారన్న ప్రశ్న ఇక్కడ తలెత్తుతుంది. ​అమెరికా ఎన్నికల్లో జోక్యం చేసుకోవడం గురించి మాట్లాడే ఆర్గనైజర్‌కు, ‘అబ్‌కీ బార్ ట్రంప్‌కీ సర్కార్’ అంటూ మోడీ బహిరంగంగా ట్రంప్‌కు మద్దతుగా పిలుపునివ్వడం మాత్రం తప్పుగా కనిపించలేదు. భారతదేశంలో కార్పొరేట్ సంస్థలు వేల కోట్ల రూపాయలు బీజేపీకి విరాళాలివ్వడం, హిందువులందరూ ఓటు వేయాలని పిలుపునివ్వడం తప్పుకాకపోయినా, విదేశాల్లోని సానుభూతిపరులు ఇజ్రాయిల్ అరబ్బు పార్టీలకు నిధులివ్వడం మాత్రం అక్రమంగా కనిపించడం వారి ద్వంద్వ వైఖరిని వెల్లడిస్తుంది. గత అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌కు అమెరికన్ భారతీయుల మద్దతు 22 నుంచి 30 శాతానికి పెరిగింది.

తాజా ఎన్నికలకు ముందు నిర్వహించిన సర్వేలో అది 19 శాతానికి పడిపోతుందని వెల్లడించడం కాషాయ దళాలకు ఆందోళన కలిగించే అంశం. మరోవైపు అమెరికా ప్రభుత్వ పాఠశాలల్లో క్రైస్తవుల పది ఆజ్ఞలతోపాటు ఇతర దేవుళ్లను పూజించరాదనే సందేశాన్ని ప్రదర్శించాలని రిపబ్లికన్ పార్టీ ప్రతిపాదించింది. అమెరికాలో హిందువుల పిల్లలు కూడా ప్రభుత్వ పాఠశాలల్లోనే చదువుతున్నప్పటికీ, ఈ మతపరమైన విధానాలను ప్రతిపాదించిన పార్టీతో మోడీ స్నేహం కొనసాగించడం గమనార్హం. ఇటీవలి ప్రపంచ ఎన్నికలు ఒక ముఖ్యమైన పాఠాన్ని నేర్పుతున్నాయి. మితవాద, నిరంకుశ, ఫాసిస్టు శక్తులను ఓడించాలంటే వాటిని వ్యతిరేకించే శక్తులన్నీ ఐక్యంగా నిలవాలి. ప్రజల ఆర్థిక సమస్యలు, కార్మికవర్గ పోరాటాలు, సామాజిక న్యాయం, మైనారిటీల హక్కులు ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేస్తున్నాయి. అధికారంలోకి వచ్చే పార్టీలు ప్రజలకు మేలు చేస్తాయా లేదా అన్నది వాటి విధానాలు, ప్రజా ఉద్యమాల బలంపై ఆధారపడి ఉంటుంది. అమెరికా ఎన్నికల పూర్తి ఫలితాలు వెలువడిన తరువాత వాటి ప్రభావాన్ని మరోసారి సమీక్షించుకోవాల్సి ఉంటుంది.


ఎం కోటేశ్వరరావు 8331013288

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్