Magazines

ఇరాన్‌ యుద్ధంతో ఇంధన ధరలకు రెక్కలు

3 గంటల క్రితం

Fuel prices soar
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 14, 2026 | 1 నిమిషాల చదవడం

ప్రపంచ ద్రవ్యోల్బణం 4.7 శాతానికి! ప్రపంచ వృద్ధిపై ఐఎంఎఫ్‌ హెచ్చరిక

బ్యాంకాక్‌: ఇరాన్‌పై అమెరికా యుద్ధం, అంతర్జాతీయంగా పెరుగుతున్న ఇంధన ధరల ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం మరింత పెరిగే ప్రమాదం ఉందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్‌) హెచ్చరించింది. 2026లో ప్రపంచ ద్రవ్యోల్బణం 4.7 శాతానికి చేరవచ్చని అంచనా వేసింది. యుద్ధానికి ముందు స్థాయిలతో పోలిస్తే శుద్ధి చేసిన పెట్రోలియం ఉత్పత్తుల ధరలు 70–95 శాతం అధికంగా ఉండటం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి పెంచుతోందని తన తాజా ప్రపంచ ఆర్థిక దృక్పథ నివేదికలో పేర్కొంది. ముఖ్యంగా ఇంధన దిగుమతులపై ఆధారపడే దేశాలు అధిక ధరల భారాన్ని ఎదుర్కొంటున్నాయని తెలిపింది. ఇంధన ధరల పెరుగుదలతో పాటు ఎఐ రంగంలో పెట్టుబడుల ప్రభావం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అసమానతలను పెంచుతోందని ఐఎంఎఫ్‌ పేర్కొంది. ఎఐ పెట్టుబడుల నుంచి ప్రయోజనం పొందుతున్న అభివృద్ధి చెందిన దేశాల ఆర్థిక వ్యవస్థలు కొంత నిలకడగా ఉన్నప్పటికీ.. తక్కువ ఆదాయ దేశాలు ఇంధన సరఫరా అంతరాయాలు, పెరుగుతున్న ఖర్చులతో తీవ్ర ఒత్తిడికి గురవుతున్నాయని తెలిపింది. 2026లో ప్రపంచ ఆర్థిక వృద్ధి అంచనాను 0.1 శాతం పాయింట్లు పెంచి 3.1 శాతానికి చేర్చినప్పటికీ.. 2025లో నమోదైన 3.5 శాతంతో పోలిస్తే వృద్ధి మందగించనుందని తెలిపింది. మధ్యప్రాచ్యంలో యుద్ధం దీర్ఘకాలం కొనసాగితే ద్రవ్యోల్బణం మరింత పెరిగి, ప్రపంచ ఆర్థిక వృద్ధి దెబ్బతినవచ్చని ఐఎంఎఫ్‌ ప్రధాన ఆర్థికవేత్త సిల్వానా టెన్రెరో హెచ్చరించారు. ఇరాన్‌ యుద్ధ ప్రభావంతో మధ్యప్రాచ్యం, మధ్య ఆసియా ప్రాంత ఆర్థిక వ్యవస్థ 2026లో 0.3 శాతం క్షీణించవచ్చని అంచనా వేసింది. సౌదీ అరేబియా ఆర్థిక వ్యవస్థ 3.3 శాతం సంకోచించవచ్చని పేర్కొంది. ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచేందుకు కేంద్ర బ్యాంకులు ధరల స్థిరత్వానికి ప్రాధాన్యం ఇవ్వాలని ఐఎంఎఫ్‌ సూచించింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్