యుద్ధానికి ముగింపు పలకాలంటే రష్యా - ఉక్రెయిన్ కలిసి రావాలి : ట్రంప్
జెలెన్స్కీ కంటే ఆయనకే ఒప్పందంపై ఆసక్తి ఎక్కువ
వాషింగ్టన్ : రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికేందుకు ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోడిమిర్ జెలెన్స్కీ కంటే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అన్నారు. ఇరు దేశాల మధ్య ప్రతిపాదించిన ఇంధన కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘనకు గురైందని ఉక్రెయిన్ ఆరోపించిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రష్యా కాల్పుల విరమణను ఉల్లంఘించిందా? లేదా? అనే అంశంపై వచ్చిన నివేదికలను పరిశీలిస్తామని తెలిపారు. ఇరు దేశాలూ యుద్ధంలో భారీ ప్రాణనష్టాన్ని చవిచూస్తున్నాయని, ఈ సంఘర్షణకు ముగింపు పలకడానికి రెండు దేశాల నాయకులు కలిసి రావాలని పునరుద్ఘాటించారు.
మధ్యంతర ఎన్నికల ప్రచార ర్యాలీలో పాల్గొనేందుకు ఒహాయోకు బయలుదేరే ముందు మీడియాతో మాట్లాడిన ట్రంప్, ఈ యుద్ధంలో ఈ నెలలోనే 32 వేల మంది ప్రాణాలు కోల్పోయారని పేర్కొన్నారు. వారిలో ఎక్కువ మంది సైనికులు, యువకులేనని చెప్పారు. ఇంతటి ప్రాణనష్టం జరుగుతున్న నేపథ్యంలో యుద్ధాన్ని ముగించాల్సిన అవసరం ఉందన్నారు. "నాకు దాని గురించి కచ్చితంగా తెలియదు. మేము పరిశీలిస్తాం. కానీ జెలెన్స్కీ, పుతిన్ ఇద్దరూ కలిసి ఈ అసంబద్ధమైన యుద్ధాన్ని ముగించాలి" అని ట్రంప్ వ్యాఖ్యానించారు. కాల్పుల విరమణ ఉన్నప్పటికీ రష్యా దాడులు చేసిందన్న వార్తలపై స్పందిస్తూ ఇరు పక్షాల నుంచి ఉల్లంఘనలు జరిగాయని అన్నారు.
రష్యా, ఉక్రెయిన్ రెండూ కాల్పుల విరమణ ఒప్పందాన్ని అధికారికంగా ధ్రువీకరించలేదని ఓ విలేకరి ప్రస్తావించగా, తాను అంగీకరించాలని చెప్పినందునే ఇరు దేశాలు అంగీకరించాయని ట్రంప్ పేర్కొన్నారు. అయితే, ఒప్పందం అమలు విషయంలో పరిస్థితి ఇంకా స్పష్టతకు రావాల్సి ఉందని ఆయన వ్యాఖ్యల ద్వారా తెలుస్తోంది. ఇంధన కాల్పుల విరమణ ప్రతిపాదనకు పుతిన్, జెలెన్స్కీ ఇద్దరూ మద్దతు ఇస్తున్నారని తాను భావిస్తున్నట్లు ట్రంప్ చెప్పారు. ఇద్దరూ ఒప్పందం కుదుర్చుకోవాలని కోరుకుంటున్నారని అభిప్రాయపడ్డారు. యుద్ధాన్ని ముగించడంపై దృష్టి పెట్టాలని జెలెన్స్కీకి సూచించారు.
కీవ్‌లో నివాస భవనంపై డ్రోన్ దాడి
మరోవైపు, ఉక్రెయిన్ ఇంధన మౌలిక సదుపాయాలపై రష్యా దాడులు కొనసాగిస్తోందని జెలెన్స్కీ ఆరోపించారు. సోమవారం ఎక్స్‌లో చేసిన పోస్టులో కీవ్‌లోని బహుళ అంతస్తుల అపార్ట్మెంట్ భవనంపై రష్యా షాహెద్ డ్రోన్‌తో దాడి చేసిందని తెలిపారు. ఈ ఘటనలో ఇద్దరు మరణించగా, మరో తొమ్మిది మంది గాయపడ్డారని పేర్కొన్నారు. మంటలను ఆర్పేందుకు సహాయక బృందాలు చర్యలు చేపట్టాయని, మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. రష్యా నివాస భవనాలపై దాడులు చేస్తూ ప్రజల ప్రాణాలను తీస్తోందని జెలెన్స్కీ విమర్శించారు. యుద్ధాన్ని పొడిగిస్తున్నది రష్యానేనని ఆరోపించారు. ఇలాంటి దాడులు కొనసాగుతున్న నేపథ్యంలో మాస్కోపై మరింత ఒత్తిడి తీసుకురావాలని, రష్యా చర్యలకు అమెరికా గట్టిగా స్పందించాలని కోరారు.
ఇంధన కాల్పుల విరమణపై ట్రంప్ ప్రకటనకు ప్రతిస్పందనగా, ముందు రోజు రాత్రి ఉక్రెయిన్ రష్యాలోని ఇంధన సౌకర్యాలపై దాడి చేయలేదని జెలెన్స్కీ మరో పోస్టులో పేర్కొన్నారు. అదే సమయంలో ఉక్రెయిన్‌లోని గ్యాస్ కేంద్రాలు, ఇంధన మౌలిక సదుపాయాలు, ఇతర సౌకర్యాలపై రష్యా దాడులు చేసిందని ఆరోపించారు. ట్రంప్ ప్రతిపాదనపై పుతిన్ నుంచి వచ్చిన సందేశం స్పష్టంగా లేదని, ఇంధన కాల్పుల విరమణపై రష్యా వైఖరిలో స్పష్టత కనిపించడం లేదని ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. ఇంధన కాల్పుల విరమణకు కట్టుబడి ఉండేందుకు ఉక్రెయిన్ సిద్ధంగా ఉందని, రష్యా కూడా అదే విధంగా వ్యవహరించాలని కోరారు.
రష్యాపై ఈయూ కొత్త ఆంక్షలు
ఇదిలా ఉండగా, ఉక్రెయిన్ ఆక్రమిత ప్రాంతాల్లో ఎన్నికలతో సంబంధం ఉన్న వ్యక్తులు, రష్యా సైనిక-పారిశ్రామిక వ్యవస్థకు సంబంధించిన సంస్థలను లక్ష్యంగా చేసుకుని యూరోపియన్ యూనియన్ కొత్త ఆంక్షల ప్యాకేజీని ప్రకటించింది. యూరోపియన్ కౌన్సిల్ ప్రకటన ప్రకారం, ఈ చర్యల్లో భాగంగా 1,569 మంది వ్యక్తులు, సంస్థలపై ఆంక్షలు విధించారు. వీరిలో 826 రష్యన్ కంపెనీలు, వాటికి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లుగా పనిచేస్తున్న 743 మంది వ్యక్తులు ఉన్నారు. తాజా ప్యాకేజీతో ఉక్రెయిన్ ప్రాదేశిక సమగ్రతకు మద్దతుగా ఈయూ విధించిన ఆంక్షల పరిధిలోకి వచ్చిన వారి మొత్తం సంఖ్య సుమారు 4,600కు చేరింది. యుద్ధాన్ని ముగించేందుకు మాస్కోపై ఆర్థిక ఒత్తిడిని కొనసాగించడం అవసరమని ఈయూ విదేశాంగ విధాన అధిపతి కాయా కల్లాస్ అన్నారు.
రష్యా డీజిల్ సరఫరాలపై ట్రంప్ సమర్థన
రష్యా డీజిల్ సరఫరాలను అనుమతించాలన్న తన నిర్ణయంపై సొంత పార్టీ రిపబ్లికన్ల నుంచి విమర్శలు వస్తున్నప్పటికీ ట్రంప్ వెనక్కి తగ్గలేదు. రష్యా చమురు సరఫరాలపై పరిమితులు విధిస్తే ప్రపంచవ్యాప్తంగా ఇంధన మార్కెట్లపై ప్రభావం పడుతుందని ఆయన వాదించారు. అమెరికా చమురు ఉత్పత్తి చేస్తున్నప్పటికీ, సరఫరాలను అడ్డుకోవడం వల్ల ఇతర దేశాలు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందన్నారు. అమెరికా డీజిల్ సరఫరాలను పరిమితం చేసి దేశీయ అవసరాలకు కేటాయించవచ్చని, అయితే అటువంటి చర్య ప్రపంచంలోని ఇతర ప్రాంతాలపై గణనీయమైన ప్రభావం చూపుతుందని ట్రంప్ పేర్కొన్నారు. రైతులకు, పశువుల పెంపక రంగానికి సహాయపడే చర్యలకు తాను మద్దతిస్తానని అన్నారు. ఈ అంశంపై వాదోపవాదాలు చేయడం కంటే యుద్ధాన్ని ముగించేందుకు ఒప్పందం కుదుర్చుకోవడంపై జెలెన్స్కీ దృష్టి పెట్టాలని సూచించారు.







కామెంట్లు (0)