Magazines

మనల్ని మనం నమ్మాలి

1 రోజు క్రితం

We must believe in ourselves.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 09, 2026 | 4 నిమిషాల చదవడం

శరణ్య పెరియసామి... ఎనిమిదేండ్ల కిందట అగ్నికుల్‌ ‌కాస్మోస్‌‌లో నాల్గవ తరగతి ఉద్యోగిగా చేరారు. నేడు ఆమె ఆ కంపెనీకి ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, వెహికల్ డైరెక్టర్‌గా ఎదిగారు. అంతేకాదు అగ్నిబాన్ ఆర్బిటల్ లాంచ్ వెహికల్ అభివృద్ధికి నాయకత్వం వహిస్తున్నారు. రాకెట్ల నిర్మాణంలో మూస ధోరణులను బద్దలుకొడుతున్నారు. ‘మహిళలు ఎదుర్కొనే అతిపెద్ద అడ్డంకులలో ఒకటి తమపై తమకు నమ్మకం లేకపోవడే. కొన్నిసార్లు మనల్ని మనం ప్రశ్నించుకోవడం మొదలుపెట్టి, ఇది కష్టమని అనుకోవడమే సమస్య అని నేను భావిస్తున్నాను. ఆ ఆలోచన ఇక పోవాలి. మనం మహిళలం, ఏదైనా సాధ్యమేనని భావించి ప్రయత్నిస్తే, అది అంత కష్టం కాదు. మనం ఇతరులకు చెప్పాల్సింది అదే. ఒక్కసారి ప్రయత్నించండి’ అంటున్న ఆమె విజయ ప్రస్థానం నేటి మానవిలో...



శ్రీనాథ్ రవిచంద్రన్, మోయిన్ ఎస్‌పిఎం స్థాపించిన ఐఐటి-మద్రాస్ ఇంక్యుబేటెడ్ ఈ స్టార్టప్, స్పేస్-టెక్ పరిశ్రమలో గణనీయమైన పురోగతిని సాధించింది. మే 2024లో, అగ్నికుల్ కాస్మోస్ ఏడు అగ్నిలెట్ ఇంజిన్‌లతో నడిచే తన లాంచ్ వెహికల్, అగ్నిబాన్ SOrTeD (సబ్ ఆర్బిటల్ టెక్నలాజికల్ డెమాన్‌స్ట్రేటర్) విజయవంతమైన సబ్-ఆర్బిటల్ టెస్ట్ ఫ్లైట్‌తో చరిత్ర సృష్టించింది. ఆ కంపెనీలో వెహికల్ డైరెక్టర్‌గా పనిచేసిన శరణ్య ఈ విజయంలో ప్రముఖ పాత్ర పోషించారు. దీంతో భారతదేశంలో రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించిన రెండవ ప్రైవేట్ స్పేస్ టెక్ కంపెనీగా అగ్నికుల్ నిలిచింది. ప్రస్తుతం శరణ్య కంపెనీ ఆర్బిటల్ లాంచ్ వెహికలైన ‘అగ్నిబాన్’కు ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, వెహికల్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. దీన్ని వచ్చే ఏడాది ప్రయోగించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే అంతరిక్ష రంగంలో ఆమె ప్రయాణం అంత సులువుగా సాగలేదు. సివిల్ ఇంజనీరింగ్ నుండి ఓషన్ టెక్నాలజీకి మారిన తర్వాత, ఆమె ఐఐటి-మద్రాస్‌లో జరిగిన క్యాంపస్ ప్లేస్‌మెంట్ టాక్‌కు హాజరయ్యారు.

ఒకసారి ప్రయత్నిద్దామని

‘అప్పటికి వరకు నాకు అంతరిక్ష రంగంలో ఎలాంటి నేపథ్యం లేదు. అగ్నికుల్ కాస్మోస్ ప్లేస్‌మెంట్ల కోసం వచ్చినప్పుడు, వారు భారతదేశంలో ఒక స్టార్టప్‌గా కొత్తదనాన్ని నిర్మిస్తున్నారు. నాకు ఆసక్తి కలిగింది. నాకు అవకాశం రాదని కచ్చితంగా అనుకున్నాను. కానీ ఒకసారి ప్రయత్నించి చూద్దాం అనుకున్నాను. ఎలాగోలా అవకాశం వచ్చింది’ అని ఆమె గుర్తుచేసుకున్నారు. శరణ్య పోర్ట్ బ్లెయిర్‌లో పెరిగారు. సివిల్ ఇంజనీరింగ్‌లో బీటెక్ పూర్తి చేసిన తర్వాత ఓషన్ టెక్నాలజీలో మాస్టర్స్ చేయడానికి ఐఐటి మద్రాస్‌కు వెళ్లారు. అగ్నికుల్ కాస్మోస్ ఇంకా కొద్దిమంది ఉద్యోగులతో ఒక చిన్న ప్రయోగశాలగా ఉన్నప్పుడు ఆమె అక్కడ సిస్టమ్స్ ఇంజనీర్‌గా చేరారు. ‘శ్రీనాథ్ ఈ కంపెనీని ప్రారంభించాలనే ఆలోచనతో అమెరికా నుండి తిరిగి వచ్చినప్పుడు, ఇస్రో తప్ప భారత అంతరిక్ష పరిశ్రమలో పెద్దగా ఏమీ జరగడం లేదు. ప్రైవేట్ కంపెనీలు ఇస్రోతో కలిసి పనిచేయడానికి, ప్రయోగాలు చేయడానికి సహాయపడే ‘ఇన్-స్పేస్’ అనే సంస్థ కూడా, అగ్నికుల్ ఇంక్యుబేషన్ తర్వాతే ఏర్పడింది’ అని ఆమె అన్నారు.

​మా లక్ష్యం స్పష్టంగా ఉంది

‘మరుసటి ఏడాది ప్రైవేట్ పరిశ్రమను, ఇస్రోను అనుసంధానించడానికి అంతరిక్ష శాఖ ఒక కమ్యూనిటీని ఏర్పాటు చేస్తుందని ప్రభుత్వం ప్రకటించడంతో, అగ్నికుల్‌కు మాకు మద్దతు లభించింది. నెమ్మదిగా మేము కూడా అప్పటికే ఉన్నవాటిని కాకుండా, కొత్తవాటిని నిర్మించాలనుకున్నాం. 3D ప్రింటింగ్, భారతదేశంలో సెమీ-క్రయోజెనిక్ టెక్నాలజీ, చివరికి మా సొంత లాంచ్‌ప్యాడ్ కూడా. మొదటి నుంచీ మా లక్ష్యం చాలా స్పష్టంగా ఉంది. మరింత సుస్థిరమైన కొత్తదాన్ని సృష్టించడం’ అని ఆమె తెలిపారు. శరణ్య త్వరలోనే స్ట్రక్చరల్ ఇంజనీరింగ్‌లోకి మారి చివరికి నాయకత్వ పాత్రను చేపట్టారు. ఆ తర్వాత అగ్నికుల్ సబ్-ఆర్బిటల్ మిషనైన ‘అగ్నిబాన్ సార్టెడ్’కు వెహికల్ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టి, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా పదోన్నతి పొందారు.

​మైలురాళ్ళు.. విజయాలు

​అగ్నికుల్ తన కక్ష్య ప్రయోగ వాహనం కోసం అభివృద్ధి చేస్తున్న వివిధ స్వదేశీ సాంకేతికతలను పరీక్షించడానికి, అగ్నిబాన్ సార్టెడ్‌ను ఒక సాంకేతిక ప్రదర్శనగా రూపొందించారు. ఈ మిషన్ సెమీ-క్రయోజెనిక్ ప్రొపల్షన్, 3D-ప్రింటెడ్ భాగాలు, ఏవియానిక్స్ వ్యవస్థలు, అంతర్గత నియంత్రణ వ్యవస్థతో సహా అనేక ఆవిష్కరణలను ఒకచోట చేర్చింది. ‘అసలైన అగ్నిబాన్ కక్ష్య వాహనంలో ఉండే ప్రతి వ్యవస్థను మేము ప్రదర్శించాలనుకున్నాము. ఈ సాంకేతికతలను విజయవంతంగా ప్రదర్శించడం మాకు కక్ష్య వాహనాన్ని నిర్మించడానికి ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది’ అని ఆమె అన్నారు. అగ్నిబాన్ సార్టెడ్ విజయవంతమైన ప్రయోగానికి దారితీసిన మార్గంలో అనేక సవాళ్లు ఉన్నాయి. బృందం చాలా తక్కువ సమయంలో పని చేయాల్సి వచ్చింది. అనుమతులు, పరీక్షలు, ప్రయోగ సన్నాహాల కోసం ఇతరులతో సమన్వయం అవసరమైంది. అగ్నికుల్ ఇస్రోతో కలిసి పనిచేయడం ఇదే మొదటిసారి. భారతదేశం ఇటువంటి ప్రయోగాన్ని మొదటిసారిగా చేపడుతున్నందున ఈ మిషన్‌లో నిరంతరం మారుతున్న విధానాలకు అనుగుణంగా వ్యవహరించాల్సి వుంటుంది.

​ఏకతాటిపైకి తీసుకొచ్చాము

‘అప్పటి వరకు మేము మా పరీక్షలను మా సొంత సిబ్బందితోనే అంతర్గతంగా నిర్వహించేవాళ్ళం. ఈ మిషన్ కోసం అనుమతుల కొరకు మేము అనేక ఇస్రో బృందాలతో సంప్రదించాల్సి వచ్చింది. ప్రయోగం కోసం పలు బృందాలను ఏకతాటిపైకి తీసుకొచ్చాము. భారతదేశంలో ఇలాంటిది జరగడం కూడా ఇదే మొదటిసారి. కాబట్టి విధానపరంగా ముందుకు సాగుతున్న కొద్దీ కొన్ని విషయాలను అర్థం చేసుకున్నాం. అనేక రంగాలలో సవాళ్లను ఎదుర్కొన్నాము. కానీ చివరికి విజయం సాధించాము’ అని శరణ్య గుర్తుచేసుకున్నారు. ప్రస్తుతం ఈ బృందం శరణ్య సారథ్యంలో వచ్చే ఏడాది ప్రయోగించనున్న తమ అగ్నిబాన్ కక్ష్య మిషన్‌ను రూపొందిస్తోంది.

మహిళలను ప్రాధాన్యం

​అగ్నికుల్ బృందంతో సహా, స్పేస్‌టెక్ రంగంలోకి మహిళలు పెద్ద సంఖ్యలో చేరుతుండటం శరణ్యకు ప్రోత్సాహాన్నిచ్చింది. మహిళలు ఎదుర్కొనే అతిపెద్ద అడ్డంకులలో ఒకటి సామర్థ్యం లేదా అవకాశాల కొరత కాదని తమపై తమకు నమ్మకం లేకపోవడే అంటారు ఆమె. ‘కొన్నిసార్లు మనల్ని మనం ప్రశ్నించుకోవడం మొదలుపెట్టి, ఇది కష్టమని అనుకోవడమే సమస్య అని నేను భావిస్తున్నాను. ఆ ఆలోచన ఇక పోవాలి. మనం మహిళలం, ఏదైనా సాధ్యమేనని భావించి ప్రయత్నిస్తే, అది అంత కష్టం కాదు. మనం ఇతరులకు చెప్పాల్సింది అదే. ఒక్కసారి ప్రయత్నించండి’ అని ఆమె అంటారు. IN-SPACeలో 200కు పైగా అంతరిక్ష స్టార్టప్‌లు నమోదు కావడంతో భారతదేశ ప్రైవేట్ అంతరిక్ష రంగం విస్తరిస్తూ, కొత్త తరం ప్రతిభావంతులకు అవకాశాలను సృష్టిస్తోంది. ఇది ఈ రంగంలోని విభిన్న కోణాలను అన్వేషించడానికి మరింత మంది మహిళలను ప్రోత్సహిస్తుందని శరణ్య భావిస్తున్నారు. లింగపరమైన సవాళ్లను ఏమైనా ఎదుర్కొన్నారా అని అడిగితే.. ‘నువ్వు మహిళవి, కాబట్టి దేనికీ నాయకత్వం వహించకూడదు అనే ప్రశ్న ఎప్పుడూ రాలేదు. ఇది కేవలం నా ఒక్కదానికే కాదు. అగ్నికుల్‌లో చాలా మంది మహిళలు నాయకత్వం వహించడం నేను చూశాను. అక్కడ మహిళల పట్ల పక్షపాతాన్ని నేను ఎప్పుడూ చూడలేదు’ అని ఆమె అన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్