Magazines

విద్యుత్ అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి

1 గంట క్రితం

development work
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 29, 2026 | 1 నిమిషాల చదవడం

- అశ్వారావుపేటలో నూతన సబ్‌స్టేషన్లు, కార్యాలయ భవనాల నిర్మాణంపై సీఎండీ క్షేత్రస్థాయి పరిశీలన

నవతెలంగాణ - అశ్వారావుపేట

విద్యుత్ మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులను వేగవంతం చేసి, నాణ్యమైన, నిరంతరాయ విద్యుత్ సరఫరా అందించేలా చర్యలు తీసుకోవాలని టీజీఎన్‌పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం అశ్వారావుపేట ప్రాంతంలో పర్యటించిన ఆయన వివిధ సబ్‌స్టేషన్లను పరిశీలించి, కొనసాగుతున్న అభివృద్ధి పనుల పురోగతిని సమీక్షించారు.

నూతన సబ్‌స్టేషన్లపై ప్రత్యేక దృష్టి

అశ్వారావుపేట-2 పరిధిలోని నందమూరి కాలనీలో నిర్మిస్తున్న 220/132 కేవీ, 33/11 కేవీ నూతన సబ్‌స్టేషన్ పనులను సీఎండీ పరిశీలించారు. నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. అశ్వారావుపేట 220/132 కేవీ సబ్‌స్టేషన్‌లో విద్యుత్ సరఫరా వ్యవస్థ బలోపేతానికి చేపట్టిన పనులతోపాటు, 33/11 కేవీ నారాయణపురం సబ్‌స్టేషన్ పనితీరును పరిశీలించారు.

డివిజన్ కార్యాలయ నిర్మాణానికి చర్యలు

అశ్వారావుపేటలో సుమారు 17 గుంటల విస్తీర్ణంలో ప్రతిపాదించిన నూతన డివిజన్ కార్యాలయ భవన స్థలాన్ని సందర్శించారు. టెండర్ ప్రక్రియను త్వరగా పూర్తి చేసి నిర్మాణ పనులు ప్రారంభించాలని అధికారులకు సూచించారు. ఆసుపాక 400/220 కేవీ సబ్‌స్టేషన్ నుంచి 33 కేవీ విద్యుత్ సరఫరాకు సంబంధించిన పనులపైనా సమీక్ష నిర్వహించారు.

ఎమ్మెల్యేతో అభివృద్ధి పనులపై చర్చ

పర్యటనలో భాగంగా ఎమ్మెల్యే జారె ఆదినారాయణతో సీఎండీ సమావేశమయ్యారు. అశ్వారావుపేట ప్రాంతంలో విద్యుత్ మౌలిక సదుపాయాల విస్తరణ, నూతన సబ్‌స్టేషన్ల ఏర్పాటు, కార్యాలయ భవన నిర్మాణం, సరఫరా వ్యవస్థ మెరుగుదలపై చర్చించారు. విద్యుత్ డిమాండ్‌కు అనుగుణంగా మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయాలని, పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.


ఈ పర్యటనలో జిల్లా ఎస్ఈ (ఆపరేషన్స్) జి. మహేందర్, డీఈ (మార్కెటింగ్/కన్‌స్ట్రక్షన్స్) బి. వెంకటేశ్వర్లు, పాల్వంచ డీఈ (ఆపరేషన్స్) జె. భద్రుపవర్, అశ్వారావుపేట సబ్‌డివిజన్ ఏడీఈ బి. వెంకటరత్నం, ఏఈ ఎం. శివశంకర్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్